home page

ఢిల్లీ లిక్కర్ స్కాం: .అప్రూవర్‌గా దినేష్ అరోరా

ఢిల్లీ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు
 | 

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిపోయారు.

దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ ఢిల్లీ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దినేష్ అరోరా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ధర్మాసనం. ఎవరైనా బెదిరించారా,ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా అని దినేష్ అరోరాను అడిగిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. ఈ నెల 14కు కేసు వాయిదా వేశారు.

లిక్కర్ స్కాం కేసులో ఇప్పటివరకు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అందులో అరోరా ఒకరు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రు రాధా ఇండస్ట్రీస్ బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. రాధా ఇండస్ట్రీస్ దినేష్ అరోరాకి సంబంధించినది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, దినేష్ అరోరా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద సీబీఐ కేసు నమోదు చేసింది.లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారుతారని గతంలో ప్రచారం జరిగింది. కాని దినేష్ అరోరా అప్రూవర్ గా అప్రూవర్‌గా మారినట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రకటించింది.

ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ 2021-22కు గాను కొత్తగా ఎక్సైజ్ పాలసీ రూపొందించింది. తెలంగాణలో అమలవుతున్న పాలసీని పరిశీలించి ఢిల్లీలో అమలు చేశారు. అయితే లిక్కర్ పాలసీలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు ఆదేశించారు. 2021 నవంబర్ 17న అమలులోకి వచ్చిన లిక్కర్ పాలసీలో .. ఢిల్లీ మహా నగరాన్ని 32 జోన్‌లుగా విభజించారు. మొత్తం 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. మద్యం విక్రయదారులకు సంబంధించిన 144 కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేస్తూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ సర్కార్ విధానాలపై బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎల్‌జీకి ఫిర్యాదు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారులే కథ నడిపారని సీబీఐ విచారణలో తేలింది. లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించడం కలకలం రేపింది. తనపై వచ్చిన ఆరోపణలను కవిత ఖండించినా.. బీజేపీ నేతలు మాత్రం ఆమె టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐతో ఈడీ అధికారులు హైదరాబాద్ లో పలుసార్లు సోదాలు చేశారు. బోయినపల్లి అభిషేక్, శ్రీనివాసరావు, సీఏ బుచ్చిబాబును అధికారులు ప్రశ్నించారు. వీళ్లంతా ఎమ్మెల్సీ కవిత సన్నిహితులే కావడంతో .. ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తుందనే వార్తలు వచ్చాయి. తెలంగాణ బీజేపీ నేతలు కూడా లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కావడం ఖాయమని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిందితుడు దినేష్ అరోరా అప్రూవర్ గా మారడటంతో.. అతను ఇచ్చిన వివరాల ప్రకారం మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. కీలక నేతకు గండం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.