home page

ఇక దక్షిణాది పై కమలం దృష్టి

 | 
Bjp

ఇక తెలంగాణ, కర్ణాటక లపై దృష్టి 

కీలకమైన గుజరాత్ ఎన్నికలు పూర్తి కావడం, అక్కడ చారిత్రక విజయం సాధించడంతో బిజెపి కేంద్ర నాయకత్వం ఇక దక్షిణాదిపై, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకలపై దృష్టి సారిస్తున్నది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం తెలంగాణాలో ఎక్కువగా ఉన్నదని నిర్ధారణకు వచ్చిన బిజెపి నాయకత్వం కొంతకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. 
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే కర్ణాటక ఎన్నికలలో మరోసారి విజయం సాధించడంతో పాటు, దాదాపు అదే సమయంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న తెలంగాణాలో అధికారం చేపట్టేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యనేతలతో ఢిల్లీలో వరుసగా సమావేశాలు జరిపారు. పైగా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు లలో సహితం చెప్పుకోదగిన సంఖ్యలో లోక్ సభ సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో పనిచేస్తున్నది. 
 
2024 సాధారణ ఎన్నికలలో బీజేపీ రికార్డు మెజారిటీతో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ బలం పెంచుకోవడం కీలకం అని అమిత్ షా కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు.  ఆ దిశలో సన్నాహాలలో భాగంగా హైదరాబాద్‌లో 28,29వ తేదీలలో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల పూర్తిస్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం జరగనుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బీఎల్ సంతోష్, తురుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్ వస్తున్నారు.  దక్షిణాది రాష్ట్రాల్లోని 60 లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు, పార్టీ బలోపేతం, ప్రచారశైలిపై కార్యకర్తలకు నేతలు శిక్షణ  ఇవ్వనున్నారు.
తెలంగాణాలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, ఢిల్లీ లిక్కర్ స్కాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో రోజుకో కీలక పరిణామం జరుగుతున్న సమయంలో అమిత్ షా, బీఎల్ సంతోష్ హైదరాబాద్ కు కీలకమైన పార్టీ సమావేశంకు రావడం ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను అధికారం నుంచి దూరం చేసేందుకు వ్యూహరచనలు చేస్తోంది.
అందులో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షాలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పార్టీ కీలక సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇటీవలనే  హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగ్గా, ఇప్పుడ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కార్యకర్తల సమావేశం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికలకు పది నెలలు మాత్రమే సమయం ఉండటం, ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. గురువారం టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా గుర్తిస్తూ ఈసీ నుంచి అధికారికంగా ప్రకటన రావడంతో రానున్న రోజుల్లో ఢిల్లీతో పాటు పలు బీజేపీ రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు తెరపైకి వచ్చిన తర్వాత అమిత్ షా తొలిసారి తెలంగాణకు వస్తున్నారు.