home page

దక్షిణాది ఓట్లు, సీట్స్ కీలకం

కమలం గురి కుదురుతుందా?

 | 
Modi

దేశంలో కమలం పార్టీ మూడో సారి అధికారంలోకి రావాలంటే దక్షిణ రాష్ట్రాలే కీలకం; బెంగాల్ అనుభవాలతో సౌత్ స్ట్రాటజీ; వలస నేతలు కాదు సంస్ధాగత బలోపేతం పైనే దృష్టి...

మోడీ పాలన కొనసాగింపునకు కీలకంగా దక్షిణాది రాష్ట్రాలు

హైదరాబాద్ లో భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం, పార్టీ పార్లమెంటరీ బోర్డులో యడియూరప్పకు స్థానం కల్పించడం, డా. కె. లక్ష్మణ్, పార్టీ సంస్దాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా దక్షిణాదివాడినే నియమించడం, ఇళయరాజా, పీటీ ఉష లకు రాజ్యసభ సభ్యత్వం, కాశీలో అట్టహాసంగా తమిళ సంఘం వేడుకలు... ఇలా బీజేపీ నిర్ణయాలపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ సౌత్ స్ట్రాటజీ ఏంటో అర్ధమౌతోంది. 2019లో రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో తమ బలం పెంచుకుని 303 ఎంపీలతో స్వంతగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ సారి దక్షిణాది వైపు దృష్టి సారించింది. ఎన్నికల యంత్రాలుగా పేరుగాంచిన మోడీ అమిత్ షాల ద్వయం తమ తదుపరి లక్ష్యాన్ని చేరేందుకు పక్కా వ్యూహాలతోనే ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే కేరళలో దెబ్బతిన్న భాజాపా ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించబోతోందని అర్ధమవుతోంది.

దక్షిణాన భాజాపా బలమెంత..

దక్షిణ రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక మినహా బీజేపీకి మరే రాష్ట్రంలోనూ పెద్దగా బలం లేదు. గత ఎన్నికల్లో దక్షిణ రాష్ట్రాల్లో 135 స్ధానాలకు గాను కేవలం 29 స్ధానాలే గెలుచుకోగలిగింది. అందులోనూ 25 స్ధానాలు కేవలం కర్నాటక నుంచే వచ్చాయి. మిగిలిన 4 స్దానాలు తెలంగాణ నుంచి. 923 అసెంబ్లీ స్ధానాలకు 135 మాత్రమే బీజేపీ ఎమ్మెల్యేలున్నారు అందునా అధికులు కర్నాటకనుంచే.. అంటే తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో కమలం పార్టీ కేవలం నామమాత్రమన్నమాట. తెలంగాణలో త్వరలో అధికారంలోకి వస్తామంటూ ఆపార్టీ ధీమాగా ఉన్నా కేసీఆర్ లాంటి చరిష్మా వున్న నాయకుల వ్యూహాలను తట్టుకునే సమవుజ్జీలు స్దానికంగా లేకపోవడం, తమిళనాడు వంటి గట్టి ప్రాంతీయాభిమానమున్న రాష్ట్రంలో హిందీ నాయకుల పార్టీగా పిలవబడే బీజేపీ ఎదగడం, సైద్దాంతికంగా చాలా బలమైన అభిప్రాయాలూ, మైనారిటీ వర్గాల ఓట్లు ప్రభలంగా వుండే కేరళలో హిందూ పక్షపాత బీజేపీ ఎదగడం అంత సులువైతే కాదు. కానీ పక్కా వ్యూహాలు, దీర్ఘకాలిక ప్రణాళికలూ వుంటే అది అసాధ్యమేమీ కాదంటూ తమ ఎదుగుదలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలం నేతలు.

కర్నాటకలో కొత్తనాయకత్వంతో..

దక్షిణాదిన కర్నాటక తమ జైత్రయాత్రకు ముఖద్వారమని ఇటీవలే అమిత్ షా అన్నారు. కానీ బీఎస్ యడ్యూరప్పలాంటి నేతను పక్కనపెడితే లింగాయతుల మద్దతు కష్టమవుతుందని తెలుసు, దాంతో పాటు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ అంతర్గత విభేదాలను అధిగమిస్తూ ఎన్నికల గెలుపు పైనే దృష్టి సారించం మరో ఛాలెంజ్. కానీ భవిష్యత్ నాయకులను తయారు చేయడంతో పాటు నేర చరిత లేని, పార్టీలోని అన్ని వర్గాలతో సఖ్యంగా మెలిగే నాయకుడిని నిలిపే యోచనలో మరో లిగాయత్ ఐన బస్వరాజ్ బొమ్మైని సీఎం చేసి, యడియూరప్పను సైతం పార్టీ కీలక పార్లమెంటరీ బోర్డు మెంబర్ను చేసారు. ఇప్పుడు పార్టీ సంస్ధాగత వ్యవహారాలు చూస్తున్న ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా కన్నడీగుడే అవడం కలిసొచ్చే అంశమే. పార్టీ గెలుపునకు అవసరమైన హిదూ ఓటు బ్యాంకును కాపాడకునే ప్రయత్నమూ చేస్తోంది. ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ ఎన్నికలకు కర్నాటక విజయం అత్యంత కీలకమని తాము విస్మరించట్లేదనీ అంటున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ స్ధానం కోసం...

తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆరెస్ పార్టీ పై 10ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత వుంది.. దాన్ని సానుకూలంగా మార్చుకునే అంశంలో కాంగ్రెస్ కు అనేక బలహీనతలున్నాయి. సైద్దాంతికంగా తమకు వ్యతిరేకి ఐన ఎంఐఎం ఇక్కడి పార్టీనే.. ఇక్కడ తమ సిద్దాంతాలకు బలమైన మూలాలున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యర్ధులు ఊహించనివిధంగా తమకు 4 పార్లమెంటు స్ధానాలు రావడం వారి నమ్మకానికి మరింత బలాన్నిచ్చాయంటున్నారు ఓ సీనియర్ బీజేపీ నేత. బలహీన పడుతున్న కాంగ్రెస్ ఓటుబ్యాంకును తమ వైపునకు తిప్పుకునే సందర్భం ఇదే అని భావిస్తున్నారు. అందుకే తరుణ్ చుగ్ వున్నా అమిత్ షా కు అత్యంత సన్నిహితుడైన సునిల్ బన్సల్ ను రంగంలోకి దించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఆరోపణలను బీజేపీ ఖచ్చితంగా రాజకీయ అవకాశంగా వాడుకుంది. వలస నేతలతో పార్టీ కొన్నిచోట్ల ఎన్నికల్లో పోటీ ఇస్తున్నా 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నుంచి మంచి అనుభవాలోచ్చాయట. అందుకే కేవలం అరువు నేతలపైనే కాకుండా పార్టీని బలోపేతం చేయడం పై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే కిషన్ రెడ్డికి క్యాబినెట్ హోదా, పార్లమెంట్ బోర్డు సభ్యుడిగా లక్ష్మణ్ లను నియమించి కార్యకర్తలకు భరోసా కల్పించారు. హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గసమావేశం, ఇటీవల శిక్షణాతరగతుల ద్వారా సిద్దాంత విస్త్రుతిపై కూడా దృష్టి సారించారు.

తమిళనాడు, ఏపీ, కేరళ ల్లో..

ప్రాంతీయ పార్టీలకు మాత్రమే పరిమితమైన తమిళనాడులో కరుణానిది, జయలలిత మరణానంతరం ఏర్పడ్డ శూన్యతను క్యాష్ చేసుకోవడం అంత తేలిక కాపోయినా.. బలమైన సామాజిక వర్గానికి చెందిన గౌండర్ నేత, యువకుడూ మాజీ ఐపీఎస్ అన్నామలైని రాష్ట్రాద్యక్షుడిగా నియమించి సుదీర్ఘ ప్రణాళిక చేస్తేంది. కాశీలోసైతం తమిళ సంఘం వేడుకలు చేసి వారి సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తామని చెబుతోంది. బలహీనపడుతున్న ఏఐఏడీఎంకే స్ధానాన్ని ఏపీలోనూ, క్రిస్టియన్ ఓటుబ్యాంకును కేరళలోనూ, పవన్ ద్వారా కాపు ఓటు బ్యాంకును ఏపీలోనూ ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో 2024 తర్వాత బలహీనపడే పార్టీ స్ధానంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని పవన్ అభిమానుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు.

ప్రణాళికలు బలంగానే కనిపిస్తున్నా కర్నాటక తర్వాత ఒక్క తెలంగాణ మినహా బీజేపీ బలపడే అవకాశాలు దక్షిణాదిన అంత సులువు కాదు. కానీ దీర్ఘకాలిక వ్యూహాలు, సైద్దాంతిక ప్రచారం, యువ ఓటర్లను ఆకర్షించడం, సంస్ధాగతంగా బలం పుంజుకోవడం అనే బీజేపీ ముందుచూపు ముందు మరే జాతీయ పార్టీ కూడా దిగదుడుపే అనడంలో అతిశయోక్తి లేదు.