home page

ఆపరేషన్ కమల్-2 : టార్గెట్ తెలంగాణ

2008 నుంచీ ఇదే తంతు! కర్నాటకమే వేదిక

 | 
lotus reverse

తాజాగా మహారాష్ట్ర, అంతకుముందు మధ్యప్రదేశ్, తృటిలో తప్పించుకున్న రాజస్ధాన్

ఆపరేషన్‌ కమల్‌.. ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల్ని, మరీ ముఖ్యంగా శాసనసభ్యుల్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవడానికి బీజేపీ చేపడుతున్న ఆపరేషన్‌.
తొలుత వివిధ పార్టీల నాయకుల్ని బీజేపీలోకి తీసుకురావడానికి చేపట్టిన ఈ వ్యూహాన్ని.. మూడున్నరేండ్ల క్రితం కర్ణాటకలో మరింత దూకుడుగా అమలు జరిపింది. అదే ఆపరేషన్‌ కమల్‌ 2.0. 2019లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టింది బీజేపీ. అమిత్‌షానే స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారని అప్పటి సీఎం యెడియూరప్ప పేర్కొంటున్న వీడియో కూడా అప్పట్లో కలకలం రేపింది. మొదటినుంచీ బీజేపీ నాయకత్వం ఎమ్మెల్యేల కొనుగోలుపై ఎంత దృష్టిపెట్టిందో ఆ ఉదంతం తేటతెల్లం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం చేసి భంగపడిన బీజేపీ.. దాని ప్రలోభాలు సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి రావడంతో మూడున్నరేండ్ల క్రితం నాటి ఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

2008 నుంచీ ఇలాంటి బేరాలే..
కర్ణాటకలో ఎమ్మెల్యేలతో బీజేపీ బేరాలకు దిగడానికి దశాబ్దానికి పైగా చరిత్ర ఉంది. 2008 మేలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలంటే ముగ్గురు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. దీంతో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో యెడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దక్షిణాదిలో తొలి బీజేపీ సర్కారు ఇదే. అయితే ఎప్పటికైనా ఈ నంబర్‌ చేజారుతుందని భావించిన బీజేపీ.. 'ఆపరేషన్‌ కమల్‌' పేరిట ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీసింది. అప్పటి మైనింగ్‌ లీడర్‌, బీజేపీ క్యాబినెట్‌ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సాయంతో కాంగ్రెస్‌ నుంచి ముగ్గురిని, జేడీఎస్‌ నుంచి నలుగురిని మొత్తం ఏడుగురిని కొనుగోలు చేసిందన్నది బహిరంగ రహస్యం. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఐదుగురిని గెలిపించుకోవడం ద్వారా యెడియూరప్ప సర్కారు బతికిపోయింది.

కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చిన కమల్‌ 2.0
2019 మే నెలలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కారును పడగొట్టేందుకు పావులు కదిపిన బీజేపీ.. ఆపరేషన్‌ కమల్‌ 2.0 ద్వారా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టింది. 107మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ అధికారాన్ని దక్కించుకునేందుకు మ్యాజిక్‌ సంఖ్య కోసం ఎత్తుగడలు వేసింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణంలోని అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేసి కథ నడిపించింది. యెడియూరప్ప ఆఫర్లు ఇస్తున్న వీడియోలు బయటకురావడం అప్పట్లో కలకలం రేపింది. అమిత్‌షా స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని యెడియూరప్ప పేర్కొనడం ఆ వీడియోల్లో ఉంది. 18మంది ఎమ్మెల్యేలను ఏకబిగిన కొనుగోలు చేసిన బీజేపీ.. ఆయా పార్టీల అధినేతలకూ అందుబాటులోకి   13మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కాగా, ముగ్గురు జేడీఎస్‌, ఇద్దరు ఇండిపెండెండ్లు ఉన్నారు. ఆపరేషన్‌ కమల్‌ 2.0 ఫలితంగా కుమారస్వామి ప్రభుత్వం పతనమైంది. ఒక్కొక్కరికి రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆఫర్‌ చేసిందని, వచ్చే ఎన్నికల్లోనే సిట్టింగ్‌ స్థానాలనుంచి వారికే టిక్కెట్‌ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఆర్థిక నేరాలు, ఈడీ, ఐటీ దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని, ఇప్పటికే ఉన్న కేసుల్ని రద్దు చేయిస్తామని బీజేపీ భరోసా ఇచ్చిందనే విమర్శలున్నాయి. కోర్టు తీర్పుతో ఉప ఎన్నికలు నిర్వహించగా, విజేతలందరికీ యెడియూరప్ప మంత్రి పదవులు అప్పగించారు.