మళ్ళీ మంటల్లో మణిపూర్
ఇళ్లకు నిప్పు, ఐమ్ఏ బజార్
దుకాణాల బంద్
Jul 26, 2023, 20:16 IST
|
ఇంఫాల్ : మణిపూర్‌లో అల్లరి మూకల విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మోరే జిల్లా లోని మోరే బజార్ ప్రాంతంలో కొందరు దుండగులు పలు ఇళ్లకు నిప్పు పెట్టారు.అయితే ఆ ఇళ్లలో ఎవరూ నివాసం ఉండట్లేదని తెలిసింది. ఈ ప్రదేశం మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు రవాణా కోసం వినియోగించే రెండు బస్సులను సైతం ఇలాగే ముష్కరులు తగుల బెట్టారు.
సపోర్మీనా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మణిపూర్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ బస్సులు దిమాపుర్ వైపు నుంచి వస్తుండగా, స్థానికులు వాటిని అడ్డుకున్నారు. బస్సుల్లోకి ఎక్కి, ఇతర తెగ ప్రజలెవరైనా అందులో ఉన్నారా అని సోదాలు చేశారు. ఆ తరువాత వాటిని దహనం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మణిపూర్‌లో మూడు నెలల నుంచి మైతేయ్, కుకీ జాతుల మధ్య రగులుతున్న ఘర్షణల ఫలితంగా వివిధ అల్లర్లలో సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు.