home page

చెన్నై మెట్రోపాలిటన్ సరిహద్దులు పెంపుదల !

 చిత్తూరు తిరుపతి లకు ప్రాధాన్యత  

 | 
tamilnado boarder

ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, తిరుపతి దాటగానే చెన్నై మెట్రోపాలిటన్‌ ప్రాంతం ప్రారంభం కానుంది. ఈ మేరకు నగరాన్ని భారీగా విస్తరిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Chennai Metropolitan City : ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, తిరుపతి దాటగానే చెన్నై మెట్రోపాలిటన్‌ ప్రాంతం ప్రారంభం కానుంది. ఈ మేరకు నగరాన్ని భారీగా విస్తరిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెన్నై మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఎండీఏ) పరిధి 1,189 చ.కి.మీ.గా ఉంది. ఇప్పుడు దాన్ని ఏకంగా 5,904 చ.కి.మీ.కు పెంచుతూ గెజిట్‌ విడుదల చేసింది.

చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఎంతో మేలు

చెన్నై మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్ని విస్తరించడంతో ప్రధానంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలు, వాటి చుట్టుపక్కలున్న ప్రాంతాలకు ఉపాధి వనరులు మరింతగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే ఈ రెండు జిల్లాలతోపాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి పెద్దఎత్తున ఉత్పత్తులు చెన్నైకి వస్తున్నాయి. మహా నగర పరిధి విస్తరణతో ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఎలాంటి అభివృద్ధి సెక్టార్లు వస్తాయనేది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్‌ మార్పు ప్రక్రియ నడుస్తోంది. వచ్చే ఏడాది దీన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.

ఏపీని ఆనుకుని ఉన్న తమిళనాడు జిల్లాలు తిరువళ్లూరు, రాణిపేట పూర్తిగా చెన్నై పరిధిలోకి వచ్చాయి. తెలుగువారు ఎక్కువగా నివసించే తమిళ నియోజకవర్గాలు.. పొన్నేరి, ఉత్తుకోట, తిరువళ్లూరు, శ్రీపెరంబుదూరు నియోజకవర్గాలను పూర్తిస్థాయిలో ఉత్తర చెన్నైలోకి తీసుకొచ్చారు. దీనికి అనుబంధంగా తిరుత్తణి, అరక్కోణం, పూందమల్లి నియోజకవర్గాలు ఉత్తరభాగంలోనే పాక్షికంగా కలిశాయి. దక్షిణ చెన్నై పరిధిలో కాంచీపురం, వాలాజాబాద్‌, చెంగల్పట్టు, తిరుకలికుండ్రం, తిరుపోరూరు నియోజకవర్గాలు పూర్తిగా.. కుండ్రత్తూరు, వండలూరు నియోజకవర్గాలు పాక్షికంగా దక్షిణ చెన్నైలో ఉన్నాయి. మొత్తంగా కొత్తగా 15 నియోజకవర్గాలు నగరంలో కలుస్తుండగా.. 1,225 గ్రామాల్ని చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్‌ను మించాల్సి ఉండగా...

చెన్నై మెట్రోపాలిటన్‌ నగరాన్ని హైదరాబాద్‌ కన్నా మిన్నగా విస్తరించాలనే ఆలోచనలు 2018లో జరిగాయి. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధి 7,257 చ.కి.మీ. ఉండగా... సీఎండీఏ పరిధిని 8,878 చ.కి.మీ. పెంచాలని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమలులో జాప్యం జరిగింది. తర్వాత ప్రజల నుంచి వచ్చిన వినతులు, నిపుణులు, కమిటీ సలహాలు పరిగణనలోకి తీసుకుని నగరాన్ని 5,904 చ.కి.మీ.కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రెండో విమానాశ్రయం నిర్మాణానికి భారీ ఏర్పాట్లు

చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో రానున్న 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో విమానాశ్రయం నిర్మాణానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీన్ని కాంచీపురం జిల్లాలోని పరందూరులో నిర్మించనున్నారు. చెన్నైకి 60 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్నీ మెట్రోపాలిటన్‌ పరిధిలోకే తెచ్చారు. దీనికోసం 13 గ్రామాల్లోని 4,563.56 ఎకరాలను సేకరిస్తున్నారు. భూసేకరణపై ఆయా గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం వారికి మార్కెట్‌ విలువ కన్నా 3.5 రెట్లు ఎక్కువ పరిహారం ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. దీనిపై చర్చలు నడుస్తున్నాయి. ఈ విమానాశ్రయంతో చెన్నైని ఎయిర్‌లైన్‌ హబ్‌గా చేస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.