home page

తెలంగాణ ఐటీ వైతాలీకుడు

డాలర్ స్వప్నికుడు బి వి ఆర్ మోహనరెడ్డి 

 | 
Bvr
అంతలోనే సరికొత్త బాధ్యతా మొదలైంది.

BVR.Mohan Reddy | ఆటగాడు పతకం వెంట పరుగులు తీస్తాడు. ఆంత్రప్రెన్యూర్‌ కలల వెంట పరుగెత్తుతాడు. అతని దృష్టిలో ఉద్యోగం, జీతం, ప్రమోషన్‌, నాయకత్వ స్థానం.. చిన్నచిన్న మజిలీలే. ఓ కంపెనీ స్థాపించాలన్న కోరిక మాత్రం చిటారుకొమ్మన మిఠాయి స్వప్నంలా ఊరిస్తూనే ఉంటుంది. ఆలస్యం చేసినకొద్దీ రెచ్చగొడుతూనే ఉంటుంది. బి.వి.ఆర్‌.మోహన్‌ రెడ్డి కూడా లక్ష్యం వెంబడి ఓ ఒలింపియన్‌లా పరుగు పెట్టారు. ఇన్ఫోటెక్‌ సంస్థను స్థాపించారు. అక్కడితో ఆయన కల పూర్తయింది. అంతలోనే సరికొత్త బాధ్యతా మొదలైంది. ఆ మలుపులు, మెరుపులను 'ఇంజినీర్డ్‌ ఇన్‌ ఇండియా' పుస్తకంలో వివరంగా పంచుకున్నారు. 'ఫ్రమ్‌ డ్రీమ్స్‌ టు బిలియన్‌-డాలర్‌ సైయెంట్‌’.. మొత్తంగా తన ప్రయాణమంతా పూసగుచ్చినట్టు వివరించారు.

ఉదయం తొమ్మిది గంటలు. బడికి ఆలస్యం అవుతుందన్న తొందర. నాన్న వేగంగా కారు నడుపుతున్నారు. అంతలోనే బ్రేక్‌ పడింది. కారణం, రైల్వే క్రాసింగ్‌ దగ్గర గేటు మూసుకుంది. అప్పటికి నాకు ఏడేండ్లు. కొత్తగా ఏం కనిపించినా కండ్లింతలు చేసుకుని చూడటం నా అలవాటు. దట్టమైన పొగ వదులుతూ స్టీమ్‌ ఇంజిన్‌ వెళ్తుంటే.. నోరెళ్లబెట్టుకుని చూశాను. వెనువెంటనే ఓ రైలుబండి. ఒకటి.. రెండు.. మూడు.. పది.. పదకొండు – అన్ని బోగీలను లాక్కుని వెళ్తున్న రైలింజిన్‌ ఓ అద్భుతంలా అనిపించింది. మరుక్షణం నుంచే యంత్రాలతో ప్రేమలో పడ్డాను. మరికొన్నాళ్లకు రోడ్డు రోలర్‌ నా దృష్టిని ఆకట్టుకుంది. వందమంది మనుషుల పని.. అవలీలగా చేసేస్తుంటే.. అబ్బురపడ్డాను. అంతలోనే బోలెడు సందేహాలు. నా చిట్టిబుర్రకు అర్థమయ్యే భాషలో నాన్న మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సూత్రాలు చెప్పారు. 'అయితే, పెద్దయ్యాక నేను రోడ్‌రోలర్‌ ఇంజినీర్‌ అవుతా' అని ప్రకటించా. నాన్న బిగ్గరగా నవ్వారు. 'మంచి నిర్ణయం. బాగా చదువుకుంటే తప్పకుండా అవుతావు' అని భుజం తట్టారు. బాల్యం నుంచీ నేనో పుస్తకాల పురుగును. జిజ్ఞాస ఎక్కువ. ప్రతి విషయాన్నీ శాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు. చర్చా పోటీలలో పాల్గొనేవాడిని. బహుమతులు గెలుచుకునేవాడిని.

నాన్న మహబూబ్‌నగర్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు పుట్టాన్నేను. హైదరాబాద్‌లోని సెయింట్‌ ప్యాట్రిక్స్‌లో కొంతకాలం చదువుకున్నాను. ఎందుకో ఓ దశలో నా చదువు గాడితప్పింది. అన్ని సబ్జెక్ట్స్‌లోనూ అత్తెసరు మార్కులు. నాన్నకు ఎప్పుడూ క్యాంపులే. అమ్మకు ప్రోగ్రెస్‌ కార్డు చూపించడానికి ధైర్యం సరిపోలేదు. తనకు కనిపించకుండా పుస్తకాల మధ్య భద్రంగా దాచిపెట్టాను. ఎలా తెలిసిందో మరి, బయటికి తీసి..'ఇదేమిటి?' అని అడిగింది. నాకు ఏడుపు తన్నుకొచ్చేసింది. 'ఈ మాత్రం చదువులకు స్కూల్‌ ఎందుకు? ఊరికి పంపించేస్తాను. తాతయ్య దగ్గర వ్యవసాయం నేర్చుకుందువుగాని' కళ్లెర్రజేస్తూ చెప్పింది అమ్మ. సేద్యం అంటే అయిష్టతలేదు కానీ, ఓటమిని అంగీకరించడానికే మనసు ఒప్పుకోలేదు. పట్టుదలతో చదివాను. తదుపరి పరీక్షల్లో నేనే క్లాస్‌ ఫస్ట్‌! ఇంటర్‌ తర్వాత.. తగిన వయసు లేకపోవడంతో ఐఐటీలో సీటు రాలేదు.

వ్యాపార స్వప్నాలు

బీటెక్‌ తర్వాత, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో చేరాను. కానీ నా ఆలోచనలన్నీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ చుట్టే ఉండేవి. టెక్నాలజీని వ్యాపారానికి అనుసంధానం చేయగలిగితే.. అద్భుతాలు సాధించవచ్చని నా విశ్వాసం. పట్టాతో బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టే సమయానికి నా దగ్గర డబ్బు లేదు. అనుభవం లేదు. అయితేనేం? గుండెలనిండా ఆత్మవిశ్వాసం. ఎదగాలన్న తపన. మాదేం సంపన్న కుటుంబం కాదు. కానీ, నా కలల్ని నిజం చేసుకోవడానికి సరిపడా మనోబలాన్ని ఇచ్చారు అమ్మానాన్న. నాన్న వైపు చూస్తే తాతయ్య రైతు. నాన్న పోలీసు అధికారి. అమ్మ వైపు.. తాతయ్య బ్రిటిష్‌ ప్రభుత్వంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌. వ్యాపార నేపథ్యంలేని వాతావరణం. దీంతో అనుభవం తప్పనిసరి అనిపించింది. అందుకు ఉద్యోగమే మార్గం. హైదరాబాద్‌ బాలానగర్‌లోని శ్రీరామ్‌ రిఫ్రిజిరేషన్స్‌లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా చేరాను. నా నాయకత్వంలో దాదాపు మూడొందలమంది ఉండేవారు. ప్రతి షిఫ్ట్‌లో ఇరవై ఐదు డీజిల్‌ ఇంజిన్లు తయారు చేయించాలి. ఇది నా బాధ్యత. తొలిదశలో లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యంగా అనిపించింది. తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయలేకపోతున్నానేమో అనే అపరాధభావం వెంటాడేది. నాకు అనుభవం లేకపోవచ్చు. కానీ పుట్టుకతో వచ్చిన జిజ్ఞాస ఉంది. పెన్ను, పేపర్‌ ముందేసుకుని కూర్చున్నాను. లోపం ఎక్కడుందో గ్రహించాను. సునాయాసంగా లక్ష్యాన్ని సాధించాను. శ్రీరామ్‌ రిఫ్రిజిరేషన్స్‌ యజమాని లాలా చరత్‌ రామ్‌జీ.. ఆలోచనలు, క్రమశిక్షణ నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఎంతో ప్రోత్సహించేవారు. ఇంక్రిమెంట్ల మీద ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు. నా దృష్టిలో ఆ కార్ఖానా మరో ఐఐటీ ఆవరణ. అక్కడ నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాక.. అమెరికాలో పెద్ద చదువులపై దృష్టిపెట్టాను. కారణం, పాశ్చాత్యదేశాలలో శరవేగంగా వృద్ధిచెందుతున్న టెక్నాలజీ నన్ను ఆకట్టుకుంది. యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌లో సీటు రావడమంటే ఆ రోజుల్లో గొప్ప విజయమే. కానీ, నా వీడ్కోలు చాలా ఉద్వేగభరితంగా సాగింది. రామ్‌జీ నా రాజీనామాను ఆమోదించలేదు. 'అమెరికా వెళ్లు. చదువుకో. మళ్లీ వచ్చాక ఆఫీసు వ్యవహారాలు చూసుకో. నెలనెలా నీ జీతం నీకు అందుతుంది' అని సర్దిచెప్పారు. నేను ఆ ప్రతిపాదనను తిరస్కరించాను. నా అమెరికా ప్రయాణాన్ని నాన్న కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.

'అమెరికాలో చదువుకోవడం నా కల. దాన్ని నిజం చేసుకోవడానికి వెళ్తున్నాను. అంతేకానీ, మీ మీద ప్రేమలేక కాదు. పట్టా చేతికి రాగానే తిరిగొచ్చేస్తాను' అని చెప్పి ఒప్పించాను. ఈ సందర్భంలోనే నేను మరో వ్యక్తిని పరిచయం చేయాలి. నా భార్య సుచిత్ర. అప్పటికే తను తొమ్మిది నెలల గర్భిణి. నిండు మనసుతో నాకు వీడ్కోలు పలికింది. నేను అమెరికా బయల్దేరిన మరుసటి రోజే కృష్ణకు జన్మనిచ్చింది. అమెరికాలో ఉన్నా.. నా మనసంతా భారత్‌ చుట్టే. ప్రతిక్షణం కుటుంబమే గుర్తుకొచ్చేది. తిరిగి వచ్చేయాలన్న పట్టుదలతో ఏడాదిలోనే మొత్తం కోర్సు పూర్తిచేశాను.

కొత్త దృక్పథం

అమెరికా చదువు నా దృక్పథాన్ని మార్చేసింది. అక్కడ ఉన్నప్పుడే కంప్యూటర్లతో ప్రేమలో పడ్డాను. భవిష్యత్తు వాటిదేనని, ప్రతి రంగాన్నీ ప్రభావితం చేయబోతున్నాయని అర్థమైపోయింది. ఆ రంగంలో నైపుణ్యం పెంచుకోవడానికి మోటార్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ (మికో-బోష్‌)లో సిస్టమ్‌ ఎనలిస్ట్‌గా చేరాను. శ్రీరామ్‌ రిఫ్రిజిరేషన్స్‌లో ప్రతి పనిలో యజమాని జోక్యం ఉండేది. ఇక్కడ మాత్రం ఓ బలమైన వ్యవస్థ నిర్మించారు. అన్నీ పద్ధతి ప్రకారం జరిగేవి. మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ పెంచుకోవడానికి ఈ అనుభవం పనికొచ్చింది. హిందుస్థాన్‌ కంప్యూటర్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ లాంటి దిగ్గజాలతో పరిచయానికి కారణమైంది. ఆ సంస్థ సహ-వ్యవస్థాపకుడు అర్జున్‌ మల్హోత్రా నాకు ఉద్యోగం ఆఫర్‌ చేశారు. అదీ హైదరాబాద్‌లో. కాకపోతే, సేల్స్‌ బాధ్యతలు. ఇదీ ఒకందుకు మంచిదే అయ్యింది. 'నెవర్‌ గివప్‌.. ఓటమిని అంగీకరించొద్దు' అన్న సూత్రాన్ని అక్కడే ఒంటబట్టించుకున్నాను. ఆ తర్వాత మరో మజిలీ.. ఓఎంసీ. ఆ కంపెనీలో ఉద్యోగం నన్ను పరిపూర్ణ ఆంత్రప్రెన్యూర్‌గా మార్చింది. అక్కడినుంచి బయటికి వచ్చే సమయానికి నాకు అందులో మూడు శాతం వాటా ఉంది. కొత్త కంపెనీ ఏర్పాటుకోసం అమ్మేశాను. నా నిర్ణయం సుచికి పెద్దగా నచ్చలేదు. ఎక్కడైనా తేడా వస్తే.. ఇద్దరు పిల్లల భవిష్యత్తు సంక్షోభంలో పడుతుందేమో అని ఆమె భయం. 'పిల్లలు ఇంకా చిన్నవాళ్లు. కృష్ణకు పదిహేను. వైష్ణవికి పదేళ్లు. వాళ్ల భవిష్యత్తుకు మీరెలా భద్రత ఇస్తారు?' నిలదీసినంత పనిచేసింది.
ఆ ప్రశ్నలో నిజాయతీ ఉంది. అంతకుమించి తల్లిప్రేమ ఉంది. కలల్ని నిజం చేసుకోవాలనే ఆరాటంలో కుటుంబాన్ని విస్మరించలేం కదా. పిల్లలు ఎదిగే వరకూ స్థిరమైన ఆదాయం ఉండాలన్నది మా ఆవిడ అభిప్రాయం. అందుకు ఒకటే మార్గం కనిపించింది. తన పేరుతో సికింద్రాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ ఉంది. దాన్ని అమ్మేసి, బెంగళూరులో ఓ కమర్షియల్‌ ప్రాపర్టీ కొన్నాం. దీనివల్ల నెలనెలా మంచి అద్దె వస్తుంది. పిల్లల అవసరాలకు సరిపోతుంది. అలా ఓ సమస్య పరిష్కారమైంది.

ఇన్ఫోటెక్‌కు శ్రీకారం

నా కల నిజమైంది. ఇన్ఫోటెక్‌ ఎంట్రప్రైజెస్‌ పేరుతో ఓ సంస్థను స్థాపించాను. మా డైనింగ్‌ హాల్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌గా మారిపోయింది. ఉద్యోగ జీవితంలో సంపాదించుకున్న ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాను. కుటుంబసభ్యులు, స్నేహితులు ఐదు లక్షల వరకూ సేకరించారు. బ్యాంకు నుంచి తొంభై ఏడు లక్షల రూపాయలు రుణంగా తీసుకున్నాను. కంపెనీ స్థాపించిన తొమ్మిదేండ్ల వరకూ నేను ఇన్పోటెక్‌ నుంచి జీతం తీసుకోలేదు. తీసుకున్నా నామమాత్రమే. ఆ తర్వాత.. సంస్థ లాభాల నుంచి నా వాటాగా భారీ మొత్తమే బ్యాంకు ఖాతాలో పడేది. ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీవో)కు వెళ్లాక.. మా పరిధి మరింత విస్తరించింది. ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతిపై దృష్టి సారించాను. అప్పటికే ఊపందుకుంటున్న డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఇన్ఫోటెక్‌ విజయానికి ఎంతో ఉపకరించింది. జనరల్‌ మోటార్స్‌ మా తొలి కస్టమర్‌. సుచి మా కంపెనీ అకౌంట్స్‌ వ్యవహారాలు చూసుకునేది. వ్యాపారం కొంత వృద్ధిచెందాక, సిబ్బంది పెరిగాక ఆఫీసును మరో చోటుకు తరలించాం. ఇన్ఫోటెక్‌ ఐటీ దిగ్గజంగా అవతరించడానికి ఎంతో సమయం పట్టలేదు. యూకే, యూరప్‌లకూ విస్తరించాం. అంతర్జాతీయ సంస్థలను విలీనం చేసుకున్నాం. అనేకానేక కారణాలతో 'ఇన్ఫోటెక్‌’ అనే పేరును 'సైయెంట్‌ టెక్నాలజీస్‌’గా మార్చినా.. మా విలువలు, నిబద్ధత మాత్రం మారలేదు. కాలక్రమంలో 'ఇన్ఫోటెక్‌’ పేరుతో పుట్టగొడుగులు వెలిశాయి. వాటి కారణంగా మా బ్రాండ్‌ నేమ్‌ బద్నామ్‌ కాకూడదనే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నాం. సైయెంట్‌.. సైన్స్‌+క్లైంట్‌+ఇంజినీరింగ్‌, టెక్నాలజీ పదాల కలయిక. సైయెంట్‌ ఇప్పుడు.. గ్లోబల్‌ డిజిటల్‌ ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కంపెనీ!

బృందమే విజయం

నేను ఓఎంసీ కంప్యూటర్స్‌లో పనిచేస్తున్న రోజులవి. మా బాస్‌ నన్ను తన క్యాబిన్‌కు పిలిచారు. ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత..'మోహన్‌! రేపు నువ్వు ఆఫీసుకు వస్తున్నప్పుడు ఏ బస్సో గుద్దేసింది అనుకో. సంస్థ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే, దాదాపుగా ప్రతి విభాగంలో నీ పాత్ర చాలా ఉంది' అంటూ తన మనసులో మాటను కాస్త కఠినంగానే చెప్పారు. ఆ క్షణంలో నాకు.. నా ఇద్దరు పిల్లలే గుర్తుకొచ్చారు. మళ్లీ ఇరవై ఏండ్ల తర్వాత మరో వ్యక్తితో సరిగ్గా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎనలిస్ట్‌ నుంచి 'హఠాత్తుగా మీకు ఏమైనా అయితే ఇన్ఫోటెక్‌ పరిస్థితి ఏమిటి?' అని. ఆ క్షణంలో నాకు పిల్లలు గుర్తుకురాలేదు. ఎందుకంటే ఇద్దరూ తమ జీవితాల్లో స్థిరపడ్డారు. నేను లేకపోయినా నెగ్గుకురాగలరు. కానీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్ఫోటెక్‌ మీద ఆధారపడిన ఐదువేల మంది సిబ్బంది, వాళ్ల కుటుంబాలు మనసులో మెదిలాయి. ఏ వ్యవస్థా ఒక్క వ్యక్తి మీద ఆధారపడి నడవకూడదు. అందుకే, బృంద నాయకత్వానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించాను.

