vasudha rani vasthumaarpidi

వసుధమాట.. వస్తుమార్పిడి

18 వ శతాబ్దం నుంచి 19 వ శతాబ్దం మధ్యకాలంలో వ్యవసాయం,యాంత్రికఉత్పత్తి,గనులతవ్వకం, రవాణా మరియు సాంకేతికతలలో ప్రధానమైన మార్పులు రావటం వలన ప్రపంచ దేశాల స్థితి గతులలో పెను మార్పులు వేగవతంగా జరిగాయి. సాంకేతికత, పారిశ్రామీకరణ ఈ రెండు అంశాలూ అభివృద్ధికి,వినాశనానికీ సమాన కారణాలు అయ్యాయి.ముఖ్యంగా పారిశ్రామీకరణ ప్రపంచవ్యాప్తంగా వస్తువినిమయ సంస్కృతి పెరగటానికి కారణం అయ్యింది. అసలు ఈ అర్థశాస్త్రాలూ ,ఆర్థికమాంద్యాలూ తెలియనిరోజుల్లో, అప్పుడెప్పుడో జరిగింది ఇలా చరిత్రలో చదువుకోవటమే కాదు .నా చిన్నతనంలో కూడా నాకు బాగా గుర్తు సంక్రాంతి రోజుల్లో గెనుసుగడ్డల (చిలకడదుంపలు) బండి వస్తే ,వడ్లపురిలో వడ్లు తీసుకువెళ్లి డబ్బులకు బదులుగా వడ్లు పోసి గెనుసుగడ్డలు కొనుక్కునే వాళ్ళం.

ఈతపళ్ళు,రేగుపళ్ళు,తాటిముంజలు ,ఉల్లిపాయలు ఇలా చాలా వస్తువులు వడ్లకు బదులుగా తీసుకునే వాళ్ళం.
రైతులు వరినాట్లువేసే, వరికుప్పలు నూర్చే సమయాలలో కూలి వారు దొరకటం కష్టం అని ఒకళ్ళ పనికి ఒకళ్ళు బదుళ్లు వెళ్లటం కూడా చాలా మామూలుగా వుండే అలవాటు పల్లెటూర్లలో.అలాగే కూరగాయలు,తృణధాన్యాలు వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఒకళ్ళకి పండినవి ఒకళ్ళు మార్చుకోవడం ఉండేది.

పూర్వం ప్రపంచం అంతా భారతదేశం వైపు పరుగులు తీసింది వాణిజ్యం కోసమే కదా .మన కేరళ తీరంనుంచి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాలు మనకు మణుగులకొద్దీ బంగారాన్ని పశ్చిమ దేశాలనుంచి అందించాయి.మన నూలు,మన ఎర్రచందనం ప్రపంచవ్యాప్తి చెందినవి.అంతర్జాతీయంగా ఏర్పడిన వివిధ రవాణా మార్గాలన్నీ వ్యాపార నిమిత్తం ఏర్పడినవే.

ఈ పారిశ్రామికీకరణ,ప్రపంచీకరణ జరిగిన తరువాత వచ్చిన తీవ్ర పరిణామం ఏమిటంటే అవసరాలకి మించి వస్తుఉత్పత్తి . వాటిని ఎలా అయినా అమ్ముకోవాలనే వ్యాపారధోరణి చేరి వస్తువినిమయ సంస్కృతిని పెంచి పోషిస్తూ వచ్చాయి.ఈ జాలంలో చిక్కని దేశం,మనిషి లేరు.అగ్రరాజ్యాలు ఇబ్బడిముబ్బడిగా వస్తువులను తయారు చేయడం తమ ఆధీనంలోని దేశాలకి వాటిని బలవంతంగా అమ్మటం.కొన్ని యుద్ధాలకు కారణం అధికంగా తయారు చేసుకుని ,తుప్పుపట్టిపోతున్న యుద్ధాసామగ్రీని వాడటం కోసం అంటే చూడండి వస్తుఉత్పత్తి ఏవిధంగా ఉందొ.

1947 లో బ్రిటీషు వారు మనల్ని వదిలి వెళ్లినా వారి ఎన్ని ఉత్పత్తులు మన వాణిజ్యరంగాన్నిఇంకా ఏలుతున్నాయో . విదేశీ ,స్వదేశీ అనే సిద్ధాంతం పక్కన పెట్టి వాణిజ్య చమత్కారం ఒకటి ఉదాహారణకి చుద్దాం. ఎప్పుడో పూర్వం మన పూర్వీకులు వాడి వదిలేసిన మృణ్మయ పాత్రల యొక్క గొప్పతనం ఒక అగ్రరాజ్యపు పత్రికలో వస్తుంది.వెంటనే మనకి అబ్బా మన మట్టిపాత్రలు ఎంతో గొప్పవట వాటిలో పెరుగు తోడుపెట్టుకుని తింటే ఎంతో ఆరోగ్యమట అని జ్ఞానోదయం కలుగుతుంది.

