vasudha rani vasthumaarpidi

వసుధమాట- ఒక్క వాన చాలు

రచన:- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.

వెంకటరామిరెడ్డి గారి నవలలు.

చినుకుల సవ్వడి: 2007 చతురలో ప్రథమ బహుమతి వచ్చింది.

ఒక్క వాన చాలు: 2013లో నవ్య వీక్లీ నవలల పోటీలో ప్రథమ బహుమతి.

2017 లో కొలకలూరి విశ్రాంతమ్మ సాహితీ పురస్కారం కూడా పొందినది.

మబ్బులు వాలని నేల:సిపీఎం 21 వ మహాసభల సందర్భంగా నిర్వహించిన పోటీలలో బహుమతి పొందిన నవల.
పై మూడు నవలలు నేను చదివాను.

2017 లో ‘ ఒంటరి ‘నవల తానా అవార్డును మరో రెండు నవలలతో కలిపి పంచుకుంది.

2019 జనవరి తానా అవార్డును ‘ కొండపొలం’ నవల ఒంటరిగానే బహుమతి తెచ్చేసు కుంది.

ఇవికాక వీరు వ్రాసిన ప్రతి నవలా ఏదో ఒక బహుమతినో,అవార్డునో పొందినాయి.ఇప్పటి వరకు తొమ్మిది నవలలు వీరి కలం నుంచి వెలువడినాయి.

నేను చదివిన మూడు నవలలూ రాయలసీమ రైతు నేపధ్యంలో రాసినవే.ఒక్క వాన చాలుకు కొనసాగింపు మబ్బులు వాలని నేల.వెంకటరామిరెడ్డి గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ఆయన లోపలి మనిషి రైతు . ఈమాట ఎందుకు అనవలసి వస్తోంది అంటే నెర్రెలు విచ్చి ఆకాశం కేసి వానకోసం నోరు తెరిచిన నేల మీద కూర్చుని తానూ ఆకాశం కేసి చూస్తూ రైతు ఒక్క వాన పడితే చాలు ఈ భూమిని పచ్చగా చేయగలను అని ఆలోచించుకుంటాడు.ఒక్క రైతు ఆత్మకు మాత్రమే ఆ ఆశావహ దృక్పధం ఉంటుంది.చదివిన మూడు నవలలలోనూ ఈ దృక్పధం కనిపిస్తుంది.

తమ ఊరిలో వర్షాలు కరువై తమకి ఉన్న భూమిని పండించుకోలేక తల్లులను, పెళ్ళాం పిల్లలను వదిలి బ్రతుకుదెరువు కోసం పట్టణాల బాట పట్టిన కొందరు సన్నకారు రైతుల కథ ఈ ఒక్క వాన చాలు.ఈ నవల కొనసాగింపు మబ్బులు వాలని నేల. శివుడు అనే ఒక యువ రైతు కథానాయకుడు.గౌరి అనే ఒక నిస్సహాయురాలైన యువతి కథానాయిక.

sannapureddy venkatarami reddy

రైతు రక్తం చల్లగా ఉంటుంది నేల తల్లిలా, ఐతే వారిని బ్రతుకు తెరువు లేని వారిగానో,మోసగాళ్ళు గానో చూస్తే అంత చల్లటి రక్తం మరుగుతుంది. అడవి పందులను, పంటను పాడు చేసే పక్షులను ఎలా యుక్తితో తప్పిస్తారో అలాగే కోపం వచ్చినా శివుడు సంయమనంతో ,తెలివితో ,యుక్తితో,తర్కంతో తమను అవమాన పరిచిన వారిని ఎదుర్కోవటం,కొంత సున్నితమైన హాస్యాన్ని అందులో ఒంపటం ద్వారా రచయిత ఈ నవలకు జవజీవాల్ని ఇచ్చారు.

పేదరికంలో ఉన్నపుడు లేదా కష్టాలలో ఉన్నపుడు, అవి ఇంక ఖాయం అని తెలిసినప్పుడు . వాటిని చిన్న చిన్న చమత్కారాలతో,హాస్యంతో మిళితం చేసుకుని జీవితం గడిపేయటం ఒక గొప్ప కళ .ఇందులోని రైతులందరిలో ఆ కళ మెండుగా ఉంటుంది.చింతాకు పప్పు వొండుకున్నప్పుడు వర్ణించిన వైనం పైకి శబ్దం వచ్చేలా నవ్వుకునేంత హాస్యాన్ని సృష్టించింది.అంతర్లీనంగా ఉన్న విషాదం మాత్రం నవల చదివినంత సేపూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

అత్యాశ పడకపోవటం,పనిచేసినంతవరకే కూలీ డబ్బు ఆశించటం,ఆత్మగౌరవాన్ని,నేలమీద ప్రేమని కలిగి ఉండటం ,కష్టాల్లో ఇతరులకి సాయపడే తత్వం కలిగిన శివుడు రాజారావు అనే ఓ రిటైర్డ్ ఇంజనీర్ ని ఆకర్షిస్తాడు.తమ ఇంటి ఆవరణలోని తోటని సంస్కరించటం లో శివుడు చూపిన నేర్పు అబ్బురపడిన రాజారావు తనకు ఉన్న వందల ఎకరాల ఎస్టేట్ ను శివుణ్ణి అతని స్నేహితులని కలిసి బాగుపరచాల్సిందిగా కోరతాడు. “అయిదు ఎకరాలు ఉంటే నువ్వు రైతువి .వందల ఎకరాలు ఉంటే నువ్వు రైతువు ఎట్లా అవుతావు?.” అని అడుగుతాడు శివుడు.ఈ ఒక్క మాట మొత్తం నవల సారాంశాన్ని,విలువల్ని,రైతు హృదయాన్ని తెలిపే మాట.

తనని పెళ్లి చేసుకోమని వేధించే రౌడీ మేనమామ నుంచి గౌరినీ,ఆమె తల్లిని కాపాడే ప్రక్రియలో పోలీసు కేసు భయంతో రాజారావు ఎస్టేటులో శివుడు బృందం అనుకోని పరిస్థితులలో చేరతారు.అక్కడ వారు ఆ పొలాన్ని సాగులోకి తెచ్చే తీరు,అక్కడి వాచ్ మెన్ నాయక్ ,అతని అమాయకమైన భార్య వేరే మనకు సంబంధంలేని లోకంలో విహరిస్తాం. స్వచ్ఛతకు తేటతెల్లం అవుతాం,కుట్రలకు బాధపడతాం.భూస్వామ్య వ్యవస్థని ఏవగించుకుంటాం.ఎస్టేటులో నాటకీయ పరిణామాలు తమాషాగా ఉంటాయి.

రాజారావు తమని మోసం చేసి ఎస్టేటులో పెట్టాడని తెలుసుకున్న శివుడు ఒక్క వాన పడితే చాలు తిరిగి తమ ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకోవచ్చు అని చూస్తూ ఉండటం.మబ్బు కనపడగానే వలస రైతులందరూ ఆకాశం కేసి ఆశగా చూడటం.ఒక్కవాన పడితే బాగుండు అని మనకి కూడా అనిపిస్తుంది.ఒక్క వాన ఇన్ని సమస్యలకి పరిష్కారంగా బ్రహ్మాండగా కురవడం గౌరి చేయి పట్టుకుని శివుడు తమ ఊరు చేరటం.కథ సుఖాంతం అయినట్లు చూపటంలో వెంకటరామి రెడ్డి గారి ఆశావహ దృక్పథం కనిపిస్తుంది కానీ అంతర్లీనంగా రైతు సమస్య ఇంతటితో తీరిపోయేది కాదు అన్న భావన ,భారం మనల్ని వీడవు.

వలసలు వెళ్లిన రైతుల వెతలు, వారు ఎదుర్కొనే అవమానాలు,ఒక్కవాన కోసం వారు తపించి తీరు,భవన నిర్మాణ కాంట్రాక్టర్లు కూలి వారి శ్రమని దోచుకునే తీరు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి నవల అంతా.ఒక వానతో వీటన్నిటి పరిష్కారం.ఒక్క వాన చాలు అనిపిస్తుంది. రాయలసీమ రైతు జీవనచిత్రాన్ని తన రాతల ద్వారా సజీవంగా మన పాఠకుడి ముందు ఉంచటంలో కృతకృత్యులైన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారికి అభినందనలు.

-వసుధారాణి.