home page

ఫేక్ వార్తల ఫ్యాక్టరీ బిజెపి !

స్వాతంత్ర్య సమరయోధుల పై కూడా ...    

 | 
bjp

నిత్యం నెహ్రూ పైనే నిందలు  !

  • జాతీయ వాదం, ప్రధాని మోదీ ప్రతిష్ఠ, హిందూ రక్షణ పేరిట తప్పుడు సమాచారం
  • అబద్ధాలనైనా వైరల్‌ చేస్తామని గతంలో షా వ్యాఖ్య
  • సోషల్‌ మీడియాలో 60 శాతం అబద్ధాలే
  • నకిలీ వార్తల చదువరులు భారత్‌లోనే అధికం

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నదా? అంటే అవునంటున్నాయి తాజా అధ్యయనాలు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి కమలం పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని చెప్తున్నాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంటర్నెట్‌ సివిలిటీపై మైక్రోసాఫ్ట్‌ సర్వే చేయగా, భారత్‌లోనే ఎక్కువ ఫేక్‌ న్యూస్‌ ప్రచారం జరుగుతున్నదని తేలింది. దీనిపై బీబీసీ మరింత లోతుగా అధ్యయనం చేయగా, ఫేక్‌ న్యూస్‌, అసత్య సమాచార ప్రచారంలో బీజేపీ అనుకూల వర్గాల ఖాతాలే ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. ముఖ్యంగా ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠను ఇనుమడించేందుకు ట్విట్టర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకొంటున్నారని తెలిసింది. జాతీయ వాదం, హిందూ ఆధిపత్యం, హిందూ ధర్మ పరిరక్షణ, పూర్వ వైభవ పునరుద్ధరణ, దేశ ప్రగతి లాంటి అంశాల ఆధారంగా ఫేక్‌ న్యూస్‌, తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా చేరవేస్తున్నారని సర్వేలో తేలింది. అంతేకాదు జాతీయవాద ధోరణితో ఫేక్‌ న్యూస్‌ ప్రచారం జరిగినప్పుడు ప్రజలు భావోద్వేగానికి గురవుతారని, అది హింసకు కారణమవుతున్నట్టు వెల్లడైంది.

ఇలాంటి ఘటనల్లో ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కూడా పోగొట్టుకొన్నారని నివేదిక పేర్కొన్నది. 16 వేల ట్విట్టర్‌ అకౌంట్లు, 3 వేల ఫేస్‌బుక్‌ అకౌంట్లను బీబీసీ పరిశీలించగా.. బీజేపీ అనుకూల వర్గాల ఖాతాల్లోనే ఇలాంటి పోకడలు ఎక్కువగా కనిపించాయి. ప్రధాన మీడియా సంస్థలపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని ఆసరాగా తీసుకొని బీజేపి తన అనుకూల సంస్థల ద్వారా జాతీయవాదంతో పాటు, హిందూ ధర్మ పరిరక్షణ పేరిట అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తున్నదని ఆ నివేదికలు చెప్తున్నాయి. కాగా, ఫేక్‌ న్యూస్‌ పాఠకులు భారత్‌లో 60 శాతం ఉండగా, ఇతర దేశాల్లో 57 శాతంగా ఉన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసుకొంటూనే, అసత్య సమాచారం, ఫేక్‌ న్యూస్‌ ప్రచారాన్ని నిరోధించాలని గగ్గోలు పెడుతున్నదని విమర్శకులు పేర్కొంటున్నారు.

భారత ప్రజలే బాధితులు
ఆన్‌లైన్‌ మోసాలు, వ్యక్తిగత సమాచార చోరీ, లైంగిక ప్రయోజనాల కోసం చేసే మెసేజ్‌లు, నకిలీ వార్తల ప్రచారం లాంటి కష్టనష్టాలపై మైక్రోసాఫ్ట్‌ 'డిజిటల్‌ సివిలిటీ సూచిక' విడుదల చేసింది. 22 దేశాల్లో చేసిన సర్వే సూచీలో భారత్‌ 7వ స్థానంలో ఉన్నది. తప్పుడు సమాచారంతో పాటు 50 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఆన్‌లైన్‌ బాధితులని తేలింది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదికాక మరో 42 శాతం మంది ఫిషింగ్‌, స్పూఫింగ్‌ బాధితులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ తన గత సర్వే నివేదిక 2018తో పోలిస్తే భారతలో అసత్య సమాచారం, అవాంఛిత సందేశాలు (అన్‌వాంటెడ్‌ మెసేజెస్‌), ఆన్‌లైన్‌ మోసాలు 9 శాతం నుంచి 29 శాతానికి చేరాయి.

మోదీ సుద్దులు.. అమిత్‌ షా ఫేకుడు
ఫేక్‌ న్యూస్‌లపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ అంటారు.. కానీ, అలాంటి వాటినే వైరల్‌ చేయాలంటారు ఆయన సన్నిహితుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఆ సత్తా తమకు ఉన్నదని జబ్బలు చరుచుకొని మరీ చెప్తారు. గతంలో అమిత్‌ షా స్వయంగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. 2018 సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన బీజేపీ సోషల్‌ మీడియా వలంటీర్ల సమావేశంలో మాట్లాడిన అమిత్‌ షా.. బీజేపీ సోషల్‌ మీడియాకు అబద్ధాలను కూడా వైరల్‌ చేసే సత్తా ఉన్నదని తెలిపారు. నిజమైనా, అబద్ధమైనా, చేదైనా, తీపైనా ఒక వార్తను వైరల్‌ చేయగలమని వెల్లడించారు. 'ఉత్తరప్రదేశ్‌లో 32 లక్షల మందితో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశాం. వాళ్లంతా ప్రతి రోజు ఒక సందేశాన్ని వైరల్‌ చేస్తారు' అంటూ బీజేపీ ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేస్తున్నదని ఒప్పుకొన్నారు. శుక్రవారం హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో చింతన్‌ శివిర్‌ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. చిన్న వదంతు కూడా దేశానికి భారీ నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉన్నదని వ్యాఖ్యానించారు. దీంతో.. నెటిజన్లు మోదీ, అమిత్‌ షా మాటల వీడియోను పోస్ట్‌ చేస్తూ ఇదీ! బీజేపీ అసలు రంగు అంటూ విమర్శిస్తున్నారు.

నిజమైనా, అబద్ధమైనా, చేదైనా, తీపైనా ఒక వార్తను వైరల్‌ చేయగల సత్తా బీజేపీకి ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లో 32 లక్షల మందితో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశాం. వాళ్లంతా ప్రతి రోజు ఒక సందేశాన్ని వైరల్‌ చేస్తారు.

– 2018లో బీజేపీ సమావేశంలో అమిత్‌ షా

చిన్న వదంతు కూడా దేశానికి భారీ నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉన్నది. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా మెసేజ్‌ ఫార్వార్డ్‌ చేసేముందు ఫేక్‌న్యూస్‌ తనిఖీ ఎలా చేసుకోవాలో ప్రజలకు తెలిసేలా చేయాలి.

– చింతన్‌ శివిర్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ

(నమస్తే తెలంగాణ నుంచి  )

​​