ఎన్టీఆర్ ఫ్యాక్ట్ షీట్..నిప్పులు కక్కుతూ నింగికి

ఎన్టీఆర్… మనల్ని విడిచి వెళ్లి 22 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇవ్వాళాయన 23వ వర్ధంతి. ఎన్టీఆర్ అనే పుస్తకంలో వున్న అసలుసిసలైన అధ్యాయాన్ని అధ్యయనం చేసిన వాళ్ళెంతమంది? ఆ పుస్తకంలోని పుటల్ని లోతుగా చదివిన వాళ్ళెంతమంది? చరిత్రను తిరగరాసుకున్న అతికొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు ఎన్టీఆర్.

రాజకీయాల్లో ఆయనే  ఆదర్శమంటూ జెండాలు ఒంటికి చుట్టుకుంటారు… పటాలు కట్టించి పూజిస్తారు… కానీ ఆ పూజల్లోని చిత్తసుద్దులెంత? చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే దుర్బుద్ధులే తప్ప!  సామాన్యుడికి సైతం రాజకీయాల్ని పరిచయం చేసిన ఎన్టీఆర్… అదే సామాన్యుడి ఓటుకున్న విలువను రెట్టింపు చేశారు. తెలుగుదేశానికి అంకురార్పణ చేసి రాష్ట్ర రాజకీయ చరిత్రను మలుపుతిప్పి, ఢిల్లీ నడివీధుల్లో సైతం తెలుగోడి సత్తాను చాటి… ఆ లోక్‌సభలోనే ప్రధాన ప్రతిపక్షపు హోదాను కట్టబెట్టిన నిలువెత్తు మనిషి ఎన్టీఆర్! ఇవాళ రాజకీయం పేరుతో నిస్సిగ్గుగా జరిగిపోతున్న పార్టీ ఫిరాయింపులు, అవకాశవాదాలు చూసినప్పుడల్లా ఆయన మనసు విప్పి పరిచేసిన ధర్మపీఠం మాటలు గుర్తుకొస్తాయి. ఎన్నికైన వాళ్ళను తిరిగి వెనక్కి రప్పించే హక్కు.. రైట్ టు రీకాల్ మనకుండాలన్న ఆ ఎన్టీఆర్ ఇవ్వాళ మళ్లీమళ్లీ గుర్తుకొస్తున్నారు.

Source:newssting