vasudha rani vasthumaarpidi

వసుధమాట పంటొస్తే….

జారిపోతున్న లాగూని ఓ చేత్తో పట్టుకొని, చిరిగిన చొక్కాని అమ్మకు చూపిస్తూ ఓ కుర్రాడు ,”అమా ,కొత్త బట్టలు కుట్టీయమా !” అనడుగుతాడు .ఆ తల్లి పిల్లవాడి లాగూని దగ్గరకు చేర్చి మంగళసూత్రం తాడుకున్న పిన్నీసు తీసి పెట్టి ,సావిట్లోంచి ఇంట్లోకి వెళ్లి సూదీదారం తెచ్చి ,చిరిగిన చొక్కాని వాడి ఒంటి మీదే వుంచి ,చిరిగిన చోట కందికాయ కుట్లు వేసి ,”ఇది పుష్యమాసం కదయ్యా ,ఓ ఇరవై రోజులు ఓపిక పట్టయ్యా ,సంకురాత్రికి పంట ఇంటికొస్తే నాలుగు జతల బట్టలు కుట్టిస్తాగా ” అంటుంది .మధ్యలో ఎన్ని పండగలు వచ్చినా నువ్వు ఇదే మాటన్నావు అంటూ రిపెయిర్ అయిన లాగూచొక్కాతో ఆడుకోవడానికి వెడతాడు. మరో ఇంట్లో ముసలామె మంచం కాస్త ఎండపొడ తగిలేలా లాక్కుని ,ఇంత చలి ఏ ఏడూ చూడలేదయ్యా ,అంటూ దగ్గుతూ , “పంటొచ్చాక నన్ను కాస్త పట్నం డాక్టర్ కాడికి తీసికెళ్ళయ్యా ,ఈ ఆచార్లగారి మందులకు నా రోగం ఏమీ తగ్గడంలా ” అంటుంది కొడుకుతో . “సూద్దాం ,ఇంకా చాలా పన్లున్నాయి పంటొచ్చాక చేయాల్సినవి ” అంటూ అరుగుమీద కూర్చుని చుట్ట చుట్టుకుంటున్నవాడల్లా లేచి వెళ్ళిపోతాడు నడి వయసు కొడుకు.

మా పిల్ల పురుటికి వచ్చింది ,కాసిని డబ్బులు కావాలమ్మా ,అంది బట్టలమూటను కింద పడేస్తూ చాకలి . “పురుడొచ్చినా ,ఏమొచ్చినా పంట రానిదే డబ్బు యాడనుంచి తెస్తామే , కావాలంటే కిందటేడు వడ్లు కొలుస్తా ,తీసికెళ్ళి అమ్ముకో “అని ఆ ఇంటి ఇల్లాలి సమాధానం . ఏరువాక ముందు వానొస్తే అని ఎదురు చూసిన రైతు ,సంక్రాంతికి ముందు పంటొస్తే అని ఎదురు చూడడం పల్లె జీవితంలో సర్వసాధారణం. సంక్రాంతి వెళ్లిన పదిరోజులకు ఓ సన్నకారు రైతు వేదన : “డబ్బులెక్కడ ఉన్నాయి బావా !పెట్టుబడి అప్పులు పోను ,యాడాది మొత్తం ఇంటి ఖర్చుకి చేసిన అప్పులు పోగా మళ్లీ పెట్టుబడికి మిగల్లేదు .ఈ ఏడు కూడా అప్పు చేయాల్సిందే . “పంటొస్తే అని ఎదురు చూసిన సంబరం నెల కూడా నిలవలేదు .

వ్యవసాయ ప్రధానంగా ఉన్న పల్లెటూళ్ళలో కేవలం జీవనాధారం వ్యవసాయ ఉత్పత్తి .అదికాస్త అటూఇటూ ఐతే అది వారి సంవత్సర కాల ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూబెడుతుంది .వానొస్తే ,పంటొస్తే , అన్నవి పట్నంవారికి తెలియని మాటలు . ఐతే పట్నంలో మధ్యతరగతి వారి కథ మరోలా వుంటుంది. జీతం వస్తే ,ఒకటో తారీఖు వస్తే అన్నమాట వారి జీవితాల్లో నిత్యం వినపడే మాట .వచ్చిన జీతమో ,ఒకటో తారీఖో, వారికి ఒరిగించేదేమీ వుండదు .పాత అప్పులు తీర్చడం ,కొత్త అప్పులకు మళ్ళీ సంసిద్ధం కావడం. కూలిపని చేసుకునేవాళ్ళ పరిస్థితి మరోరకం .వారాంతంలో వారికి ఆ వారం కూలీ అంతా ఇస్తాడు మేస్త్రీ .అందుకే వారి పదం శనివారం వస్తే ….

మొత్తానికి డబ్బు మనిషిని నడిపే ఇంధనం.

తలపని నుంచి వ్యయసాయ పనిముట్ల రిపెయిర్ దాకా కేవలం పంటొస్తే మీద ఆధారపడి ఆర్థిక విధానం నడుస్తుంది .రైతు కుంటుబడితే అనుబంధంగా నడిచే చిన్న చిన్న వ్యాపారులందరూ కుంటుపడ్డట్లే. పండిన పంటను బట్టి ,అది పలికిన రేటును బట్టి సంక్రాంతి పండుగ ఉంటుంది. ఈ సీజన్లో పల్లెలకు దగ్గర్లో ఉండే చిన్న చిన్న టౌన్లలో వ్యాపారస్తుల హడావిడి చూసి తీరవలిసిందే .ఆఖరికి పండగ పిండివంటలు కూడా పంటను బట్టే. ప్లాస్టిక్ మనీతో ఇష్టం వచ్చినట్లు వస్తు వినిమయం పెంచుకున్న తరానికి పంటొస్తే మాట విలువ తెలీదు .ఒకటవ తేదీ ,జీతమొస్తే పదాలు వారికి తెలీదు .కష్టపడి పండించిన పంటను డబ్బుగా మార్చుకునేవరకూ నమ్మకం లేని రైతు ఒక పక్క ,ఎక్కువైన సంపదను వస్తురూపంలోకి మార్చుకునే సంపన్న వర్గం ఇంకో పక్క. ఆర్థిక వ్యత్యాసాలు అధికంగా కల సమాజంలో మనుగడ సాగిస్తున్నాం మనం. ఏది ఎలా ఉన్నా , ‘పంటొస్తే ‘ అన్నమాట నాకు జవసత్వాలు నిండిన ప్రాణమున్న మాటలా అనిపిస్తుంది.
సంక్రాంతి శుభాకాంక్షలతో
వసుధా రాణి

Tags: vasudarani, latest article, vasudhamata pantosthe