vasudha maata, role model, article, vasudharani latest articles

వసుధమాట రోల్ మోడల్

బాల భారతం సినిమాలో అర్జునుడు ఆకాశానికి బాణాలు నిచ్చెనలా వేస్తే బాల భీముడు ఆ నిచ్చెనని ఎక్కుతూ ఉంటే నేపథ్యం లో మానవుడే మహనీయుడు అన్నపాట వస్తూ ఉంటుంది .ఆ పాటకు ముందు ద్రోణాచార్యులు ఏయే యువరాజుకు ఆయా విద్యలు నేర్పించాలో వారి ప్రతిభ,ఆసక్తి ఆధారంగా నిర్ణయించి విద్యలు నేర్పాలని నిశ్చయిస్తాడు.వారి అదృష్టం కొద్దీ వారికి ముందు ఎటువంటి రోల్ మోడల్ ని ఉంచలేదు.కేవలం వారి ఆసక్తి,ప్రతిభ ఆధారంగా విద్య నేర్పబడింది.

ఓ నలభై ఏళ్లక్రితం మా చిన్నప్పుడు మేము ఓ పది కొబ్బరిచీపురు పుల్లలని కట్టగా చేసిసన్నటి పురికొసతో రెండు అంచులు వంచి విల్లు చేసి సన్నని గోగుపుల్లల్ని(తేలికగా ఉంటాయి) బాణాలుగా ఆడుకుంటుండే వాళ్ళం.దూరం,లక్ష్యము కూడా పెట్టుకుని పోటీలు పెట్టుకుని ఆడుకునే వాళ్ళం .మెత్తటి బంక మట్టి గోగు పుల్లకి చివర గుండ్రని ఉండలా పెట్టి కొడితే బాణం వెళ్లి లక్ష్యానికి కరుచు కునేది.అప్పుడప్పుడు చింతపండు ఉండలు కూడా పెట్టేవాళ్ళం. నేను అభిమన్యుడిని,నేను అర్జునుడిని ,నేను ఏకలవ్యుడిని అని మాకు మేమే పేర్లు పెట్టుకుని ఆడుకునే వాళ్ళం.

మా ఆసక్తిని గమనించి మా అక్కయ్యా,బావగారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆరోజుల్లోనే నాలుగు వేల రూపాయలు పెట్టి జాతీయస్థాయి పోటీలకు వెళ్లే పిల్లలు వాడే బ్రహ్మాండమైన విల్లంబులు కొనుక్కువచ్చి ఓ పద్ధతిలో విలువిద్యని నేర్చుకునే ఏర్పాటు చేశారు.ఇంకేముంది మాలో ఆ ఆటలా ఆడుకునే ఆనందం, ఆ బంక మట్టి,చింతపండు సృజనాత్మకత అన్నీ పోయి విలువిద్య ఓ బలవంతం గా నేర్చుకోవాల్సిన పాఠం అయింది.చిన్నగా ఒక్కొక్కరం విలువిద్య నుంచి తప్పుకున్నాం.ఆ తర్వాత మళ్ళీ చీపురుపుల్లల బాణాలే చెయ్యలేదు మేము.వేరే ఆటలోకి వెళ్లి పోయాం.

మూడేళ్ళ పిల్లవాడికి ఓ చిన్న ప్లాస్టిక్ క్రికెట్ బ్యాటు,బాలు కొనిపెట్టి వాడి ఎదుట సచిన్ టెండూల్కర్ పోస్టర్ పెట్టి అలా ఆడాలి అని చెపితే వాడిలోని బాల్యం,ఆడుకోవాలనే ఆసక్తి ఆవిరి అయిపోతుంది.అదే ఆ వస్తువులు వాడికి ఇచ్చేసి వదిలేస్తే తనకు నచ్చినట్లు,వచ్చినట్లు అడుకుంటాడు .నిజంగా వాడికి ఆసక్తి ఉంటే వాడే తరువాతి స్థాయి కి చేరతాడు.పిల్లలలో ఆసక్తిని గమనించి వారికి ప్రోత్సాహం,అవకాశం కల్పించి వదిలేయాలి .వారికి టెన్నిస్ బ్యాట్ కొనిఇవ్వగానే ఫెదరర్ని ,షటిల్ బ్యాట్ కొనగానే సైనా ని చూపితే వత్తిడికి గురయి వారిలోని సృజనాత్మకతని కోల్పోతారు.

కేవలం చదువులోనే కాకుండా పిల్లల పైకి పులిమీద పుట్రలా ఈ ఆటపాటలు ,సైన్స్ ఒలింపియాడ్ లు, స్పెల్ బి లు ఒకటేమిటి బోలెడు పోటీ సరుకు దింపేసి ప్రతి విభాగంలోనూ అత్యుత్తమంగా ఎవరున్నారో వారిని రోల్ మోడల్ గా పెట్టి వారిని కనీసం ఆ కొద్దిపాటి ఆటలు వారికి నచ్చిన విధంగా ఆడుకోనీకుండా చేసేస్తున్నాం.వారిలో ఆసక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్లే నేర్చుకుంటారు ఏదో ఒకటి అవుతారు.కేవలం వారికి కావాల్సిన వాతావరణం కల్పించటమే పెద్దల వంతు.అసలు ఇంకొకరిలా మనం ఎందుకు కావాలి మనమే ఇంకొకరు మనలా కావాలి అనుకునేట్టు తయారు కాలేమా.

అనుకరణ,అనుసరణ మధ్య ఉన్న సన్నటి గీతని ముందు తల్లిదండ్రులు గమనించాలి. ఒకరినుంచి స్ఫూర్తి తీసుకోవటం వేరు ,వారిలాగా అవ్వాలని అనుకోవటం వేరు.ఉదోగాల్లో,జీవితాల్లో మనకు అత్యంత దూరమైన భారాన్ని లక్ష్యంగా చేసుకుని వత్తిడికో,అసంతృప్తికో లోనవ్వటం కన్నా చిన్న చిన్న లక్ష్యాలని ఏర్పరుచుకుని క్రమంగా ప్రతిభని ,ప్రగతిని సాధించటం జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది.

సత్యం విషయంలో గాంధీకి సత్యహరిచంద్రుడు స్ఫూర్తి అంతే కాని రోల్ మోడల్ కాదు.మనిషి మనిషికీ తెలివి,పరిస్థితులు,అవకాశాలు,ఆసక్తులు, శారీరిక ఆరోగ్యాలు, శక్తులు విభిన్నంగా ఉండటం ప్రకృతి ధర్మం .మరి ఓ రోల్ మోడల్ పెట్టుకుని అలాగే అనుకరించి అలాగే అవ్వాలను కోవటం ఎంత అమాయకత్వం.పిల్లల్ని వారిలా ఎదగనిద్దాం ,ఎవరితో పోల్చటం,ఇంకెవరిలానో అవ్వాలనుకోవటం వారిమీద రుద్దవద్దు.ప్రతి మంచి విషయం నుంచి స్ఫూర్తిని పొందటం మాత్రం మనం నేర్చుకుని,వారికీ నేర్పిద్దాం.