తెలంగాణలో 'గోబ్యాక్ మోడి' పోస్టర్లు ,ఫ్లెక్సీ బ్యానర్లు !!
శనివారం రామగుండంలో మోడీ పర్యటన
ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం
మోదీ తెలంగాణ పర్యటన అనగానే ఏవో ఒక ఫ్లెక్సీలు వెలుస్తుండటం సర్వసాధారణం. జూలైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు కూడా 'సాలు మోదీ - సంపకు మోదీ' అంటూ టీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్‌ను ప్రారంభించింది.
'బైబై మోదీ' అంటూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మరోసారి మోదీ తెలంగాణకు రానున్నారు. శనివారం నవంబర్ పన్నెండు వ తేదీన ఆయన తెలంగాణకు వచ్చి.. పెద్దపల్లి జిల్లా రామగుండం లోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయనున్నారు.
అయితే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తాజాగా ఫ్లెక్సీలు వెలిశాయి. చేనేతపై విధించిన జీఎస్టీ ని వెనక్కి తీసుకున్న తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలంటూ.. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ (Jublee hills Check Post) వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 'మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ' అంటూ ఫ్లెక్సీలు చెక్‌పోస్ట్‌తో పాటు పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ఇలా ఫ్లెక్సీలు కలకలం రేపుతుంటే మరోవైపు కార్మిక సంఘాలు, విద్యార్థి జేఏసీలు చేస్తున్న హెచ్చరికలు తెలంగాణలో మరింత కాకరేపుతున్నాయి.
మోదీ పర్యటనతో పెరుగుతున్న రాజకీయ వేడి !
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణలో రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. మరోవైపు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారంటూ కార్మిక లోకం సైతం ప్రధానిపై మండిపడుతోంది. ఈ క్రమంలోనే ఆయన పర్యటనను అడ్డుకుంటామని కార్మిక సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. వామపక్ష, విద్యార్థి జేఏసీ నేతలు సైతం మోదీ పర్యటనను అడ్డుకుంటామని, ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమై ఉత్పత్తి కూడా మొదలయ్యాక ఇప్పుడు దానిని ప్రారంభించడం ఏంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.