home page

వారసులు వస్తున్నారు జాగ్రత్త !

రాజకీయ నేపథ్యం

కుటుంబ వారసత్వం 

 | 

*_రాచరికాలు పోయినా_*
*_వెంటాడుతున్న వారసత్వాలు..!_*

🤴🏽🫅🏻🤴🏽🫅🏻🤴🏽🫅🏻

ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారన్నాడు
మన్యం వీరుడు తెల్లోడి తుపాకి గుళ్ళకు బలవుతూ..
అది జరిగిందో లేదో..

కాని..

ఒక్కో రాజకీయ నాయకుడు చనిపోతుంటే ఒకరు లేదా ఇద్దరు వారసులు 
పుట్టుకొచ్చేసి సొంత ఆస్తులు పంచుకుంటున్నట్టు అధికారాన్ని..రాష్ట్రాలను పంచేసుకుంటున్నారు..
తమ  తండ్రి ఒక్కడే మహానేత అంటూ చొక్కాలు చింపేసుకుంటున్నారు..!

కొందరు నాయకులైతే బ్రతికి ఉండగానే వారసులకు ట్రైనింగ్ ఇచ్చి తాము ఉన్నప్పుడే..లేదంటే మరణించిన వెంటనే 
సింహాసనం ఎక్కడానికి సిద్ధం చేస్తున్నారు.!

ఇది పూర్వం మన రాజుల కాలం నుంచి ఉన్న సంస్కృతే.అయితే ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా ఇదే కొనసాగడం విచిత్రం..
తెల్లోళ్ళ దేశంలో  ఇప్పటికీ కొనసాగుతున్న వ్యవస్థ..
ఆ తెల్లోళ్ళు మన దేశాన్ని వదిలివెళ్ళిన తర్వాత మొట్టమొదట అధికారపీఠం అధిరోహించిన జవహర్ లాల్ నెహ్రూ ఈ వారసత్వ వ్యవస్థకు పురుడు పోశారు..
తాను ప్రధానిగా ఉండగానే కూతురు ఇందిరను వారసురాలిగా సిద్ధం చేసేశారు.

నెహ్రూ మరణానంతరం కొంత గ్యాప్ వచ్చినా లాల్ బహదూర్ శాస్త్రి అకాలమరణంతో ఇందిరా గాంధీ సువిశాల భారత దేశానికి ప్రధాని కావడంతో వారసత్వ అధికార వ్యవస్థ 
ఊపిరి పోసుకుంది.
ఇందిరమ్మ తన వారసులు రాజీవ్..సంజయ్ గాంధీలు ఇద్దరినీ రాజకీయాల్లోకి తెచ్చారు.వారిలో రాజీవ్ తదనంతర కాలంలో ప్రధాని అయ్యారు కూడా..ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబం అధికారమే నడుస్తోంది..!

ఇదిలా ఉంటే వారసత్వ రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని..ఇందిరాగాంధీని...
రాజీవ్ గాంధీని విమర్శించిన ఎన్నో పార్టీలు..ఎందరో నాయకులు ఇప్పుడు అవే వారసత్వ రాజకీయాలలో మునిగి తేలుతూ దేశం మొత్తాన్ని తిరిగి రాచరిక వ్యవస్థలోకి నెట్టేస్తున్న పరిస్థితులు దాపురించాయి.

ఎవరి సంగతో ఎందుకు..
ఇందిరాగాంధీ వారసత్వ రాజకీయాలను పెద్ద గొంతుతో దుయ్యబట్టి 1983 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారపీఠాన్ని అధిరోహించిన నందమూరి తారక రామారావు కూడా అనతికాలంలో తన కుటుంబసభ్యులకు పార్టీలో పెత్తనం అప్పగించారు..ఆ జాబితాలో అల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు..
నారాచంద్రబాబు నాయుడు..తర్వాత సంతానం హరికృష్ణ ..
పురంధేశ్వరి..
బాలకృష్ణ..ఇప్పుడు మనవడు లోకేష్  ఉన్నారు.
చంద్రబాబు లేటుగా వచ్చి  లేటెస్టుగా పార్టీలో ఆధిపత్యం సాగించి అన్నీ తానే అయ్యారు.అలా కుటుంబం చేతిలో చిక్కుకుపోయిన ఎన్టీఆర్ చివరకు అదే కుటుంబ సభ్యుల కారణంగా పదవీచ్యుతుడు కావడమే గాక తాను స్వయంగా పురుడు పోసిన పార్టీని చేజార్చుకున్న దీనస్థితిని
ఎదుర్కోవలసి వచ్చింది..!

ఇలా వారసత్వ రాజకీయాల్లో ఆరితేరిపోయిన నాయకులు ఇప్పుడు దేశమంతా విస్తరించి ఉన్నారు..
బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్
అవినీతి కేసులో అరెస్ట్ అయి అస్సలు రాజకీయ పరిజ్ఞానం లేని తన సతీమణి రబ్రిదేవిని సిఎం చేశారు.ఇప్పుడు ఆయన కుమారులిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు.