దార్శనికుడు.. మంత్రి కేటీఆర్‌

కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగానికి సరికొత్త ఊపు ఇస్తున్నారు మంత్రి కేటీఆర్‌. ఆ యువనేత దూరదృష్టి, దార్శనికత నన్ను ఆకట్టుకున్నాయి. అనేక సందర్భాల్లో మేం కలుసుకున్నాం. వివిధ విషయాలు చర్చించుకున్నాం. తెలంగాణలో ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అవసరాన్ని నొక్కి చెప్పాను. టీహబ్‌ ఆయన ఆలోచనలకు ప్రతిరూపం. వ్యవస్థాపక డైరెక్టర్‌ హోదాలో ఆ అంకుర వేదికకు నా వంతు సహకారం అందించాను. ఏదో ఒకరోజు హైదరాబాద్‌ ప్రపంచానికి ఆవిష్కరణల పాఠాలు చెబుతుంది. ఆంత్రప్రెన్యూర్స్‌, ఇన్వెస్టర్స్‌, కార్పొరేట్స్‌, మెంటర్స్‌.. అందరినీ ఒకే ఛత్రం కిందికి తీసుకురావడం సామాన్య విషయం కాదు. అది టీ హబ్‌కే సాధ్యమైంది.

'మోహన్‌! కార్పొరేట్‌ కారిడార్స్‌లో బొత్తిగా నల్లపూస అయిపోయారు. ఏం చేస్తున్నారు?' ఆ మధ్య జరిగిన కాన్ఫరెన్స్‌లో ఓ మిత్రుడు అడిగిన ప్రశ్నకు నేనిచ్చిన జవాబులోనే నా భవిష్యత్‌ ప్రణాళిక ఉంది.. 'నిజమే. వేగం తగ్గించాను. నా బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొంటున్నాను. నాకు ఈ దేశం అత్యున్నత ప్రమాణాలున్న విద్యను అందించింది. అందుకు కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలి. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను'

కస్టమర్‌ ఈజ్‌ గాడ్‌.. అని నేను బలంగా నమ్ముతాను. కస్టమర్ల మనసు గెలుచుకో… కస్టమర్ల నమ్మకం నిలుపుకో.. అని మా సిబ్బందికి చెబుతుంటాను . అలా అని ఉద్యోగులను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు. అతి సామాన్య యువతీ యువకులను ఉద్యోగంలోకి తీసుకుని.. లీడర్స్‌గా తీర్చిదిద్దాం. మూడు దశాబ్దాల క్రితం మా సంస్థలో చేరిన తొలి ఉద్యోగి.. సునీల్‌ కుమార్‌ ఇప్పటికీ మాతోనే ఉన్నారు.

"నీ విశ్వాసాలే నీ ఆలోచనలు. నీ ఆలోచనలే నీ మాటలు. నీ మాటలే నీ చర్యలు. నీ చర్యలే నీ అలవాట్లు. నీ అలవాట్లే నీ విలువలు. నీ విలువలే నీ జీవితం. ..అంటారు మహాత్మాగాంధీ. 'వ్యాల్యూస్‌ ఫస్ట్‌’ అని నమ్మాడు మహాత్ముడు. నేనూ ఆ మార్గాన్నే ఎంచుకున్నాను. దశాబ్దాల ప్రయాణంలో ఎప్పుడూ దారి తప్పలేదు. మడమ తిప్పలేదు. సర్కారు, సహోద్యోగులు, కుటుంబం, వ్యాపార సమాజం.. ఏ ఒక్కరి సహకారం లేకపోయినా ఈ గెలుపు అసాధ్యం".

(బి.వి.ఆర్‌. మెహన్‌ రెడ్డి రచన 'ఇంజినీర్డ్‌ ఇన్‌ ఇండియా' ఆంగ్ల పుస్తకంలోని కొన్ని అధ్యాయాల స్వేచ్ఛానువాదం ఇది. పెంగ్విన్‌ సంస్థ ప్రచురించింది. తన రచనను అమ్మ రత్నకుమారికి, నాన్న నాగిరెడ్డికి, జీవన సహచరి సుచిత్రకు, పిల్లలు.. కృష్ణ, వైష్ణవికి అంకితమిచ్చి తాను బంధాల మనిషినని నిరూపించుకున్నారు మోహన్‌ రెడ్డి.

(సౌజన్యం : నమస్తే తెలంగాణ )