మూసీ నది పై పారిస్ తరహా వంతెనల నిర్మాణం ప్రతిపాదన
రూ.545 కోట్ల తో 14 వంతెనల ప్రతిపాదన
- ఈ నెలాఖరులోగా డిజైన్లు ఖరారు, వచ్చే నెలలో పనులు
- హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్ శాఖల కసరత్తు
- రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు, ఒక లింకు రోడ్డు
- పారిస్‌లో అధ్యయనం చేసిన ఉన్నతాధికారుల బృందం
హైదరాబాద్లో చారిత్రక మూసీ నదిపై పారిస్ తరహాలో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. చారిత్రక వైభవం చాటేలా, స్థానికత ప్రతిబింబించేలా డిజైన్ రూపకల్పన జరుగుతున్నది. ఇప్పటికే రూ. 545 కోట్లతో మూసీపై 14 బ్రిడ్జిలు, ఓ అనుసంధాన రహదారి నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయగా..నిర్మాణంలో భాగంగా సరికొత్త విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారుల బృందం అధ్యయనానికి పారిస్‌లో పర్యటన చేసి వచ్చారు. ఇక్కడ కూడా పారిస్ తరహా బ్రిడ్జిలు డిజైన్ చేయాలని భావించారు. అక్కడి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్/ఇంజినీర్ మార్క్ మిమ్రామ్‌తో ప్రత్యేక సమావేశమై నదిపై వంతెనల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యాటక ప్రాంతం అభివృద్ధిపై చర్చించారు. పారిస్‌లోని సెస్ నదిపై 37 బ్రిడ్జిలున్నాయి.
ఇందులో కొన్ని పాదచారుల వంతెనలు కాగా..మెజార్టీ వాహనాల రాకపోకలు కోసం నిర్మించినవి. నగరం మధ్యలో నది ఉన్న నేపథ్యంలో ఇరువైపులా ప్రాంతాలను కలుపుతూ నదిపై బ్రిడ్జిలు నిర్మించారు. ఈ నేపథ్యంలోనే మన నగరంలోని మూసీపై 14 బ్రిడ్జిలు, ఓ అనుసంధాన రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.ఇందులో అఫ్జల్‌గంజ్ వద్ద పాదచారుల వంతెన మినహా..మిగిలినవన్నీ 13 హైలెవల్ బ్రిడ్జిలు కలిపి రూ. 545 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఈ నెలాఖరులోగా డిజైన్ల రూపకల్పన పూర్తి చేసి కొత్త ఏడాదిలో పనులకు టెండర్లను ఆహ్వానించి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.