కొత్త సచివాలయంలో కెసిఆర్
సర్వాంగ సుందరంగా తెలంగాణ అధికార భవనo
: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొదట ప్రధాన ప్రవేశ గేటు వద్ద పూజలు నిర్వహించిన సీఎం తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమశాల వద్ద యాగ పూర్ణహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు చేరుకొని పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేసి పరిపాలనను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయ ప్రారంభం నా చేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టం అన్నారు. ఈ నిర్మాణంలో అందరి కృషి ఉన్నది. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలూ వెలుగుతున్నాయి. అంబేద్కర్ చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నామని చెప్పారు.
గాంధీ మార్గంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే రాష్ట్రం సాధ్యమైంది. సచివాలయానికి ఆయన పేరు పెట్టుకోవడం గర్వకారణం. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందరికీ జోహార్లు. తెలంగాణ పునర్నిర్మాణంపై కొందరు అవాకులు, చెవాకులు పేలారు. తెలంగాణ మొత్తం కూలగొట్టి కడతారా అని హేళన చేశారు.
మిషన్ కాకతీయతో చెరువుల రూపురేఖలు మార్చాం. మత్తడి తొక్కుతున్న చెరువులే రాష్ట్ర పునర్మిర్మాణానికి తార్కాణం. విమర్శలు పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయడమే మా విధానం. చెక్ డ్యామ్‌ల వల్ల వేసవిలోనూ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. వేసవిలోనూ దేశవ్యాప్తంగా 96 లక్షల ఎకరాలు సాగయ్యాయి.
దేశంలో సాగైన దాంట్లో 54 లక్షల ఎకరాలు మన వద్దే సాగైంది. తెలంగాణ పల్లెలు ఎన్నో అవార్డులు సాధిస్తున్నాయి. కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడం రాష్ట్ర పునర్మిర్మాణమే.