home page

ఇవాళ మహాకవి శ్రీ శ్రీ జయంతి

మేరు పర్వతం శ్రీ శ్రీ కి అక్షరాంజలి

 | 
శ్రీశ్రీ

మహాకవి-మహాపరిశోధన

మహా కవి - మహా పరిశోధన
         
      ఇవాళ మహాకవి శ్రీశ్రీ పుట్టిన రోజు. ఏప్రిల్  30వ తేదీ రాగానే శ్రీశ్రీగారి పుట్టిన రోజుగా ఆయన అభిమానులు మరొక్కసారి ఆయన్ని తలుచుకుంటూ సభలు, సమావేశాలూ నిర్వహిస్తున్నారు గాని ఓ పాతిక ముప్ఫై ఏళ్ల కిందట శ్రీశ్రీగారు పుట్టిన రోజు విషయంలో కొంత గందరగోళం ఉండేది. ఫలానా తేదీన పుట్టాడని కొందరూ..కాదు, ఇదే తేదీన పుట్టాడని మరి కొందరూ వాదించుకునేవారు. ఎవరికి తోచిన తేదీన వారు శ్రీశ్రీగారి పుట్టినరోజును జరుపుకునేవారు.
           ఈ గందరగోళానికి తెర దించుతూ , '1910 ఏప్రిల్ 30వ తేదీనాడే శ్రీశ్రీ గారు పుట్టారహో" అని మొట్టమొదట  సాధికారికంగా ప్రకటించిన వ్యక్తి ఒకరున్నారు.
           ఆయనే శ్రీశ్రీ వీరాభిమాని, విరసం నేత చలసాని ప్రసాద్ గారు.
       **********
       ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేనప్పుడు ఆంధ్రభూమి, విశాఖ ఎడిషన్ లో న్యూస్ ఎడిటర్ గా ఉన్నాను. 
      చలసాని ప్రసాద్ గారు మెళ్లో ఓ సంచీతో రొప్పుకుంటూ వచ్చారు. ప్రసాద్ గారు నేను ఏవీఎన్ కాలేజీలో చదువుకున్నప్పట్నించీ పరిచయం. ఆయన అక్కడ లెక్చరర్ గా పని చేశారు.
       ప్రసాద్ గారు కుర్చీలో కూర్చుని, స్తిమితపడి సంచీలోంచి కొన్ని కాయితాలు తీశారు.
      " రాజగోపాలూ..నా శ్రమ ఫలించిందయ్యా..శ్రీశ్రీ గారి బర్త్ డే డేటు దొరికేసింది " 
        ప్రసాద్ గారు చిన్న పిల్లాడి మాదిరిగా సంబరపడిపోతున్నారు. శ్రీశ్రీ పుట్టిన తేదీ మీద సందిగ్ధత, వాదోపవాదాలకు తెర దించడానికి చలసాని ప్రసాద్ గారు అంతకుముందే రంగంలోకి దిగి పరిశోధన ప్రారంభించిన విషయం నాకు తెలుసు. ఆ పరిశోధన కోసం రికార్డులు తవ్వి తీయించడానికి ఆయన విశాఖ మున్సిపల్ ఆఫీసు చుట్టూ కాళ్లరిగేటట్టు ఎన్నిసార్లు తిరిగారో అది కూడా తెలుసు. మొత్తానికి ఆయన కృషి ఫలించినందుకు నాకూ సంతోషం కలిగింది.
        " శ్రీశ్రీ గారు 1910, ఏప్రిల్ 30న పుట్టాడయ్యా! కన్ఫర్మ్ అయిపోయింది. మున్సిపల్ రికార్డుల్లో ఈ విషయం నమోదయి ఉంది. ఈ న్యూసు వెంటనే  పేపర్లో వేసెయ్యాలి" అన్నారు ప్రసాద్ గారు.
    నాకు భలే ఎక్సయిటింగ్ గా అనిపించింది. మహాకవి శ్రీశ్రీ పుట్టిన రోజు ఇదీ అని  ప్రసాద్ గారు సాధికారంగా చేస్తున్న ప్రకటనను మొదటిసారిగా లోకానికి చాటి చెప్పే అదృష్టం నాకు దక్కినందుకు పొంగిపోయాను.
     ఆ మర్నాడే మా పేపర్ లో ప్రసాద్ గారి పేరు మీద శ్రీ శ్రీ పుట్టిన రోజు గురించి వార్త వేశాం. దురదృష్టవశాత్తూ ఆ పేపర్ కటింగ్ ని నేను దాచుకోలేకపోయాను.
     శ్రీశ్రీ గారి పుట్టిన రోజునాడు శ్రీశ్రీ గారితోపాటు చలసాని ప్రసాద్ గారు కూడా నాకు గుర్తొస్తారందుకే.
   -మంగు రాజగోపాల్
(ఫేస్ బుక్ ద్వారా)