home page

గవర్నర్లు : ఒకనాటి విలువలు

రాజ్యాంగంలో స్పష్టమైన విధానం 

 | 

ఎన్నికల సంఘం (ఇ.సి), కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (సిఎజి) పని తీరు కూడా చాలా అసంతృప్తికరంగానే వుంటోంది. ఇక కొన్ని రాష్ట్రాల గవర్నర్లు (ప్రత్యేకించి బిజెపి యేతర రాష్ట్రాల గవర్నర్లు) వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగాన్ని దాని పరిమితులను కూడా బూటకంగా మార్చేస్తున్నాయి.
రాజ్యాంగం లోని 153వ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్‌ వుండాలంటోంది. పరిపాలన గవర్నర్‌ పేరుతో జరగాలన్న 154వ అధికరణం ప్రకారం రాష్ట్ర పాలనాధికారం గవర్నర్‌ పేరిట సాగుతుంది (''ఆయన ప్రత్యక్షంగా గానీ, లేక రాజ్యాంగం ప్రకారం ఆయన దగ్గర పని చేసే అధికారుల ద్వారా గాని వీటిని నిర్వహించవలసి వుంటుంది''). అయితే అదే సమయంలో ఉన్న చట్టం ప్రకారం మరే ఇతర అధికార వ్యవస్థకైనా సంక్రమించే అధికారాలలో గవర్నర్‌ తన చేతి లోకి తీసుకోరాదని 154 (2) (ఎ) నిషేధం విధిస్తున్నది. ఈ విషయంలో 163వ అధికరణం మరింత స్పష్టంగా చెబుతున్నది. ''గవర్నర్‌కు సహాయ పడేందుకు, సలహాలిచ్చేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రివర్గం వుండాలి....రాజ్యాంగ పరంగా తన విచక్షణాధికారం వినియోగించ వలసిన, చర్య తీసుకోవలసిన సందర్భాలలో మాత్రమే ఇది వర్తించదు''.
షంషేర్‌ సింగ్‌కూ పంజాబ్‌ ప్రభుత్వానికి మధ్య 1974లో నడిచిన కేసులో సుప్రీంకోర్టు ఈ విషయమై స్పష్టీకరణ ఇచ్చింది. 166వ అధికరణం ప్రకారం రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన నిబంధనలు రూపొందించే విధంగా గవర్నర్‌ పని చేస్తారు. వాటినే పని పద్ధతులు అంటారు. అయితే కోర్టు మరో విషయం కూడా విశదం చేసింది. రాష్ట్రపతి లేదా గవర్నర్‌ తమ విధులు నిర్వహించడానికి సంతృప్తి చెందవలసిన అంశాలు కొన్ని వున్నాయి. ఉదాహరణకు 123, 213, 311 (2) (సి), 317, 352 (1), 356, 360 వంటి అధికరణాల విషయంలో వారు వ్యక్తిగతంగా సంతృప్తి చెందవలసి వుంటుంది. కేబినెట్‌ తరహా వ్యవస్థలో వారిలా సంతృప్తి చెందడమంటే రాజ్యాంగపరంగానే చూడాల్సి వుంది. అయితే లాంఛనమైన లేదా రాజ్యాంగపరమైన రాష్ట్రాధినేతగానే ఆయన సంతృప్తి చెందడమనే మాటను తీసుకోవాల్సి వుంది. కేవలం 356వ అధికరణం కింద మాత్రం గవర్నర్‌ రాష్ట్ర మంత్రివర్గ సలహాలు సూచనలకు వ్యతిరేకంగా కూడా తన విచక్షణను ఉపయోగించవచ్చు. మిగిలిన అన్ని అంశాల్లోనూ ఆయన మంత్రివర్గానికి అనుగుణమైన రీతిలోనే విచక్షణాధికారం ఉపయోగించాలి. రాజ్యాంగం ఒక సమాంతర పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని తలచలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న మంత్రులే కార్యనిర్వావక వర్గం తీసుకునే ప్రతి చర్యకు బాధ్యత వహించవలసి వుంటుంది. రాష్ట్రాలలో బాధ్యతాయుతమైన ప్రభుత్వమంటే ఎన్నికైన మంత్రివర్గమే.
