home page

పాలమూరుకి ఈ ఘనత : కెసిఆర్

 | 
Kcr

ఏనాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, కీర్తి దక్కుతుంది: సీఎం కేసీఆర్‌

పాలమూరు ఎంపీగా కొనసాగుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని, ఏనాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, కీర్తి దక్కుతుందని తాను సగర్వంగా చెబుతున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు.

మహబూబ్‌నగర్‌ పర్యటనలో భాగంగా మొదట టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. 

పాలమూరు ఎంపీగా కొనసాగుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని, ఏనాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, కీర్తి దక్కుతుందని సగర్వంగా చెబుతున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ పర్యటనలో భాగంగా మొదట టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. సాయంత్రం ఎంవీఎస్‌ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. 'ఈ రోజు మహబూబ్‌నగర్‌లో అద్భుతమైనటువంటి కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించుకొని, నా చేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రతినిధులు, ప్రజలందరినీ అభినందిస్తున్న.

పరిపాలన సంస్కరణల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 23కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని, అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్‌లు నిర్మించుకుంటున్నాం. ఇంకా అనేక నిర్మాణాలు చేపడుతున్నం. ఇవన్ని గొప్పగా చేయగలుగుతున్నమంటే ఆ నాడు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటున్నాం కాబట్టి. స్వపరిపాలన సాధ్యమైంది కాబట్టి ఇంత అద్భుతమైన నిర్మాణాలు చేసుకోగలుగుతున్నాం. అన్నింటికి మించి తెలంగాణ ఉద్యమం రెండో దఫా ప్రారంభమై కొనసాగే సందర్భంలో నేను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం మీకు తెలుసు. ఏనాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, కీర్తి దక్కుతుందని సగర్వంగా చెబుతున్నా'నన్నారు.

పాటతో ఆకట్టుకున్న సీఎం కేసీఆర్‌

'ఉద్యమ సందర్భంలో పాలమూరు జిల్లాకు వస్తే వేధనలు, రోధనలు, బాధలు, వలసలు పోయే బిడ్డలను బొంబాయి బస్సులకా బిడ్డలు సాగనంపే ఏడ్చే తల్లుల రోధనలు.. చాలా భయంకరమైన దుస్థితి. ఆత్మహత్యలు, ఆకలి చావులు, గంజి కేంద్రాలు, పాలమూరు జిల్లా అంటేనే ఒక భయంకరమైన కరువు జిల్లా. 30, 50 ఎకరాలుండే రైతులు కూడా హైదరాబాద్‌లో కూలీ చేసే పరిస్థితి. ఆ బాధ పోవాలని, మన రాష్ట్రం వస్తే బాగుపడమని ఎన్నో కలలు గని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం.

వాటి ఫలితాలు మీ కండ్ల ముందు ఉన్నయ్‌. దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు కవి గోరటి వెంకన్న రచయితలను పాటలు రాయి మని చెప్పిన. పల్లె పల్లెలో పల్లేర్లు మొలిచే పాలమూరులో అని ఆనాడు పాటలు పాడినం.. ఇవాళ పల్లేర్లు మాయమైనయ్‌. బొంబాయి బస్సులు కూడా బంద్‌ అవుతున్నయ్‌. వలసపోయిన బిడ్డలు అంతా వాపస్‌ వస్తున్నరు. 'వలసలతో వలవల విలపించు పాలమూరు.. పెండింగ్‌ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసి.. చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి.. పాలమూరు తల్లి పచ్చ పైటగప్పుకున్నది' అని చెప్పి పాటలు రాయమని' చెప్పినట్లు సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు.

పాలమూరు – రంగారెడ్డికి కేంద్రం సహకరించడం లేదు

'కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా దశాబ్దాల పాటు పెండింగ్‌ పెట్టి కోయిల్‌సాగర్‌ లాంటి చిన్న లిఫ్ట్‌ను కూడా పెండింగ్‌ పెట్టి.. ఎంత చెప్పినా వినకుండా సమైక్య పాలకులు మనల్ని నిరాధరణకు గురి చేశారు. కానీ, వెనువెంటనే స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరం ఇప్పుడు ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటున్నం. చెరువులు బాగు చేసుకున్నం. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసుకుంటున్నాం. వీటి ఫలితంగా ఇవాళ బ్రహ్మాండంగా పాలమూరు అంటే కరువు జిల్లా కాదు.. పచ్చబడ్డ పచ్చని పంటల జిల్లా అని పేరు వస్తుంది.

మహబూబ్‌నగర్‌లో పరిస్థితి మారుతుందని పలువురు చెబుతున్నరు. ఒకే ఒక ప్రాజెక్టు కంప్లీట్‌ కావాల్సి ఉంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం సహకారం అందించడం లేదు. నీటి వాటాను తేల్చడం లేదు. కాలువ పనులను త్వరలోనే ప్రారంభం చేసుకోబుతున్నాం. పాతవి, కొత్తవి, కరెంటు అన్ని కలిసి 25 నుంచి 35లక్షల ఎకరాల్లో పంటలు పండే రోజు రాబోతుందని సంతోషంగా తెలియజేస్తున్నా'నన్నారు.