home page

ఉనికి కోల్పోయిన టిఆర్ఎస్

ఎదిగే శక్తిలేని  బీఆర్ఎస్  

 | 
kumaracswamy kcr

ఉనికి కోల్పోయిన టి.ఆర్.ఎస్.
ఎదిగే శక్తిలేని బి.ఆర్.ఎస్.!


(లక్ష్మీనారాయణ  టీ  )

తెలంగాణ అస్థిత్వవాదంతో పురుడుపోసుకొని, పెరిగి, పెద్దదై, అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్.) నేడు భారత్ రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)గా పేరు మార్చుకొన్నది. పర్యవసానంగా టి.ఆర్.ఎస్. ఉనికి కోల్పోయింది. బి.ఆర్.ఎస్.కు దేశంలో ఎదిగే అవకాశాలు మృగ్యం. ప్రాంతీయ అస్థిత్వవాదంతో ఎదిగిన సంకుచిత రాజకీయ నాయకత్వానికి జాతీయ దృక్పథం వంట పట్టదు. 

టి.ఆర్.ఎస్., బి.ఆర్.ఎస్.గా రూపాంతరం చెందుతున్నదని కేసీఆర్ అధికారిక ప్రకటన చేస్తున్నపుడు జెడియు(సెక్యూలర్) నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార్ స్వామి అతిథిగా ప్రక్కన కూర్చున్నారు, కానీ, కలిసిపోతామని చెప్పలేదు, కలిసి పని చేస్తామన్నారు. కొంత కాలం క్రితం కెసిఆర్ ను కలిసిన మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బిజెపిని వ్యతిరేకించే మరొక పార్టీ రాజమండ్రిలో పోటీ చేయని పక్షంలో కేసీఆర్ పార్టీ పోటీ చేస్తే ఓటేస్తానని వ్యంగ్యాస్త్రం సంధించారు. 

2019 ఎన్నికలకు ముందు ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేస్తామంటూ బయలుదేరిన కెసిఆర్ మంతనాలు చేసిన బిజూ జనతా దళ్ అధినేత, ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, డిఎంకె అధినేత, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, తర్వాత కాలంలో కేసీఆర్ వైపే చూడలేదు. 

ఇటీవలి కాలంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికంటూ బయలుదేరిన కేసీఆర్ పాట్నాలో ప్రసారమాధ్యమాల ప్రతినిధులతో  మాట్లాడుతుండగానే జెడి(యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వేదికపై నుంచి లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేసిన దృశ్యం చూశాం. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ నేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, తదితరులను కలిసి మంతనాలు చేశారు. వాళ్ళల్లో ఏ ఒక్కరూ హైదరాబాదు వైపే కన్నెత్తి చూడలేదు. పోనీ, ఇతర రాష్ట్రాల నుండి మరెవరైనా వచ్చారా! అంటే అదీ లేదు. 

2019 ఎన్నికల తదనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరైనారు. అటుపై, హైదరాబాదులోని తన నివాసానికి ఆహ్వానించి, భారీ కాన్వాయ్ తో "రెడ్ కార్పెట్" స్వాగతం పలికి, కేసీఆర్ మాటల్లో ఆప్యాయంగా "పీటేసి భోజనం" వడ్డించారు(తర్వాత కాలంలో కేసీఆర్ ఎద్దేవచేస్తూ ఈ మాటలన్నారు). కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో జగన్మోహన్ రెడ్డిని అతిథిగా భాగస్వామిని చేశారు. ఇరువురు ప్రేమాభిమానాలు ప్రదర్శించారు. తర్వాత కొంత కాలానికి ఎవరి ప్రయోజనాలు వారివే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అదీ సంగతి. 

కేంద్రంలో కొద్ది కాలం కేంద్ర మంత్రిగా పని చేసిన కేసీఆర్ పెట్టిన బి.ఆర్.ఎస్. పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో! ఎవరికైనా బోధపడుతుంది. ఇల్లు అలకాగానే పండుగ కాదు. పార్టీ పేరు మార్చగానే అది జాతీయ పార్టీ అయిపోదు. ఆకాశంలో మేడలు కట్టిన నానుడి గుర్తుకొస్తుంది. 

టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటించుకొన్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ కూడా చేశారు. మంచి ఓట్లు సంపాదించుకొని, కొంత మంది శాసన సభ్యులుగా గెలిచారు. అధికార వ్యామోహంతో టి.ఆర్.ఎస్. కండువా కప్పేసుకొన్నారు. 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ, పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తదితర రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉన్న స్థానాల్లో కూడా పోటీ చేసే సాహసం చేయలేదు. 

వైఎస్సార్సీపీ జాతీయ పార్టీగా ప్రకటించుకోక పోయినా 2014 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి కొన్ని శాసన సభ స్థానాల్లో, ఒక లోక్ సభ స్థానంలో గెలిచింది. వాళ్ళు కూడా అధికార దాహంతో టీ.ఆర్.ఎస్.లో కలిసిపోయారు. తర్వాత ఆ పార్టీ దుకాణాన్ని మూసేశారు. ఆల్ ఇండియా అన్నా డిఎంకె ఇంకే రాష్ట్రంలోనైనా ఉన్నదా! ఇలాంటి పార్టీలు ఇంకా కొన్ని ఉన్నాయి. 