ఈ విషయంలో రాజ్యాంగ పరిషత్తు చర్చలు కూడా స్పష్టతనిస్తున్నాయి. 1949లో చర్చకు ఉద్దేశించిన 130వ అధికరణంపై ప్రొఫెసర్‌ కె.టి.షా ఇలా చెప్పారు: ఒక గవర్నర్‌ రాజ్యాంగ అధికరణలు, తదుపరి పేర్కొన్న నిబంధనల మేరకు వ్యవహరించడం తప్పనిసరి చేయాలి. అంటే మంత్రివర్గ సలహా మేరకు పని చేయాలని చెప్పాలి. గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించాలా లేక నేరుగా ఎన్నిక కావాలా అని చాలా వేడి వేడి చర్చ జరిగింది. ఇదో సమాంతర రాష్ట్రాధికార వ్యవస్థకు దారి తీస్తుందేమోననే భయంతో రాజ్యాంగ పరిషత్తు గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించాలని స్పష్టంగా తీర్మానం చేసింది. గవర్నర్‌కు ఇచ్చిన అధికారాలు తక్కువైనా...తను మంచివాడైతే చాలా మంచి పనులు చేసే అవకాశం వుంటుంది. అదే చెడ్డ గవర్నర్‌ అయితే పెద్ద అధికారాలేమీ లేకున్నా చాలా చెరుపు కూడా చేయొచ్చునని పి.కె.సేన్‌ వ్యాఖ్యానించారు. ఆయా విషయాలలో తల దూర్చడం ద్వారా గవర్నర్‌ ప్రజాస్వామ్య భావనను బలోపేతం చేస్తారా లేక దెబ్బ తీస్తారా అన్నది ప్రశ్న. గవర్నర్‌ కేవలం రాజ్యాంగబద్ద అధిపతిగా మాత్రమే వుండాలని మేము నిర్ణయించాము. యంత్రాంగం పని చేయడానికి అవసరమైన కందెనలా వుండి అన్ని చక్రాలు సక్రమంగా తిరగడానికి ఉపకరించే రీతిలో తను వుండాలని, ఊరికే తల దూర్చే విధంగా గాక స్నేహపూర్వక జోక్యంలా తన పాత్ర వుండాలని భావించాము'.
''ఈ విషయంలో నాకు స్వయంగా చేదు అనుభవం వుంది. రాష్ట్ర ప్రధాని (అప్పట్లో అలా అనేవారు)గా వున్నప్పుడు గవర్నర్‌ మా పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూశారు, ఏకకాలంలో మీరు ప్రజాస్వామ్యం, నియంతృత్వం రెండూ కొనసాగించలేరు - అంటూ విశ్వనాథదాస్‌ వివరించారు. అన్ని విషయాలు చూసిన మీదట గవర్నర్‌ను కేంద్రమే నియమించడం మంచిదని చెప్పాలి. తను స్థానిక రాజకీయ పార్టీల తాపత్రయాలు, అసూయల బెడదలేని వారై వుండాలి'' అన్నారు కె.ఎం.మున్షీ ఈ విషయమై బి.ఆర్‌.అంబేద్కర్‌ కూడా ఇలా చెప్పారు: గవర్నర్‌కు ఎలాంటి బాధ్యతలు వుండరాదని రాజ్యాంగ పరిషత్తు భావించిన విషయం సభలో అందరికీ తెలుసు. మామూలు మాటల్లో చెప్పాలంటే తన విచక్షణను బట్టి లేక వ్యక్తిగత తీర్పును బట్టి చేయవలసిన పనులేవీ గవర్నర్‌కు వుండకూడదు. నూతన రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఆయన అన్ని విషయాలలో తన మంత్రివర్గం సలహానే అనుసరించి పని చేయాల్సి వుంటుంది. కనుక గవర్నర్‌ను ఎన్నుకోవాలా లేక నియమించాలా అన్నది ఈ సభ ముందున్న సమస్య కాదు. గవర్నర్‌ గనక కేవలం రాజ్యాంగ పరిధికే పరిమితం అయ్యేట్టయితే ఈ చట్టంలో మనం స్పష్టంగా పొందుపర్చిన అధికారాలు గాక మరే అధికారం ఇవ్వకపోయేట్టయితే తనను పైనుంచి నియమించాలనే ఈ సూత్రంపై నాకెలాంటి మౌలిక ప్రాథమిక అభ్యంతరం లేదు.
