ప్రతిపక్షాల కూటమి పై ఎంపీ కవిత తీవ్ర విమర్శ

కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రతిపక్షాలు దుష్టచతుష్టయ కూటమిగా ఏర్పడ్డాయని ఈ రోజు కవిత విమర్శించారు. తెలంగాణ పాలిట ఈ కూటమి శాపంగా తయారయిందని దయ్యబట్టారు. ఈ రోజు నిజామాబాద్ లో పర్యటించిన ఆమె పలు వినాయక మండపాలను సందర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల గల్లంతు పేరుతో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత 68 ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను పీక్కు తిన్నాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో జరగని అభివృద్ధిని కేసీఆర్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే చేసి చూపిందని ఆమె అన్నారు.