ఇక ములాయం సింగ్ యాదవ్ కుమారుడు కూడా ఆయన వారసత్వం అందుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళు రాజ్యం చేశారు.

తమిళనాడులో డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబంలో ఎందరో రాజకీయాల్లో వెలిగిపోతున్నారు..ఆయన కుమారుడు స్టాలిన్ 
ఇప్పుడు తమిళనాడు
ముఖ్యమంత్రిగా ఉన్నారు.
కుమార్తె కనిమొళి కూడా యాక్టివే..మారన్లు సైతం తమిళనాడులో..జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులే..!

కర్ణాటక..మహారాష్ట్ర..
గుజరాత్..కాశ్మీర్..
అక్కడా ఇక్కడా 
అని ప్రత్యేకంగా 
చెప్పడం ఎందుకు..
ఆసేతుహిమాచలం
వారసుల కోలాహలం..!

రాజకీయాల్లో అత్యంత నిబద్ధత కలిగిన వ్యక్తిగా..
అపర చాణక్యుడిగా పేరొందిన పివి నరసింహారావు కూడా వారసత్వ రాజకీయాలకు
మినహాయింపు కాలేదు.
ఆయన కుటుంబమూ వారసుల కదంబమే!
మర్రి చెన్నారెడ్డి..జలగం వెంగళరావు..శివశంకర్..
ఆనం కుటుంబం...
పేర్ని ఖాందాన్..గుడివాడ ఫ్యామిలీ..నల్లపరెడ్డి వంశం..
ఇలా రాసుకుంటూ పోతే రాజకీయ జాతి సమస్తం కుటుంబపారాయణం..
విలువల పలాయనం..!

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కుటుంబ పాలనే నడుస్తోంది..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాందాన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని శాసిస్తోంది..ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర రావు వారసులుగా కెటిఆర్..కవిత..హరీశ్ రావు 
బలమైన శక్తులుగా మారి
మొత్తం రాష్ట్రంలో తమ ప్రాబల్యాన్ని విస్తరించేసారు.
కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు కెటిఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అప్పుడే రంగం సిద్ధమైపోతోంది.కుటుంబ పాలన..రాజకీయ వారసత్వాల విషయానికి వస్తే వర్తమాన యవనికపై కేసీఆర్ కుటుంబమే అగ్రస్థానంలో ఉన్నట్టు లెక్క..
అంత ఘనత వహించిన నెహ్రూ కుటుంబంలో సైతం ఇలా ఒకేసారి నలుగురు వ్యక్తులు పెద్ద పదవుల్లో ఉండడం జరగలేదన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.నెహ్రూ ప్రధానిగా ఉన్నపుడు ఇందిర ఆయన వెంట ఉంటూ రాజకీయాలు నేర్చుకున్నారు గాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు.నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ఆమె ఎంపిగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి శాస్త్రీజీ అకాలమరణం తర్వాత ప్రధాని పదవి చేపట్టారు.
ఇందిర కుటుంబం 
నుంచి సంజయ్..రాజీవ్..
సోనియా..రాహుల్.. మనేకా..వరుణ్ గాంధీ..ఇలా ఒక పరంపర పెద్ద పదవులు నిర్వహించినా ఇప్పుడు కేసీఆర్ కుటుంబం లాగా ఒకేసారి నలుగురు పెద్ద పదవుల్లో ఉండడం జరగలేదు.ఆమాటకొస్తే ఇందిర భర్త ఫిరోజ్ కూడా ఎంపినే..అది వేరే విషయం!

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వారసుడి
రూపంలో వై ఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు.రాజశేఖర రెడ్డి కుటుంబం కూడా వారసత్వ రాజకీయాలకు పెద్ద అడ్డాగానే విరాజిల్లుతోంది.
రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిళ
మొదట్లో అన్న వెంట నడిచినా తర్వాత ఆయనకు
దూరమై ప్రస్తుతం తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఆమె తల్లి..రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కూడా మొదట్లో ఎమ్మెల్యేగా పనిచేశారు.కాక వైఎస్ బంధువులు ఎందరో రాజకీయాల్లో ఉన్నారు.వారిలో కొందరు కీలక పదవుల్లో ఉన్నారు కూడా..!

ఇంతేనా..గ్రామ..మండల.. పట్టణ..జిల్లా స్థాయిల్లో
వారసుల జాబితాలు చాంతాడులను మించి ఉన్నాయి.

రానున్న ఎన్నికల్లో జాతీయ స్థాయిలోనైతేనేమి..రాష్ట్రాల్లో అయితేనేమి బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోకొల్లలుగా వారసులు క్యూ కట్టి ఉన్నారు.లి

సురేష్ కుమార్