143 (ఇప్పుడు 163) అధికరణంపై 1949 జూన్‌ ఒకటిన మాట్లాడుతూ ప్రొఫెసర్‌ షా మంత్రివర్గంలో అనుసరించే పద్ధతులు, సంప్రదాయాలు ఏమైనప్పటికీ ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ గవర్నర్‌కు సంబంధించినంత వరకూ మాత్రం ముఖ్యమంత్రిదే బాధ్యతగా వుండాలని నేను భావిస్తున్నాను. తన సహచరులుగా ఎవరుండాలి తొలగించాల్సివస్తే ఏం చేయాలి అన్నది గవర్నర్‌కు సలహా ఇవ్వాల్సింది ఆయనే. గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో సమర్థిస్తూ అంబేద్కర్‌ అవి చాలా పరిమితమైనవని పేర్కొన్నారు. ''మన రాజ్యాంగం చెబుతున్న ప్రకారం చేయవలసినవి తప్ప అని అది స్పష్టం చేస్తున్నది. కనుక 143వ అధికరణాన్ని గవర్నర్‌కు సంబంధించి కేటాయించబడిన నిబంధనలతో కలిపి చదువుకోవాల్సి వుంటుంది. అంతేగాని ఇష్టానుసారం తను అనుకున్నది చేసేవిధంగా మంత్రివర్గం ఇచ్చే సలహాలను తోసిపుచ్చవచ్చునని చెప్పే సాధారణ అధికారం కాదు''. 147 (ఇప్పుడు 167) కింద గవర్నర్‌కు ఇచ్చిన అధికారాలపై ఒక సభ్యుడు వెలిబుచ్చిన సందేహాలకు సమాధానంగా అంబేద్కర్‌ దీనివల్ల ఎలాంటి జోక్యానికి అవకాశం వుండదని స్పష్టం చేశారు. ఒక గవర్నర్‌ చేయవలసిన విధులు నిర్వహించడానికి అవసరమైన అంశాలనే ఇది అందిస్తున్నది. మంచి గవర్నర్‌ ఎవరైనా చేయవలసిన పనులే అవి. గవర్నర్‌ తనకు తానుగా ఏమీ చేయలేరనీ, మంత్రివర్గ సలహా మేరకు మాత్రమే తను నడుచుకోవలసి వుంటుందనీ మా మిత్రుడు అర్థం చేసుకుంటే అప్పుడు యథార్థ చిత్రం తన ముందు తెరచుకుంటుంది...అని రాజ్యాంగ పరిషత్తు సభ్యుడైన టి.టి.కృష్ణమాచారి చెప్పారు.
ఈ చర్చల వివరాలు గవర్నర్‌ పాత్ర, అధికారాలు, విధుల గురించి స్పష్టమైన అవగాహననిస్తాయి. నిజంగా గవర్నర్‌కు రోజువారీ పాలనా వ్యవహారాలలో తల దూర్చే అధికారం లేదు. అలాగే శాసనసభ ఆమోదించిన బిల్లులకు తన ఆమోద ముద్ర నిలిపివేసే అధికారమూ లేదు. కానీ ఈ రోజున ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలలో జరిగే తంతు గవర్నర్లు రాజ్యాంగాన్ని బేఖాతరు చేయడం తప్ప మరొకటి కాదు. బిజెపి పాలిత రాష్ట్రాలలో గవర్నర్లు తమ విధుల నిర్వహణ గురించి కిమ్మనకపోవడం ఆశ్చర్యకరం. సిబిఐ, ఇ.డి వంటి దర్యాప్తు సంస్థలు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరును కొంతైనా అర్థం చేసుకోవచ్చునేమో గానీ గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఎలా సాధ్యమో బొత్తిగా అర్థం కాదు. ఈ పరిస్థితిని న్యాయ వ్యవస్థ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేస్తుందని ఆశించడం తప్ప చేయగలిగింది లేదు, దారుణమైన ఈ పోకడలను అరికట్టడం అప్పుడే సాధ్యం.

వ్యాసకర్త : దుష్యంత్‌ దవే, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది
('ద హిందూ' సౌజన్యంతో)