home page

జగన్ను కూడా విచారించాలి

 | 
Raghu

వివేకా హత్య కేసులో జగన్ ను విచారించాలి

 ఎంపీ రఘురామకృష్ణంరాజు

 కడప మాజీ ఎంపీ   వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సాక్షిగా విచారిస్తే ఈ కేసు త్వరగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. న్యాయం చేయడమే కాదు... న్యాయం చేసినట్లు కనిపించాలన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారించడం అన్నది  తప్పనిసరి పేర్కొన్నారు . జగన్మోహన్ రెడ్డిని విచారించకపోతే కొన్ని అనుమానాలు చరిత్రపుటల్లో అలాగే నిలిచిపోతాయని అన్నారు . వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ చేయడం హర్షించదగ్గ  పరిణామమని చెప్పారు . మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇకపై వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో  సాక్షాదారాలను ధ్వంసం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, కుట్ర కోణం దాగి ఉందని  సుప్రీంకోర్టు  న్యాయమూర్తి  వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు ను లోతుగా విచారించాలని కోరారు. వివేకా భార్య, కుమార్తె న్యాయం కోసం సుప్రీం కోర్టు వరకు రావడం కలిసి వేసిందని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి, న్యాయం చేయడమే కాదని... న్యాయం జరిగినట్లుగా కనిపించాలని  అన్నారన్నారు. వివేకా హత్య కేసును విచారిస్తున్నసిబిఐ అధికారులపై రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేయడం వల్లే ఈ కేసు విచారణలో జాప్యం జరిగిందన్నారు. డాక్టర్ సునీత కోరిక మేరకు హత్య కేసు విచారణను హైదరాబాదుకు బదిలీ చేయాలని  సుప్రీంకోర్టు నిర్ణయించిందని తెలిపారు.. హైదరాబాద్ లో కూడా కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు.

  చాచి లెంపకాయ కొట్టినట్లు గా సుప్రీం నిర్ణయం...

 దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని నిర్ణయించడం పట్ల ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల రాష్ట్రంలో   తమ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సాక్షి, అనుబంధ చానల్స్, నీలి మీడియా కథనాలను రాసుకుంటుందని అపహస్యం చేశారు. సుప్రీం కోర్టు నిర్ణయం  తమ ప్రభుత్వానికి, పార్టీకి చాచి లెంపకాయ కొట్టినట్లు అయిందని అన్నారు..

 ఇద్దరు ఎంపీలను విచారించాల్సిందే...

 వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం ఆయన గుండెపోటుతో మరణించారని మీడియా కు చెప్పిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని, హత్య కేసులో అనుమానితుగా పేర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవాల్సిందేనని రఘురామకృష్ణంరాజు అన్నారు. సిబిఐ అధికారి రాంసింగ్ స్వేచ్ఛగా హైదరాబాద్ కు వెళ్లి హత్య కేసును విచారించవచ్చునని అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కు వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయం ఆయనకు ఉండేదని పేర్కొన్నారు.

 జగన్మోహన్ రెడ్డి ముందే ఎలా చెప్పారు?

 వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందో అప్రూవర్ గా మారిన దస్తగిరి చెప్పినట్లుగానే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందే ఎలా ఊహించి, మీడియాకు వివరించారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా?? అని నిలదీశారు. తన బాబాయి హత్య ఎలా జరిగిందో జగన్మోహన్ రెడ్డి ముందే తెలుసుకున్నారా?, లేకపోతే హత్య జరిగిన తీరు గురించి ఆయనకు ఎవరైనా చెప్పారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో హత్యోదంతం పై మాట్లాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనుమానితులను  వెనుకేసుకొచ్చే విధంగా  మాట్లాడారని గుర్తు చేశారు. హత్య కేసులో నిందితులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని చెప్పాల్సిన ముఖ్య మంత్రి, శివ శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు తనకు రెండు కళ్ళు అని అప్పటి డిజిపి సవాంగ్ తో పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సాక్షి యజమాని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకపోయినా, ఈ కేసు లో ఆయన్ని  ఒక సాక్షిలా పిలిచి విచారించాలని రఘురామకృష్ణం రాజు సిబిఐ ని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ  సిట్ విచారణకు  తాను హాజరు కాకపోతే, లుకౌట్ నోటీసులు జారీ చేస్తారని సాక్షి దినపత్రికలో వార్తా కథనం రాయడం విడ్డూరంగా ఉందన్నారు.  ఇతరులపై విషపు రాతలు రాసే సాక్షి దినపత్రిక, జగన్మోహన్ రెడ్డి ని సిబిఐ విచారణకు పిలవాలని ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. సాక్షాలను ధ్వంసం చేశారని, తారుమారు చేశారని సుప్రీం కోర్టు పేర్కొన్న తర్వాత ముఖ్యమంత్రి పదవికి  జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని  ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన డిమాండ్ సహేతుకమైన దేనని అన్నారు.. గతంలో చిన్న చిన్న కారణాలకే ఎంతోమంది నాయకులు తమ పదవులు త్యాగం చేశారని గుర్తు చేశారు . నేదురు మల్లి జనార్దన్ రెడ్డి నీలం సంజీవరెడ్డి వంటి వారు తమ పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు  గుర్తు చేశారు.

