ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కౌంటర్.. హైకోర్టు అసంతృప్తి!

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేశారు. సమ్మెపై కార్మిక సంఘాలు వివరణ ఇచ్చాయి. మరోవైపు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అంతేకాదు కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని కోర్టుకి తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని బస్ పాస్ హోల్డర్స్‌ను ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారా అని ప్రశ్నించింది. ఇప్పటికే అన్ని డిపో మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంది.

అయితే, మరోసారి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, ప్రభుత్వం దాఖలు చేసీన కౌంటర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ నివేదిక అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది. ఆర్టీసీ కార్మికుల తరఫున తెలంగాణ జనసమితి నేత కోదండరాం, జేఏసీ నేతలు హాజరయ్యారు.