గుజరాత్లో ఎన్నికల షెడ్యూల్ రాకుండానే అంచనాలు
ఏషియా నెట్ న్యూస్ కొత్త సర్వే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు క్షేత్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ నిర్వహించిన ప్రీ-పోల్ సర్వే.. అక్కడ బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి.. రికార్డు స్థాయిలో వరుసగా ఏడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది. బీజేపీకి 48 శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. సీఫోర్(Cfore)తో కలిసి ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఈ ప్రీ-పోల్ సర్వేను నిర్వహించింది.
ఈ సర్వేలో.. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,82,557 మంది ఓటర్ల అభిప్రాయాన్ని క్రమబద్ధమైన నమూనా పద్ధతిని ఉపయోగించి తీసుకోవడం జరిగింది. గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రూపంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ ఓట్లలో కొంతమేర ఆప్ వైపు మళ్లుతున్నట్టుగా తేలింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 31 శాతం, ఆప్‌కి 16 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ప్రీ పోల్ సర్వే పేర్కొంది.
ఇప్పటికిప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. 182 మంది సభ్యుల అసెంబ్లీలో 133 నుంచి 143 సీట్లతో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్, సీఫోర్ ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. అయితే కాంగ్రెస్ 28 నుంచి 37 స్థానాలకు, ఆప్ 5 నుండి 14 స్థానాలు సాధించవచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే.. 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 77 సీట్లు, స్వతంత్రులు 3 చోట్ల, బీటీపీ 2 సీట్లు, ఎన్సీపీ 1 సీటు గెలుచుకున్నాయి.
ఈ ప్రీ-పోల్ సర్వేలోని ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలిస్తే..
1. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ 10 శాతం తగ్గే అవకాశం ఉంది. అయితే బీజేపీకి ఒక శాతం, ఇతరులకు ఐదు శాతం తగ్గవచ్చు. పూర్తి స్థాయిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్‌కు ప్రయోజనం ఉంటుదని.. దాని ఓట్ల శాతం 16 శాతం పెరగవచ్చని ప్రీ-పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం క్షీణించడానికి కీలకమైన కారణాలలో ఒకటి పటిష్టమైన నాయకత్వం లేకపోవడం. అలాగే ఆ పార్టీలోని ప్రభావవంతమైన నాయకులు బీజేపీలో చేరడం.. రాష్ట్ర స్థాయిలో పార్టీ వ్యవస్థను బలహీనపరిచిందని అని ప్రీ-పోల్ సర్వే వెల్లడించింది. ఇక, రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. యాత్ర దక్షిణాది రాష్ట్రంలో సంచలనం సృష్టించినప్పటికీ.. గుజరాత్‌లోని ఓటర్లపై పెద్దగా ప్రభావాన్ని సృష్టించలేదని, కాంగ్రెస్ పార్టీపై విశ్వాసాన్ని పెంచడంలో సహాయకపడకపోవచ్చని చెబుతున్నారు.
2. ఢిల్లీ, పంజాబ్‌లలో మాదిరిగానే గుజరాత్‌లో కూడా కాంగ్రెస్‌కు ఆప్ ప్రత్యామ్నాయంగా మారుతోంది. ప్రీ పోల్ సర్వే ప్రకారం.. ఆప్ ఎక్కువ మంది కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షిస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 66 శాతం మంది ఆప్ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేయగా.. కేవలం 21 శాతం మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు. ఇలా కాంగ్రెస్ క్షీణించడం, విపక్షాల ఓట్లు చీలిపోవడం వల్ల బీజేపీకి మేలు జరుగుతోంది.
3. ఏషియానెట్ న్యూస్-సీఫోర్ ప్రీ పోల్ సర్వే ప్రకారం.. గుజరాత్‌లోని బీజేపీ ఓటర్లు ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్, రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల కారణంగా ఆ పార్టీకి ఓటు వేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పనితీరు బాగుందని 34 శాతం మంది పేర్కొనగా.. 9 శాతం మంది ప్రజలు 'అద్భుతంగా' ఉందని పేర్కొన్నారు.
4. మొత్తం పాలన పరంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పనితీరుపై సర్వేలో అభిప్రాయాలు వెల్లడించిన వారిలో 46 శాతం మంది సంతృప్తి చెందారు. 27 శాతం మంది అతని పాలన బాగుందని చెప్పగా.. తొమ్మిది శాతం మంది ఆయన పనితీరు అద్భుతంగా ఉందని రేటింగ్ ఇచ్చారు. సర్వేలో పాల్గొన్న వారిలో 34 శాతం మంది పటేల్ మళ్లీ గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు.
