donald trump,narendra modi,ahmedabad

‘వచ్చేస్తున్నా’.. హిందీలో ట్వీట్ చేసి అబ్బురపర్చిన ట్రంప్

న్యూఢిల్లీ : భారత్‌కు విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు టంప్‌.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు హిందీలో రిప్లై ఇచ్చారు. వారి రాకను తెలియజేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘మేము భారతదేశానికి రావాలని ఎదురుచూస్తున్నాం. మేము దారిలో ఉన్నాం. కొద్ది గంటల్లో అందరినీ కలుస్తాం!’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి ఆయన నిన్న వాషింగ్టన్‌ డీసీ నుంచి ఎయిర్‌ఫోర్స్‌ 1 విమానంలో బయల్దేరిన సంగతి తెలిసిందే. వారి వెంట కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ కూడా ఇండియా వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వారంతా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అంతకు ముందు ప్రధాని మోదీ ట్విటర్‌లో.. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు స్వాగతం పలికేందుకు యావత్‌ భారతం ఎదురుచూస్తోంది. మీ సందర్శన కచ్చితంగా ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అహ్మదాబాద్‌లో కలుద్దాం’ అని పేర్కొన్నారు.