భగ్నమైన కమలం కుట్ర !
ప్రభుత్వాలను కూల్చడంలో దిట్ట
- బలం లేకున్నా గద్దెనెక్కే బీజేపీ కుట్రలు
- 8 ఏండ్లలో 8 రాష్ర్టాల్లో పాగా
- ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యం
- ఎమ్మెల్యేలను కొనాలి లేదా బెదిరించాలి
- ముందే పసిగట్టి తప్పించుకున్న నితీశ్
- తమ ఎమ్మెల్యేలకూ ఎర వేశారన్నఅరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఎట్లయినా కూలదోయాలి. మెజార్టీ ప్రజలిచ్చిన తీర్పును కాలరాయాలి. ఇందుకోసం దేనికైనా తెగబడాలి.. ఎంతకైనా దిగజారాలి. ఇదీ బీజేపీ కూటనీతి. 2014లో మోదీ అధికారంలోకి రావడమే తరువాయి.. రెబెల్స్‌ను తయారు చేయడం.. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఎగదోసి లొంగదీసుకోవడం లేదా వందల కోట్లతో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపడం కమలదళానికి నిత్యకృత్యమైంది. ఎమ్మెల్యేల గాలం ముగిశాక.. ప్రభుత్వాలను కూలదోసి ముఖ్యమంత్రి పదవిని కబ్జాచేయడం మోదీ బీజేపీ సిద్ధాంతంగా మారిపోయింది. 2014 నుంచి 8 రాష్ట్రాల్లో బీజేపీ.. తమకు మెజార్టీ లేకున్నా అధికారంలోకి రావడమే ఇందుకు ఉదాహరణ.
1అరుణాచల్‌ప్రదేశ్: 2014లో అరుణాచల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 60 సీట్లకు 42 సీట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ 11 సీట్లతో సరిపెట్టుకొన్నది. రెండేండ్లలో సీన్ మారిపోయింది. 2016 జూలైలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పెమాఖండుతో తిరుగుబావుటా ఎగురవేయించి, ఆ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌లో చేర్పించి, అనంతరం బీజేపీలో కలుపుకొన్నది.
2 కర్ణాటక:2019 ఎన్నికల తర్వాత కర్ణాటకలో జేడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ బీజేపీకి ఈ పరిణామం మింగుడుపడలేదు. 16 మంది ఎమ్మెల్యేలను లొంగదీసుకొని కుమారస్వామి సర్కారును పడగొట్టి మళ్లీ యడ్యూరప్పను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.
3 మధ్యప్రదేశ్: 2018 ఎన్నికల్లో 121 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. యువనాయకుడు జ్యోతిరాదిత్య సింధియాతోపాటు 26 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపు తిప్పుకోవడంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలిపోయింది. సింధియా అనూహ్యంగా కేంద్రమంత్రి అయిపోయారు.
4 మణిపూర్:2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. 21 సీట్లే వచ్చిన బీజేపీ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకొని దొడ్డిదారిన అధికారం చేపట్టింది.
5 గోవా: 2017లో జరిగిన ఎన్నికల్లో 40 స్థానాలకు గాను.. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేవలం 13 సీట్లు గెలుచుకొన్న బీజేపీ తొలుత ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తనవైపు లాక్కున్నది. ఆ తర్వాత 10 మందిని ఫిరాయించేలా చేసింది.
6 సిక్కిం: 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు (మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామింగ్ మినహా) అందరూ బీజేపీలో చేరిపోయారు.
7 పుదుచ్చేరి:కాంగ్రెస్‌తోపాటు డీఎంకేకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకొన్నది.
8 మహారాష్ట్ర:శివసేనలో చీలిక తెచ్చి రెబెల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేతో గువహటిలో క్యాంప్ పెట్టించింది. సీఎం పదవికి శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే రాజీనామా చేయగానే, షిండేను సీఎంగా చేసి వెనుకుండి మంత్రాంగాన్ని నడిపిస్తున్నది.
వెంట్రుకవాసిలో తప్పించుకొని..
రాజస్థాన్‌లో సైతం అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నించింది. సచిన్ పైలట్‌ను తనవైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించినట్టే ఫలించి విఫలమైంది. దీంతో అక్కడ కాంగ్రెస్ ఊపిరిపీల్చుకొన్నది. బీహార్‌లో మిత్రపక్షం జేడీయూకు వెన్నుపోటు పొడవాలనుకున్న బీజేపీ కుట్రను ముందుగానే పసిగట్టిన నితీశ్.. ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బెంగాల్‌లో సువేందు అధికారి సాయంతో..ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌ను దెబ్బకొట్టాలన్న బీజేపీ పాచికలు పారలేదు. కాగా, తమ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రూ. 800 కోట్లను ఆశచూపిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లోనూ బీజేపీ తమ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించిందని మమతా బెనర్జీ గతంలో ధ్వజమెత్తారు.
(నమస్తే తెలంగాణ పత్రిక సౌజన్యం )