Pakistan, India, Farmer, Gujarath, locust bug

పాకిస్థాన్ మిడతల దండయాత్ర… గుజరాత్ రైతులకు తీవ్ర నష్టం!

పాకిస్థాన్ వైపు నుంచి మరో సమస్య వచ్చింది. మిడతల దండు ఇండియాపై దండెత్తుతూ, గుజరాత్ లో పంటలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. సమూహాలుగా వస్తున్న మిడతలు బనాస్ కాంఠా, మహసానా, కచ్, సాబర్ కాంఠా తదితర ప్రాంతాల్లో ఆవాలు, జీలకర్ర, బంగాళాదుంప, గోధుమ, జీలకర్ర, పత్తి తదితర పంటలను నాశనం చేస్తున్నాయి.

బనాస్ కాంఠా జిల్లాలో ఈ మిడతల కారణంగా ఇప్పటివరకూ 5 వేల హెక్టార్లలో పంట నాశనమైంది. మిడతలను ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం నానా తంటాలూ పడుతుండగా, సమస్య తీవ్రతను గమనించిన కేంద్రం, 11 బృందాలను రాష్ట్రానికి పంపింది.

డ్రోన్ల సాయంతో క్రిమిసంహారక మందులను చల్లడం ద్వారా వీటిని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నప్పటికీ, అదేమంత సులువుగా కనిపించడం లేదు. దీంతో పాటు పొలాల్లో టైర్లను మండించడం, డప్పులు వాయించడం, లౌడ్ స్పీకర్ల ద్వారా పెద్దగా సంగీతాన్ని వినిపించడం ద్వారా మిడతలను చెదరగొట్టవచ్చని ఉన్నతాధికారులు రైతులకు సూచిస్తున్నా, పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రైతుల నుంచి నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో మిడతల కారణంగా పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామని సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు.
Tags: Pakistan, India, Farmer, Gujarath, locust bug