5. ఏషియానెట్ న్యూస్-సీఫోర్ ప్రీ-పోల్ సర్వేలో కూడా సమాజంలోని కొన్ని వర్గాలలో, ముఖ్యంగా తక్కువ-ఆదాయ వర్గాలలో.. ప్రధానంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల బీజేపీకి వ్యతిరేకంగా అసంతృప్తి వ్యక్తం అయింది. నిరుద్యోగ రేటు అధికంగా ఉండటం కూడా ఓటర్లలో మరొక ప్రాథమిక ఆందోళనగా ఉంది. దళితులు, గిరిజనులు, ఠాకూర్లు, ముస్లింలలో అసంతృప్తి ఎక్కువగా ఉంది.
6. అయినప్పటికీ.. చాలా మంది తమ సమస్యల పరిష్కరించడానికి కాంగ్రెస్‌ను విశ్వసించేందుకు సిద్దంగా లేరని ఈ సర్వేలో తేలింది. చాలా మంది ఓటర్లు.. ముఖ్యంగా సౌరాష్ట్ర, సూరత్ ప్రాంతంలోని వారు ఉచిత విద్యుత్ (300 యూనిట్ల వరకు), నిరుద్యోగ యువతకు నెలవారీ భత్యం రూ. 3000 వంటి ఉచితాల కోసం AAP వైపు ఆకర్షితులయ్యారు. అయితే చాలామంది ఆప్ గుజరాత్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయదని కూడా నమ్ముతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చే అవకాశం లేనందున.. వారి నియోజకవర్గంలో ఆప్ ఎమ్మెల్యేను ఎన్నుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేరని అభిప్రాయపడుతున్నారు.
7. బీజేపీ ఎమ్మెల్యేను ఎన్నుకోవడం వల్ల తమ నియోజకవర్గం, గుజరాత్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతాయని చాలా మంది ఓటర్లు నమ్ముతున్నారు. 49 శాతం మంది ఓటర్లు మళ్లీ బీజేపీకి ఓటు వేయడానికి ప్రభుత్వ అభివృద్ధి పనులే ప్రధాన కారణమని వెల్లడించారు. 32 శాతం మంది ప్రధాని మోదీకి ఉన్న పలుకుబడి, ఇమేజ్ కారణంగా బీజేపీకి ఓటేస్తామని చెబుతున్నారు.
8. గుజరాత్‌లోని చాలా మంది ఓటర్లు బీజేపీ ప్రభుత్వం నుంచి రెండు ప్రధాన డిమాండ్‌లను మాత్రమే కలిగి ఉన్నారు. ఉద్యోగాల కల్పన, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని వారు కోరుతున్నారు. జీఎస్టీ రేట్లను భారీగా తగ్గించడం, రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపును వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడం వంటి వాటిపై దిగువ ఆర్థిక వర్గాల ఆశలు పెట్టుకున్నాయి. రుణాల మాఫీ మరియు వారి పొలాలకు నీరందించేందుకు రోజుకు కనీసం 12 గంటల విద్యుత్ సరఫరా కావాలని రైతులు ఆశిస్తున్నారు.
9. కాంగ్రెస్ విషయానికొస్తే.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామని చెబుతున్నవారిలో 57 శాతం మంది గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వ పనితీరు పట్ల సంతోషంగా లేమని చెబుతున్నారు. కేవలం 12 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ ఉచితాలు, ఎన్నికల ముందు చేస్తున్న వాగ్దానాలతో ఆ పార్టీకి ఓటు వేస్తామని చెబుతున్నారు. అయితే 7 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీ, ఇతర నాయకుల ఇమేజ్ మరియు ప్రతిష్ట కారణంగా కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి కారణం కావచ్చని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
10. ఆప్‌కు సంబంధించినంతవరకు.. 43 శాతం మంది ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి ఓటు వేయడానికి ఏకైక కారణం గుజరాత్‌లో ప్రచారం చేస్తున్నప్పుడు చేసిన ఉచితాలు, ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు అని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ పనితీరుతో సంతృప్తి చెందని వారి నుంచి ఆప్ ఓట్లను పొందవచ్చని 27 శాతం మంది అభిప్రాయపడ్డారు. 17 శాతం మంది కేజ్రీవాల్ ప్రతిష్ట, ఇమేజ్ ఆప్ ఓట్లు రాబట్టడానికి మరో కారణమని అభిప్రాయపడ్డారు.