 సునీత ప్రజా జీవితంలోకి రావాలి 

 వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం డాక్టర్ సునీత  సాగించిన పోరాటానికి దక్కిన  విజయమని రఘురామకృష్ణం రాజు అన్నారు. సునీత స్ఫూర్తితో  ప్రజలు, మహిళల్లో కూడా పోరాడాలని ధైర్యం వస్తుందన్నారు. సునీత ప్రజా జీవితంలోకి వస్తే బాగుంటుందని సూచించారు. ప్రజా జీవితంలో అడుగుపెట్టే విషయమై ఆమె అలోచించి తగిన  నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. 

 అమరావతే ఏపీ రాజధాని 

 హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో  పిటీషన్  దాఖలు చేయగా... ప్రభుత్వం కోరుకున్నట్టుగా అన్నింటిపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఏడు అంశాలలో ఐదింటిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, 80 శాతం విజయం తమదే విజయమని నీలి బ్యాచ్ చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరు తాత్కాలిక న్యాయమూర్తిగా ఈ కేసుకు విచారించారన్నారు . మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, ఇతర సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నప్పుడు సహజంగానే న్యాయమూర్తులు వారి మాట వింటారన్నారు  . అంతమాత్రాన  తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని నీలి బ్యాచ్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కర్నూలులో హైకోర్టు  ఏర్పాటు ఉత్తిదేనని  పేర్కొనడం జరిగిందని, అయినా రాయలసీమ వాసులు ప్రభుత్వ పెద్దలను నమ్మడం దురదృష్టకరమన్నారు. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే కష్టమని పేర్కొనడంతో, దానిపై సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలిపారు.  తీర్పు పూర్తి
పాఠాన్ని పరిశీలిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దేనిపైనా కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిందని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. రాజధాని ఏర్పాటుపై  శాసన సభ కు అధికారాన్ని కోరుతూ, స్టే ఇవ్వాలని కోరగా... సుప్రీంకోర్టు నిరాకరించిందని తెలిపారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటు అన్నది పార్లమెంటు పరిధిలోని వ్యవహారమని, పార్లమెంటుకే ఆ హక్కులు ఉన్నాయని తేల్చి చెప్పిందన్నారు. సి ఆర్ డి ఏ చట్టాన్ని యధాతధంగా  అమలు చేయాలని సూచించిందన్నారు . రాజధాని నిర్మాణం పై స్టే ఇచ్చినప్పటికీ , కాల పరిమితి లోపు పూర్తి చేయాల్సిందేనని చెప్పకనే చెప్పిందన్నారు. కర్నూలు నుంచి అమరావతి ఎంత దూరం అని మాత్రమే సుప్రీంకోర్టు అడిగిందని, దానికే వికేంద్రీకరణకు సుప్రీంకోర్టు అనుకూలమని నీలి చానెళ్లు  ప్రచారం చేసుకుంటున్నాయని మండిపడ్డారు. పార్లమెంటు చేసే చట్టానికి వ్యతిరేకంగా ఏ కోర్టులు కూడా ముందుకు వెళ్ళదని రఘురామకృష్ణంరాజు తెలిపారు .  రాజధాని అంశంపై బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ విధానాన్ని స్పష్టం చేశాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని రఘురామకృష్ణం రాజు తేటతెల్లం చేశారు.31 మంది ఎంపీలు ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది ఏమీ లేదని స్పష్టం చేశారు.

 ఎంపీ ఫిర్యాదు స్వీకరించరట... ఎంపీపై ఫిర్యాదు అయితే స్వీకరిస్తారట!

 ఎంపీ ఫిర్యాదు చేస్తే స్వీకరించేందుకు ఏపీ పోలీసులు సిద్ధంగా లేరని, ఎంపీ నైన తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఆచంట నియోజకవర్గానికి చెందిన వేణుబాబు అనే వ్యక్తి  తన పీఏనని చెప్పుకుంటున్నారని తెలిసిందన్నారు. వాట్సాప్ లో తన ఫొటో డిపి గా పెట్టుకొని వేణుబాబు, తనకు తానుగా పిఏగా ప్రచారం చేసుకుంటున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. దీనితో తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా ఆదేశించానని తెలిపారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తమ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్ని స్వీకరించేందుకు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కలిసిన అదే పరిస్థితి ఎదురు కావడంతో, ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సూచించానని తెలిపారు.  ఎంపీ ఇచ్చే ఫిర్యాదు తాము స్వీకరించమని, ఎంపీపై ఎవరైనా ఫిర్యాదు ఇస్తే స్వీకరిస్తామని సాక్షాత్తు సబ్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బందితో పేర్కొన్నారని రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.