vasudha rani vasthumaarpidi

వసుధమాట గృహభంగం.

  • కన్నడ మూలం :- ఎస్.ఎల్.భైరప్ప.
  • తెలుగు అనువాదం :- సంపత్.

బతుకు,మెతుకు విలువ తెలిపే నవల. ‘ప్లేగు’ జీవితాలను ఎలా కబళించింది కళ్ళకు కట్టిన నవల. దరిద్రం,అలసత్వం,స్వార్ధం,మోసం,అహంకారం,అసూయ,దుష్టత్వం,మంచితనం,సాయంచేసేబుద్ధి,వాత్సల్యం కలగలిసిన మనుషుల చిత్రీకరణ.ప్రతి పాత్రా తన పూర్తిస్థాయి వ్యక్తిత్వాన్ని,అస్థిత్వాన్ని కలిగి కలవర పెట్టటమో,స్వాంతన కలిగించటమో ఏదో ఒక ప్రభావం చూపుతాయి. భైరప్ప గారు ప్రత్యక్ష సాక్షి గా ఉండి ఆయన చుట్టూ వున్న అనుభవాలను రాసినట్లు అనిపించింది.

 

ప్రకృతిని, జననమరణాలను ,మానవ స్వభావాలను అప్పుడే కాదు ఇప్పటికీ నియంత్రించలేని మానవ దౌర్బల్యం ఈ నవలను అన్ని కాలాలకు వర్తించేలా చేసింది. అప్పుడు ప్లేగు అయితే ఇప్పుడు కరోనానో,ఎబోలానో ఏదో ఒకటి.మన కళ్ళముందు మరణాలను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవటమే.

1920-1945 లలో కర్ణాటకలోని చెన్నరాయపట్టణ తాలూకాలలో జరిగిన కథ. రామసముద్రం కరణం రామణ్ణ గారు స్వర్గస్థులైనాక ఇంట్లో మిగిలిన ఆయన భార్య గంగమ్మ,ఇద్దరు కొడుకులు చెన్నిగరాయలు,అప్పణ్ణ .గంగమ్మ ఏమాత్రం ఆడవారి సున్నితాలు లేని గంప గయ్యాళి కరోడా మనిషి. కొడుకులూ అంతే చెన్నిగరాయలు పరమ స్వార్ధపరుడు,తిండిపోతు,అసమర్థుడు,బద్ధకస్థుడు,భయస్థుడు.అప్పణ్ణ మొండి మొద్దు స్వభావుడు.నవలలో తల్లీ కొడుకుల మధ్య దుర్భాషణలు సహింపలేనివిగా ఉంటాయి పాఠకులకు కానీ ఆ సంభాషణల వల్ల వారిలోని క్రౌర్యం యొక్క తీవ్రత అర్ధం అవుతుంది వాటిని వేరు చేసి ఆయా పాత్రలను చూడలేము.

తల్లి నుంచి తప్పించుకునేందుకు చెరుకుతోట అంటించిన ప్రబుద్ధులు కొడుకులు,గుంటనక్కలాంటి మునుసబు,ఇలాంటి ఇంటికి జోస్యుల వారి కుమార్తె నంజమ్మ కోడలిగా రావటం.అత్త,భర్త,మరిది ఆమెను అమర్యాదగా చూచే తీరు,మాట్లాడే అమంగళపు మాటలు .మనకంటి ఎదురుగుండా జరుగుతున్నట్లే మనం ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉన్నట్లే అనిపిస్తుంది.

క్రమంగా నంజమ్మ పుంజుకుని చెన్నిగరాయని కరిణీకం లెక్కలు నేర్చుకుని సంసారాన్ని ఓ కొలిక్కి తేవడం,మధ్య మధ్య ప్లేగు మహమ్మారి గ్రామాలపై పడటం .ఇళ్ళు వదిలి అందరూ షెడ్లలోకి మకాం మార్చటం.ప్లేగు తగ్గాక మళ్లీ ఊరిలోకి రావటం పదే పదే ఇలా జరుగుతుండటం వలన ప్లేగు ఆనాటి ప్రజాజీవితంలో ఎంత సర్వసాధారణమో అని తెలుస్తుంది.

రామన్న,పార్వతి,విశ్వం ముగ్గురు పిల్లలని ఇన్ని కష్టాల మధ్య చక్కగా తీర్చిదిద్దుకున్న నంజమ్మ .కూతురి పెళ్లి సమయంలో భర్త గొంతెమ్మ కోర్కెలు తీర్చటానికి పడే కష్టం మన రక్తాన్ని మరిగిస్తుంది. తీరా పెళ్లి చేసిన కూతురు అత్తారింటికి వెళ్లక ముందే ప్లేగు బారిన పడటం కుమార్తె శవాన్ని దహనం చేసి వచ్చేలోపునే కుమారుడు చురుకైన రామన్న కూడా ప్లేగువల్ల చనిపోవడం.మనకి కూడా నంజమ్మ పరిస్థితి చూసి జీవితం మీద విరక్తి కలుగుతుంది.

ఆత్మహత్య చేసుకోవాలన్న నంజమ్మ విశ్వం కోసం బతకాలనుకోవటం జీవితం పట్ల ఆశ చిగురించటానికి ఓ కారణం ఉంటే చాలదా అనిపిస్తుంది.నంజమ్మ,విశ్వం,అప్పణ్ణ,చెన్నిగరాయలు చేసిన శృంగేరి యాత్ర మరువలేనిది.

ఆకలి,భయం,బ్రతుకుపట్ల ఆశ,నిరాశ చూపిన యాత్ర.
విశ్వం బడి దగ్గర పామును చంపబోగా అది తప్పించుకుంటుంది.అది పగ పడుతుంది అన్న భయంతో విశ్వాన్ని మేనమామ వద్దకు పంపుతుంది నంజమ్మ.కొడుకును మళ్లీ చూసుకోకుండానే నంజమ్మ కూడా ప్లేగు బారిన పడి చనిపోవడం.మొత్తం కథకి ఆశాకిరణంలా విశ్వం ఎదుగుతూ వుండటం .ఇదీ సంక్షిప్తంగా కథ.

గంగమ్మ,చెన్నిగరాయని పాత్రలు వెంటాడతాయి.పార్వతి పాత్ర పథేర్ పాంచాలి లో దుర్గ చనిపోయినప్పటి కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది.నంజమ్మ తండ్రి కంఠీజోస్యులు,ఆయన తల్లి కన్నమ్మ,అన్న కల్లేశు,అతని గయ్యాళి భార్య,అప్పణ్ణ భార్య సాతు,రేవణ్ణశెట్టి,ఆయన భార్య,మునుసబు శివే గౌడ,సరసి,మహాదేవయ్య అయ్యగారు,రెవిన్యూ ఇన్స్పెక్టరు ఇలా ఎన్నిపాత్రలు ఉన్నాయో అవన్నీ పూర్తి అస్థిత్వంతో నిండిన పాత్రలు వేటికవి ప్రత్యేక వ్యక్తిత్వాలతో ఇటువంటి చిత్రణ భైరప్ప గారికే చెల్లుతుంది.

“విషాదం నిండిన బతుకుల కథలు కొత్త కాక పోయినా విషాదం, సుఖం,కష్టం,మరణం వీటి అన్నిటి మధ్య బ్రతుకు గొప్పదని చెప్పిన గొప్ప నవల గృహభంగం.”