vasudha rani vasthumaarpidi

వసుధమాట బెట్టింగ్ బాబులు

  • తానోడి నన్నోడెనా ?
  • లేక నన్నోడి తానోడెనా ?

ఇది మహాభారతంలో ద్రౌపదిని సభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకు వచ్చేముందు ఆవిడ అడిగిన ప్రశ్న.ఖచ్చితంగా ఈ ప్రశ్న వ్యాస భారతంలో ఉండి ఉండక పోవచ్చు.మన నన్నయ గారి కాలానికి కొంత చైతన్యము ఏర్పడి ఆయన ద్రౌపది చేత ఈ ప్రశ్న అడిగించి ఉంటారు.

ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తావన రావటానికి కారణం వార్తాపత్రికలో వచ్చిన ఓ వార్త.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కళ్యాణ్ పూర్ కి చెందిన ఓ వ్యక్తి పేకాట,మాదకద్రవ్యాలకు బానిసై స్నేహితులతో కలిసి తన ఇంట్లోనే పేకాటాడి ,డబ్బంతా పోగొట్టుకుని చివరకు భార్యని పందెంలో పెట్టాడు.ఓడిపోవటంతో స్నేహితులు ఆమెను బలాత్కారం చేయబోయారు. ఆమె ఎలాగో తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు వెళితే, పోలీసులు మొత్తం విని ఇది కుటుంబ వ్యవహారం అని వదిలేశారు.
ద్రౌపది కాలానికి ,ఇప్పటికి పెద్ద తేడా ఏమీలేదు అనిపించింది .అది గుడ్డి దృతరాష్ట్ర సభ, ఇది మనకెందుకులే అనుకునే వ్యవస్థ.

ప్రస్తావన వచ్చింది కనుక ఈ విషయం మాట్లాడుకుందాం మొన్న దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ , కొన్ని రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఏ అభ్యర్థులు గెలుస్తారు అని జరిగిన బెట్టింగ్ పర్వంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి.కొందరు హఠాత్తుగా ధనవంతులు మరి కొందరు బికారులు అయ్యారు. వివిధ పార్టీలపై ప్రేమతో,నాయకులపై నమ్మకంతో బెట్టింగులు జోరుగానే సాగాయిట.

ఇవన్నీ లేటెస్ట్ బెట్టింగులనుకుంటే కొంత పాత కాలానికి వెళదాం.రోడ్డు మీద వెళ్లే వాహనాల నంబర్ల మీద సాగే బెట్టింగ్.గుఱ్ఱపుపందేలు ఈ క్రీడ రేసుకోర్సు లోకి వెళ్లటం ద్వారానే కాక ,సాంకేతికతతో వచ్చిన సౌలభ్యం వలన ఎక్క,డి వారు అక్కడి నుండే ఆడవచ్చు.చిన్న చిన్న కూలీ పనులు చేసుకుని పొద్దుటి నుంచి కష్టపడి సంపాదించిన డబ్బును ఈ గుర్రపురేసు కేంద్రాలలో అదృష్టాన్ని పరీక్షించు కోవటం కోసం పణంగా పెట్టే దురదృష్టవంతులు ఎందరో .పాత జూద క్రీడలు అన్నీ తమ రూపు మార్చుకుని జూదరుల నుంచి ఇంకా తేలికగా డబ్బును దోచుకునే పధకాలను కనుకున్నాయి.

కొన్ని ఏళ్ల క్రితం బ్రాకెట్ అని ఒక జూదం ఉండేది.అదికూడా అంకెల మీద ఆధార పడిన జూదమే .మధ్యతరగతి వారు, చిరు ఉద్యోగులు , రోజువారీ కూలీ తెచ్చుకునే పనివారు ,ఆఖరికి కొన్ని కుటుంబాలలో స్త్రీలు కూడా ఈ బ్రాకెట్ జూదం బారిన పడి ఇల్లు గుల్ల చేసుకున్నవారే. ఈ అలవాటు వల్ల రెండేసి తరాలు అభివృద్ధిలో వెనక పడిపోయిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయో.

బెట్టింగ్ అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చేది క్రికెట్ అందులో ఎవరు గెలుస్తారు అని కాసే పందేలు పాతవి ఐపోయాయి.ఇప్పుడు ట్రెండ్ ఏమిటంటే జరగబోయే ఓవర్ లో ఎన్ని రన్స్, ఔట్ అవుతారా ఇలాంటి వాటిమీద చేతిలో సెల్ ఫోన్ ఉంటే దాన్లో ఆన్లైన్ బ్యాంకింగ్,పేటీయమ్ ఉంటే చాలు .ఆటని చూడకుండా కూడా బెట్టింగ్ కాసేయచ్చు.

ఎటువంటి తెలివితేటలు,నైపుణ్యాలతో పని లేకుండా కేవలం అంకెల మీదనో,గుర్రాల మీదనో,మరేదో వస్తువు మీదనో పందెం కాసి అదృష్టం అన్న అత్యాశ మీద ఆధారపడి డబ్బు సంపాదించాలని అనుకుని తమ వద్ద ఉన్న కొద్ది డబ్బును సదరు జూద నిర్వాహకుల పాలు చేయటం ఎంత బలమైన బలహీనత.ఒకవేళ జూదంలో మనం పెట్టిన వంద రూపాయలకు వెయ్యి రూపాయలు వస్తే వచ్చుగాక.అది ఎటువంటి ఆనందం ? మనలాంటి మరో తొమ్మండుగురి సొమ్మును మనం తీసుకుంటున్నాం.

ఇక జంతువులపై సాగే పైశాచిక పందేలు కోడిపందాలు,యెడ్ల పందాలు .పెద్ద పెద్ద బండలు కట్టి యెడ్ల చేత లాగించటం .ఇవి పల్లెటూరి తరహా పందాలు ఇక్కడ కూడా మనిషి ప్రతిభ , తెలివి ఏమీలేదు ఆయా జంతువులను హింసించటమే.

మూడుముక్కలు,కాయ్ రాజా కాయ్ లు, ధనలక్ష్మి లాటరీలు ఇంకా జూద ప్రియులను ఆకర్షిస్తూనే ఉన్నాయి అంటే ఆశ్చర్యంగా ఉంటుంది.బస్ స్టాండ్ లలో ఇప్పటికీ అమ్ముతున్న సిక్కిం,భూటాన్ లాంటి లాటరీ టికెట్లను చూస్తే ఎంతమంది తేలికగా వచ్చే డబ్బుపట్ల ఆసక్తి కలిగి ఉన్నారా అనిపిస్తుంది.

పేదరికం ,అవసరాలకి సరి పోని ఆదాయం , పని పట్ల బద్ధకం ,అత్యాశ ,జోతిష్యాల మీద నమ్మకం ఇవి మనిషిని జూదరిగా మారుస్తాయి అనిపిస్తుంది.ఈ లాటరీలు,జూదాల పిచ్చి మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ ఉంది.ఐతే మనదేశంలో మధ్యతరగతి వారు,తక్కువ ఆదాయం కలిగిన శ్రామికవర్గం ఎక్కువగా ఈ వలలో చిక్కుకుంటున్నారు.

దీనికి తోడు పులిమీద పుట్రలా మాదకద్రవ్యాలు, మద్యపానము కూడా ఉంటే వారి పతనం మరింత వేగంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఓ కథ గుర్తుకొస్తోంది. ఓ వ్యక్తికి రకరకాల ప్రలోభాలు చూపితే ఉదా: జూదం ఆడమని ఇలా అతను దేనికీ ఒప్పుకోడు.అతని చేత బలవంతంగా మద్యం తాగించగానే సప్తమహా వ్యసనాలలో మిగిలిన ఆరు వ్యసనాలకు ఒప్పుకుంటాడు.

ఈ బెట్టింగ్ లను ఎలా ఆపాలో, ప్రజలలో ఎటువంటి జాగృతిని కలిగించాలో ప్రభుత్వాలు,మేధావులు కలిసి ఈ విషయంపై పారదర్శకతతో పని చేసి పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సరైన చట్టాలు ఏర్పరిచి ,బెట్టింగ్ బాబులపై ఖచ్చితంగా వాటిని అమలు పరచకుంటే, బలహీనులైన స్త్రీలు,పిల్లలపై ఈ జూద దుష్ప్రభావాలు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.