madhu vachanam

మధు వచనం- పాదరక్షక బిరుదాంకిత బలిజేపల్లి

Share This

బలిజేపల్లి లక్ష్మీకాంత కవి తెలియని నాటక ప్రియులు ఉండరు. అయన రచించిన హరిశ్చంద్ర పద్య నాటకం ప్రదర్శించని తెలుగు ఊరు ఉండదు. సహజంగా గొప్ప రచయిత, రంగస్థల నటుడు. హరిశ్చంద్రుడిని పీక్కుతినే నక్షత్రకుడి పాత్ర బలిజేపల్లి స్వయంగా వేసేవారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఒకచోట హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తున్నారు. ముందు వరుసలో తెలుగు తెలిసిన ఒక బ్రిటిషు ఆఫీసరు కూర్చున్నాడు. నక్షత్రకుడిగా బలిజేపల్లి పెట్టే కష్టాలు, హరిశ్చంద్రుడిని అనే మాటలకు పట్టరాని కోపం వచ్చి చెప్పు తీసుకుని బలిజేపల్లిపై విసిరాడు. ఈ లోపు కలకలం మొదలయ్యింది.

నాటకంలో లీనమై నక్షత్రుకుడి మీద కోపం వచ్చిందని, క్షమించమని స్టేజ్ పైకి వచ్చి ప్రాధేయపడ్డాడు. బలిజేపల్లి పొంగిపోయాడు. ఆ చెప్పునే మెడలో హారానికి గుచ్చుకుని ధన్యోస్మి అన్నాడు. ఆ క్షణంలో సభికులు బలిజేపల్లికి పాదరక్షక బిరుదును ప్రదానం చేశారు. అప్పటినుండి ఆయన పాదరక్షక బిరుదాంకిత బలిజేపల్లి లక్ష్మీకాంత కవి అయ్యాడు. బహుశా ఇంకెవరికీ, ఎప్పటికీ ఈ పాదరక్షక బిరుదు రాదు. ఎందరిమీదో కోపంగా, నిరసనగా చెప్పులు పడుతుంటాయి. నటనకు అభినందనగా చెప్పు అందుకున్నవాడు బలిజేపల్లి ఒక్కడే. చెప్పు విసిరినవాడు రసహృదయుడు. వేయించుకున్నవాడు ఇంకా సరస హృదయుడు.

-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply