vasudha rani vasthumaarpidi

వసుధమాట “చరిత్ర”

విశాఖపట్నంలోని తొట్లకొండ బౌద్ధ స్థూపాన్ని ఎండలో,వెన్నెల్లో,వర్షంలో,కనుచీకటి పడే వేళ, సూర్యోదయ,సూర్యాస్తమయాల్లో ఇలా అన్ని కాలాల్లో చూసాను.చూసిన ప్రతిసారీ ఓ కొత్త అనుభూతి,కొంచెంసేపు మౌనంగా అక్కడ కూర్చుంటే పునీతం అయిన భావన,ఓ మైకం లాంటిది కూడా కమ్ముతుంది . బహుశా పురాతనమైన అన్న భావన పట్ల ఉన్న ప్రేమాతిశయం వలన కావచ్చు. ఐతే ఇటీవలి వర్షాలకు పగుళ్లనుంచి నీరు దిగి స్థూపం ఓ పక్క అంతా కూలిపోయింది.మొన్నవెళ్లి అక్కడ కూర్చుంటే ఓ ఆలోచన వచ్చింది కూలిన స్థూపంలోని ఇటుక రాళ్లు ఒక్కొక్కటిగా తరలింప బడవచ్చు చివరికి గద్దె మాత్రమే మిగలవచ్చుగాక ఆ స్థలంలో కూర్చుంటే వచ్చే నా పాత భావనలు అన్నీ అలాగే ఉంటాయి.అక్కడ ఉన్నరాతి తొట్లు, విరిగిన దీప స్తంభపు తలలు చాలు నా భావనను ఉద్దీపనం చేయటానికి.అది ‘చరిత్ర’ అంటే అది ‘మన పూర్వీకుల మీద మన ప్రేమంటే.’

మా ఊరుకు దగ్గరగా ఉన్న కొండవీటి కొండలకు ఇప్పుడు రోడ్డు మార్గం వేశారు కానీ చిన్నప్పుడు మేము ఏనుగుల దారి గుండానే కష్టపడి కొండ ఎక్కాము.చిన్న చిన్న మండపాలను సైతం తవ్వేసి వున్నారు నిధుల కోసం .కొండవీటి కొండల్లో తవ్వుకున్న వారికి తవ్వుకున్న నిధులు అనే వారు.పూర్తిగా కూలిపోయిన కోట ఆనవాళ్లు,అక్కడక్కడా మనం ఎక్కలేని ఎత్తుల్లో బురుజులు కొండవీటి రెడ్డి రాజుల గురించి చదువుకున్నదంతా గుర్తొచ్చి ఆ మిగిలిన కొంచెం ఆనవాళ్లకే వళ్ళు పులకించి పోయింది.

ప్రతిష్ట జరుగని ,పూజ ఎరుగని కోణార్క్ సూర్యదేవాలయం ఓపక్క ఎండకాస్తుండగానే కురిసిన వర్షంలో చూసినప్పుడు శిల్పులకు, ఆ రాజుకు,సూర్యభగవానునికి ,సముద్రునికి దణ్ణం పెట్టాను. కళింగ యుద్ధం జరిగిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ కొండమీద మొదటి లిఖిత శాసనాన్ని ప్రేమగా తడుముకున్నాను(ఈ మధ్య మళ్లీ వెళితే గాజు పలక తో బంధింప పడి ఉంది.)కళింగ యుద్ధంలో శాంతి నది రక్తనదిగా మారటం.అశోకుడు శాంతికామకుడు అవ్వటం మొత్తం చరిత్ర అంతా గుర్తుకు వచ్చి ఆనందం ,దుఃఖం కూడా కలిగాయి.

అనంతపురం జిల్లా గుత్తి కొండ మీద ఓ కోట ఉంటుంది కోట చిన్నదే.ఊరు సగభాగం ఇంకా కోటలోపలే వుంటుంది.కోట ఉన్న కొండచుట్టూ అక్కడక్కడా కూలిపోయినా పటిష్టమైన కోట గోడ చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది.టిప్పు సుల్తాన్,హైదర్ అలీ,వీర శివాజీ పాలించిన కోట అది.వీర శివాజీ మురహరిరావు అనే తన ప్రతినిధిని అక్కడ నియమించాడు .అతని కాలంలో అక్కడికి వచ్చిన మరాఠా వీరుల కుటుంబాలు,వారందరూ స్థిరపడిన’ పామిడి’ అన్న ఊరు ఇంకా అక్కడ ఉంది.

మా అక్కయ్యా వాళ్ళ ఊరు ప్రకాశం జిల్లాలో ఓ చిన్న గ్రామం కుందుర్తి అని ఆ ఊర్లో ఓ చెరువు ఉంది. ఆ చెరువు పక్కన ఓ పాడు పడి కూలిపోయిన ఓ చిన్న దేవాలయం.ఆ దేవాలయం ముందు ఓ చిన్న రాతి మండపం హంపిలోని రంగమండపం లాంటి రాతి చెక్కడం చిన్నగా వేళ్ళతో తడితే హంపీ నాదాలకి తీసి పోని సప్తస్వరాలు మోగుతాయి ఈ స్తంభాలు కూడా.నేను ఎప్పుడు వాళ్ళ ఊరు వెళ్లినా అక్కడికి వ్యాహ్యాళికి వెళ్ళటానికి ఇష్టపడే దాన్ని సాయం సందె వేళ ఆ చెరువు,గుడి సమ్మేళనం ఆమోఘంగా ఉండేది కూలిపోతేనేమి అది నా ఘన చరిత్ర అని గర్వంగా ఉండేది.

ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది,పరిరక్షణ లేదు ఇలాంటి ఆక్షేపణలు చేసేముందు మనం ఎంతవరకూ కర్తలం అని ఆలోచించుకోవాలి.ఎందుకంటే ప్రతి చారిత్రక ప్రదేశంలోనూ చరిత్ర వదిలిన ఆనవాళ్ళని మించి మనం వదిలే వ్యర్ధ పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఓ చిన్న రాతి మండపమో, ఓ శిలాశాసనమో కలింగించే గర్వం ఏ ఆధునిక కట్టడమూ నాకు కలిగించదు.ఇది నా అభిప్రాయం మాత్రమే.