home page

దక్షిణాదిలో గవర్నర్ల దాష్టీకం?

తమిళనాడు గవర్నర్ రవి      సొంత పైత్యం 

 | 
రావిక్ go back
దక్షిణాదిన బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల దాష్టీకం
దక్షిణాది రాష్ట్రాలలో ఎంత ప్రయత్నించినా బలం పెంచుకోలేకపోతున్న బీజేపీ గవర్నర్ ల ద్వారా ముఖ్యమంత్రులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యం కలిగిస్తున్నది. తమిళం అంటే అంత చిరాకు ఉన్న వ్యక్తి తమిళనాడు గవర్నర్ గా ఎలా పని చేయగలరు? తమిళనాడు ప్రయోజనాలు ఎలా కాపాడతారు? ఈ ప్రశ్నలన్నింటినీ అలా ఉంచితే తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తమిళం అంటేనే విముఖత చూపడం ఆయన స్వీయనిర్ణయమా లేక బీజేపీ అధిష్టానం అలాంటి సూచనలు చేసిందా? ఏది ఏమైనా గవర్నర్లు రాష్ట్రాలలో చేస్తున్న పనులు బీజేపీపై తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయి. తమిళనాడు  అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగించడం సాంప్రదాయం. కాగా అందుకు అన్ని విధాలుగా తమిళనాడు ప్రభుత్వం సహకరించింది. గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వం ఆమోదించి ఇచ్చిన కొన్ని వాక్యాలను ఉద్దేశపూర్వకంగా చదవలేదు. ద్రవిడ అనే పదాన్ని, తమిళనాడు అనే పదాలను గవర్నర్ రవి చదవడానికి ఇష్టపడలేదు. దాంతో వాటిని ఆయన దాటవేశారు. దాంతో గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రసంగానికి ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ అంతరాయం కలిగించి, గవర్నర్ ప్రసంగంలో కొన్ని భాగాలను తప్పించారని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గవర్నర్ చదివినది కాకుండా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ప్రసంగాన్ని సభ ఆమోదించాలని ఆయన చేసిన తీర్మానం సభ ఆమోదం కూడా పొందింది. దాంతో గవర్నర్ రవి వెంటనే సభ నుండి వెళ్లిపోయారు. రవి బిజెపి హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని డిఎంకె మరియు దాని మిత్రపక్షాలు ఆరోపించాయి. రవి అనవసరంగా రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అధికార డిఎంకె  ఆరోపించింది. ఇదే మార్గంలో కొనసాగాలని నిర్ణయించుకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తమిళనాడు గవర్నర్ రవి ఒక్కరే కాదు. దక్షిణాది రాష్ట్రాలలోని గవర్నర్లు అందరూ దాదాపుగా ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ప్రభుత్వానికి సహకరించడం లేదు. అదే విధంగా ప్రభుత్వం కూడా ఆమెను చీకాకు పెడుతున్నది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమిస్తుంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ కాలంలో బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలలో గవర్నర్లను నియమించారు. ఈ గవర్నర్లు బీజేపీ లేదా ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సంపూర్ణ సహకారం అందిస్తుంటారు. ఎన్ని అరాచకాలు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ గా ఉన్న బిశ్వభూషన్ హరిచందన్ ఆ ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉంటారు. చట్టం అనుమతి లేని ఆర్డినెన్సులను కూడా ఆమోదిస్తున్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు విపరీతంగా జరుగుతున్నా, ప్రతిపక్షాలు వచ్చి మొరపెట్టుకుంటున్నా కూడా ఆయన ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. భారత రాష్ట్రపతి నుంచి ఆదేశాలు వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా ఆ రాష్ట్ర గవర్నర్ అదేమని ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కకరణ నేరాలకు పాల్పడుతున్నా ఆయన జోక్యం చేసుకోవడం లేదు. ఏపిలో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పరోక్ష మిత్రపక్షం కావడమే ఇందుకు కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల తమిళనాడు ప్రభుత్వం RN రవిని రీకాల్ చేయాలని కోరింది. తమిళనాడులో అధికారంలో ఉన్న DMK నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) గవర్నర్ రవిని "మత విద్వేషాన్ని రెచ్చగొట్టాడు" అని ఆరోపిస్తూ, ఇతర విషయాలతోపాటు, ఆయనను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతి భవన్ తలుపు తట్టింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేరళ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సుపై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంతకం చేయడానికి నిరాకరించారు. ఇలా దక్షిణాది రాష్ట్రాలను గవర్నర్లు చీకాకులు పెట్టడం విపరీత పరిణామాలు దారి తీసే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను దూరం చేసుకునే ఈ ప్రయత్నాలు విరమించుకోవాలి. అదే ప్రజాస్వామ్యంలో మంచి నిర్ణయం అవుతుంది. అలా కాకుండా దక్షిణాది రాష్ట్రాలలో తమకు గిట్టని పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తే దేశ సమగ్రతకే భంగం వాటిల్లుతుంది. బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న చోట ఒక రకంగానూ, బీజేపీ అధికారంలో లేని చోట మరొక రకంగానూ గవర్నర్లు ప్రవర్తిస్తే దక్షిణాది ప్రజలు బీజేపీని ఎన్నటికీ క్షమించరు.