ఎన్నికల కమిషన్ దగ్గర నమోదు చేసుకొన్నంత మాత్రాన ప్రతి పార్టీ జాతీయ పార్టీ అయిపోదు కదా! ఎన్నికల కమిషన్ వద్ద జాతీయ పార్టీగా నమోదు చేసుకోవడం తొలి మెట్టే, జాతీయ పార్టీగా గుర్తింపు లభించాలంటే మూడు రాష్ట్రాల నుండి లోక్ సభలో 2% సీట్లు అంటే 11 స్థానాల్లో గెలవాలి లేదా లోక్ సభ/శాసన సభ సాధారణ ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాలలో 6% ఓట్లు సాధించుకొని నాలుగు లోక్ సభ స్థానాల్లో గెలవాలి లేదా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. నేడు జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉన్న ఎనిమిది పార్టీల్లో ఆరు పార్టీలు తమ గుర్తింపును కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయన్నది గమనార్హం.

హైదరాబాదు కేంద్రంగా వ్యాపారం చేసుకొంటున్న ప్రసారమాధ్యమాలకు విధిలేక కేసీఆర్ పెట్టిన బి.ఆర్.ఎస్.కు కృత్రిమంగా "హైప్" సృష్టిస్తున్నట్లు కనపడుతున్నది. సోషల్ మీడియా ఉండనే ఉన్నదనుకోండి. అంతే! 

గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో మోడీ ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న లౌకిక - ప్రజాస్వామ్య - సమాఖ్య వ్యవస్థకు ప్రమాదకారిగా పరిణమించే విధానాలను - పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లులను, దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి, ప్రయివేటీకీకరణ విధానాలను వేగవంతం చేసి కార్పోరేట్ దిగ్గజాల ఆధిపత్యంలోకి నెడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఏనాడైనా కెసిఆర్ ప్రతిఘటించారా!

గడచిన ఎనిమిదేళ్ళుగా కేసీఆర్ సుపరిపాలన అందించలేదు కదా! అవినీతి, అప్రజాస్వామిక పాలన చేశారు. కాబట్టే, టి.ఆర్.ఎస్.కు తెలంగాణాలో అడుగూడి పోతున్నదనే భయాందోళనలు కంటికి కునుకులేకుండా చేశాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో కాస్త నోరు తెరచి మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల వెనకాల ఏదో మతలబు ఉన్నదని ప్రజలు అనుమాన చూపులు చూస్తున్నారు. మోడీ - కెసిఆర్ లాలూచీ కుస్తీ చేస్తున్నారేమోనన్న అనుమానాలూ ప్రజల్లో లేకపోలేదు. ఇద్దరూ హోరాహోరీ పోట్లాడుకొంటున్నట్లు "సీన్" సృష్టిస్తే మధ్యలో కాంగ్రెస్ ఎత్తిపోతే ఉభయులకు లాభం చేకూరుతుందని కుటిల రాజనీతిని అమలు చేస్తున్నారేమోనని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ అనుమానాలకు ప్రాతిపదిక మోడీ - కేసీఆర్ వ్యక్తిత్వాలపై ఉన్న అవిశ్వాసమే. వీటిని భవిష్యత్తే నివృత్తి చేయాలి సుమా!

సమాఖ్య వ్యవస్థను గురించి మాట్లాడే కేసీఆర్ పార్లమెంటు చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని, అధికారాన్ని చేజిక్కించుకొన్న తర్వాత ఆ చట్టంలో పేర్కొన్న అంశాలు అమలుకు మాత్రం ససేమిా అంగీకరించడం లేదు. నదీ జలాల వినియోగ అంశం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అనుమతులు లేకుండానే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం, అక్రమంగా జల విద్యుదుత్పాదన, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినా విద్యుత్ బాకాయిలు చెల్లించక పోవడం, షెడ్యూల్ IX మరియు X జాబితాలోని ఉమ్మడి ఆస్తుల పంపకం, తదితర అంశాల్లో అంధ్రప్రదేశ్ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న కేసీఆర్ పెట్టిన బి.ఆర్.ఎస్.కు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే కనీస అర్హత ఉందా! ఆ పార్టీలో చేరే దౌర్భాగ్యులు కూడా ఉంటారా! 

ఏమో చెప్పలేం! విచ్ఛిన్నకారులను, విధ్వంసకారులను, అవినీతిపరులను, అవకాశవాదులను, పార్టీల ఫిరాయింపుదారులను ఆదరిస్తున్న నేటి ఆంధ్రప్రదేశ్ సమాజం పోకడలు చూస్తుంటే తెలుగు జాతిని రెండు ముక్కలు చేసిన, ఆంధ్రులను నోటికొచ్చినట్లు దూషించిన కేసిఆర్ కు అక్కడక్కడా స్వాగత సత్కారాలు చేస్తారేమో! గతంలో ఒక అనుభవం ఉన్నది కదా! అప్పుడెప్పుడో రాయలసీమను రతనాలసీమ చేస్తామని కేసీఆర్ నోట మాయమాటలు జాలువారితే ఉప్పొంగిపోయి గజమాలలు వేసిన ప్రబుద్ధులున్న సమాజం కదా! 

కేసీఆర్ కొంత కాలం తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అక్రమ కట్టడమని, కృష్ణా నది జలాలను దొంగలించుకు పోతున్నారని, కె.సి.కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది 39.9 టియంసిలు కాదు, 10 టియంసిలేనని మాట్లాడడం, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏకంగా వ్రాత పూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం చూశాక సన్మానాలు చేసిన ప్రబుద్దుల నోట మాట పడిపోయింది. ఇలాంటి చరిత్ర కేసీఆర్ కు చాలానే ఉన్నది. అలాంటి వ్యక్తి పెట్టిన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశంలో ఆదరించే వారు ఉంటారనుకోవడం లేదు.

పరంగా