bramarambhika mallikarjuna

అర్చకులకు పదవీ విరమణ అనేదే లేదిక

అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ వ్యవస్థను పునరుద్ధరించింది ప్రభుత్వం. గతంలో కొనసాగిన వంశపారంపర్య అర్చక వ్యవస్థను పునరుద్ధరించింది. అర్చకులకు పదవీ విరమణను వర్తింపజేస్తూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టి వేసింది. దాని స్థానంలో సరి కొత్త జీవోను విడుదల చేసింది. ఆలయ అర్చకత్వంలో కొనసాగిన పాత వ్యవస్థను పునరుద్ధరిస్తూ రెవెన్యూ (దేవాదాయం) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ తుది నోటిఫికేషన్ ను జారీ చేశారు.

దాదాపు అన్ని ఆలయాల్లో దీని పరిధిలోకి..

రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలను కూడా ఈ జీవో పరిధిలోకి తీసుకొచ్చారు. ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం ఉన్న ప్రధాన ఆలయాలతో పాటు.. వార్షికాదాయం అంతంత మాత్రమే ఉన్న గుడులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. హుండీ, టికెట్లు, తీర్థ ప్రసాదాల ద్వారా ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తోన్న సింహాచలం, విజయవాడ కనక దుర్గమ్మ, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించారు. ఏటా లక్ష రూపాయల ఆదాయం రానటువంటి పట్టణాలు, గ్రామాల్లో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండే ఆలయాల్లో కూడా వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి గల ఆలయం కావడం వల్ల దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు.

అర్చకులకు పదవీ విరమణ ఎందుకు?

అర్చకులకు పదవీ విరమణ వయస్సు ఉండేది కాదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పుట్టా మధుసూదన్ యాదవ్ టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఈ జీవో రూపుదాల్చింది. 65 సంవత్సరాలు నిండిన ప్రతి అర్చకుడూ పదవీ విరమణ చేయాల్సిందేనంటూ చంద్రబాబు ప్రభుత్వం జీవోను తీసుకొచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో చోటు చేసుకున్న గొడవను దృష్టిలో పెట్టుకుని ఆయనను బలవంతంగా శ్రీవారి ఆలయం నుంచి సాగనంపిందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి.

పదవీ విరమణ నిబంధన ఎత్తివేత..

తాము అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అర్చకుల పదవీ విరమణ నిబంధనను ఎత్తివేస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆ హామీని నెరవేర్చారు ఆయన. పదవ విరమణ నిబంధనను ఎత్తేశారు. పాత వ్యవస్థను పునరుద్ధరించారు. అర్చకులకు పదవీ విరమణ వయస్సు లేదని, కోరుకున్నన్ని రోజులు స్వామి వారి సేవలో ఉండొచ్చని వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. దీనిపట్ల రాష్ట్రవ్యాప్తంగా అర్చక సంఘాల నాయకుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. వంశపారంపర్య అర్చకత్వం పరిధిలోకి రాని అర్చకులకు ఈ తుది నోటిఫికేషన్ వర్తించదు.

వంశవృక్షం, అఫిడవిట్లు తప్పనిసరి..

రాష్ట్ర రెవెన్యూ దేవదాయ, ధర్మదాయ చట్టం-1987లోని సవరణల ప్రకారం ఈ నిబంధనలు ఆయా వంశపారపర్య అర్చకులకు వర్తిస్తాయి. 1966 నాటి దేవాదాయ చట్టం ప్రకారం వారసత్వంగా అర్చకత్వం చేస్తున్నట్లు గుర్తించిన అర్చక కుటుంబాలను దీనికి కిందికి తీసుకొచ్చారు. అర్చకుల వంశవృక్షం, అఫిడవిట్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, పారదర్శకంగా విచారణ ద్వారా వారసత్వ హక్కులు ఎవరికి వస్తాయనేది గుర్తిస్తారని స్పష్టం చేశారు. వాటన్నింటినీ ఆలయ ఉద్యోగులకు అర్చకులు అందజేయాల్సి ఉంటుంది. వాటిని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కంప్యూటరీకరిస్తారు.

వంశపారంపర్యం కొనసాగించలేకపోతే..

పదవీ విరమణ చేయదలిచిన అర్చకుడి వారసత్వం అర్చకత్వ వృత్తిని కొనసాగించలేకపోవచ్చు. అలాంటి వారికి ప్రభుత్వం వెసలుబాటును కల్పించింది. తన తదుపరి అర్చకుడిని ఎంపిక చేసే బాధ్యతను పదవీ విరమణ చేయదలిచిన అర్చకుడికే అప్పగించింది. తన తరువాత ఎవరు అర్చకత్వం చేయాలో ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించింది. పవిత్రమైన అర్చకత్వ వృత్తికి సరితూగేలా అన్ని అర్హతులు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఎలాంటి వ్యసనాలు ఉండకూడని వ్యక్తులకు వంశపారంపర్యాన్ని వర్తింపజేస్తామని పేర్కొంది.