ఇంకేముంది ఆ పత్రికలోనే ఒక పక్కన వచ్చిన ఏ అమెజాన్ వారి మట్టిపాత్రల ప్రకటనో కనపడుతుంది.ఆ అగ్రరాజ్యపు అతి గొప్ప స్మార్ట్ ఫోను తీసి అమెజాన్ లో మట్టిపిడత 375 రూపాయలకు అదీ 30% తగ్గింపు ఆఫర్ అని ఆనందపడుతూ ఆర్డర్ పెట్టేస్తాము. అలా ఆ వ్యాపారదేశం మనకి మన మట్టిపిడతలని,మన ఆవుపేడకలని,పమిడివత్తులని,అష్టమూలికాతైలాన్ని మనకే తెలివిగా అమ్మేస్తుంది.

మన దగ్గర 375 రూపాయలకు కొన్న మట్టిపిడత మన ఊరి నుంచి తయారు చేసినదే కావచ్చు .తయారీదారునికి అందుకుగాను కేవలం పది రూపాయలే ముట్టి ఉండవచ్చు.లాభం వాణిజ్యం చేసిన వర్తకునిది. నష్టం తయారీదారునిది , వినియోగదారునిది. డబ్బే అవసరంలేని వస్తుమార్పిడి నుంచి మన వస్తువు మనము ముఫైరెట్లు అధికంగా కొనుక్కోవాల్సిన దుస్థితి మనకు ఈ వస్తువినిమయ సంస్కృతి కల్పించింది.మన రైతులు,మన వృత్తి కార్మికులు నష్టపోకుండా ఉండాలి అంటే మనం కొనే వస్తువులను కొద్దిపాటి విచక్షణ పాటించి కొనుక్కోవటం అలవర్చుకోవాలి.

నేరుగా ఉత్పత్తిదారుని నుంచి కొనగలిగే అవకాశం ఉన్న వస్తువులను వారి వద్దనుంచే కొనుగోలు చేయటం ఇరువురికీ లాభదాయకం. ఈ అనివార్యమైన వస్తువినిమయ సంసృతిని తట్టుకుని నిలబడగలిగిన దేశం లేదు.అయితే దీని ప్రభావాన్ని తప్పించుకోవటానికి, తగ్గించుకోవటానికి నిపుణుల సలహా ఏమిటంటే అనవసరమైన వస్తువులను కొనటం,అవసరాన్ని మించి వస్తువులను కూడ పెట్టటం కూడా తగ్గించాలి. వస్తువినిమయసంస్కృతి మాయ నుంచి బయట పడి సవ్యంగా వస్తువినియోగమెలాగో నేర్చుకోవాలి.

ముఖ్యంగా చేనేత,చేతిపనులతో చేసే ఉత్పత్తులు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులు ఇటువంటి వాటిని ప్రోత్సాహించాలి.ఎంతో మంది యువ వాణిజ్య వేత్తలు ఇప్పటికే ఇటువంటి ఉత్పత్తుల సరికొత్త మార్కెట్ అందిస్తూ వినూత్న పద్దతులలో వారికి తగిన ప్రోత్సాహాన్ని ,వాణిజ్యాన్ని ఇస్తున్నారు. వినియోగదారుని వద్దకు వస్తువును చేర్చటం అన్న పద్ధతి ఇప్పటి జీవనవిధానానికి సులువైన పద్ధతి. వస్తువుకోసం రవాణా,ఎంపిక , వెచ్చించాల్సిన సమయం ఇవి అన్నీ ఊరుకులపరుగుల జీవితంలో కష్టం కనుక ఆన్లైన్ షాపింగ్ అన్నది ఆకర్షణీయమైన ,సులువైన మార్గంగా మారి వినియోగదారులను ఆకర్షిస్తోంది.

ఐతే ఈ ఆన్లైన్ షాపింగ్ లో కూడా నేరుగా ఉత్పత్తి దారుల సైట్లు,వారికి లాభం చేకూర్చే సైట్లు ఉన్నాయి .అలాంటి వాటి ద్వారా కొనుగోలు చేయటం ఒక పద్ధతి. తిరిగి వస్తుమార్పిడి విధానానికి వెళ్లలేక పోయినా కనీసం మన చుట్టూ వున్న తయారీదారుల వస్తువులను,ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తే దేశ ఆర్థిక వికాసమునకు ఎంతో కొంత తోడ్పడిన వాళ్ళం అవుతాము.

ముంచుకు రాబోయే ఆర్థికమాంద్య భూతాన్ని తప్పించు కోవాలంటే ,డబ్బును వీలైనతవరకు మార్కెట్లో చెలామణి చెయ్యాలని .ప్లాస్టిక్ మనీ వాడకాన్ని తగ్గించాలని ఆర్థికనిపుణుల సలహా.

Tags: vasudharaani, poetry, vasudha maatalu, telugu articles