రిజర్వేషన్లకు కేసీఆర్ సమర్థన
మరిప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అదే !
రిజర్వేషన్ల పెంపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లపై మరోసారి చర్చ సాగుతున్నది
ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ ఆవిర్భావ అనంతరం సామాజిక కూర్పు విషయంలో నెలకొన్న వాస్తవిక పరిస్థితి ఆధారంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అసెంబ్లీలో ఏకగీవ్ర తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధం కాదని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి వివరించారు. రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగం ఏం చెబుతున్నది? తీర్పుల సందర్భంగా సుప్రీంకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏంటి? 9వ షెడ్యూల్‌ను సవరించడం ద్వారా తమిళనాడులో అమలవుతున్న 69 శాతం రిజర్వేషన్ల వివరాలను సీఎం కేసీఆర్ 2018లో ప్రధాని మోదీకి వివరించారు.
వీల్లేదనే నిబంధన ఎక్కడా లేదు!
'రిజర్వేషన్లు పెంచటానికి వీల్లేదని రాజ్యాంగంలో ఎక్కడాలేదు. రాజకీయ నిర్ణయం జరిగితే రిజర్వేషన్లు సాధ్యమే' అని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తెలంగాణలో 6% ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని కుమ్రరం భీం -ఆదివాసీ భవన్, సేవాలాల్ మహారాజ్ బంజారాభవన్‌ల ప్రారంభోత్సవ సభలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రధాని మోదీ అనుసరిస్తున్న వైఖరిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్ ఎప్పుడేమన్నారు..
'జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగం చెప్తున్నది. ఆ మేరకు రిజర్వేషన్లను మార్చాల్సిన అవసరంపై కేంద్రం తక్షణం ఆలోచించాలి' అని 2017, మార్చి 15న అసెంబ్లీలో అన్నారు.
'రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ, పెంచుకోవటానికి తగిన కారణాలు కోరింది. 9వ షెడ్యూలులో చేర్చడం ద్వారా తమిళనాడులో రిజర్వేషన్లను 69% వరకు పెంచారు' అని 2018, ఆగస్టు 4న సీఎం కేసీఆర్ ప్రధానిని కలిసినప్పుడు తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలని కోరారు.
'రిజర్వేషన్లు 50% మించొద్దన్న ప్రతిబంధన రాజ్యాంగంలో ఎక్క డా లేదు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. తెలంగాణ విషయంలో ఎందుకు చేతులు రావటం లేదు. మా బిల్లు కు వెంటనే ఆమోదం తెలిపి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి పంపాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది' అని సెప్టెంబర్ 17న హైదరాబాద్ ఎన్టీయార్ స్టేడియంలో జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనం సభలో సీఎం అన్నారు.
బీసీగణన ఆవశ్యకతను నొక్కి చెబుతున్న తీర్పు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం బీసీ గణన ఆవశ్యకతను నొక్కిచెబుతున్నది. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా బీసీ గణన విషయంలో కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలి. ఏ వర్గం నష్టపోకుండా ఉండాలంటే బీసీ జన గణన అనివార్యంగా జరగాలి. తెలంగాణ శాసనసభ బీసీ గణనపై చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. బీసీ గణన జరిగితే వివిధ కులాలకు కచ్చితమైన రిజర్వేషన్ శాతాలు నిర్ణయించవచ్చు.
- టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కే కేశవరావు