home page

20 రోజులు 30 వేల కోట్లు !

గుజరాత్ కు మోడీ నజరానా  : అధికార దుర్వినియోగానికి పరాకాష్ట  

 | 
gujarat elections

ఇరవై రోజులు..30 వేల కోట్లు!
గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌తో సమయమిచ్చిన ఈసీ

పూర్తిగా వాడుకున్నప్రధాని నరేంద్రమోదీ
కోడ్‌ అమల్లోకి రాక ముందే సొంత రాష్ర్టానికి ప్రాజెక్టులు.. 

హిమాచల్‌ప్రదేశ్‌కు అక్టోబర్‌ 14న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి, గుజరాత్‌ షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) 20 రోజులపాటు ఆలస్యం చేయడానికి కారణం ఏమిటో బయటపడింది. 

స్వరాష్ట్రం గుజరాత్‌లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుండటం, ఓటర్లను మచ్చిక చేసుకోవాలంటే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను రాష్ర్టానికి ఇంకా కట్టబెట్టాల్సి ఉండటంతో ప్రధాని మోదీ ఈసీతో ఈ ‘రాజీ’కీయాన్ని సాగించారు. గడిచిన 20 రోజుల్లో ప్రధాని మోదీ గుజరాత్‌లో ఐదు రోజులు పర్యటించడం, రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కొత్తగా ప్రారంభించడం, ఓటర్లకు ఉచిత వరాలు కురిపించడం ఇందులో భాగమే.

ఏ రోజు.. ఏం జరిగింది?
అక్టోబర్‌ 15: బీజేపీకి అనుబంధ సంస్థ భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలే గుజరాత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతకొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ పరిణామం నష్టం కలిగించవచ్చని భావించిన ప్రభుత్వం 10 మంది సభ్యులతో హడావిడిగా ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
అక్టోబర్‌ 17: పైప్‌డ్‌ నాచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ), కంప్రెస్‌డ్‌ నాచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)పై 10 శాతం వ్యాట్‌ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఉజ్వల పథకం కింద రాష్ట్రంలోని 38 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా రెండు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది. అటవీశాఖలో 823 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది.

అక్టోబర్‌ 18: దీపావళి సందర్భంగా 71 లక్షల మంది రేషన్‌ కార్డుదారులకు కిలో చక్కెర, లీటర్‌ వంటనూనెను అదనంగా డిస్కౌంట్‌తో పంపిణీ చేస్తామన్నది. వారం పాటు ట్రాఫిక్‌ నిబంధనలను ఎత్తేసింది.

అక్టోబర్‌ 20: ప్రధాని మోదీ గాంధీనగర్‌లో డిఫెన్స్‌ ఎక్స్‌పో ప్రారంభించారు. రూ.4,155 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
అక్టోబర్‌ 21: కవాడియా, తపిలో పర్యటించిన మోదీ రూ.2,192 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు.
అక్టోబర్‌ 28: వర్షాలతో పంటలను కోల్పోయిన 8 లక్షల మంది రైతులకు రూ.630 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

అక్టోబర్‌ 29: పంచాయత్‌, పోలీసు శాఖల్లో 13 వేల మందికి నియామక ఉత్తర్వులు జారీచేశారు.
అక్టోబర్‌ 30: రూ.22 వేల కోట్ల విలువైన టాటా-ఎయిర్‌బస్‌ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు.

అక్టోబర్‌ 31: ఏక్తాదివాస్‌లో పాల్గొన్న ప్రధాని.. రూ.500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రకటించారు.

నవంబర్‌ 1: పంచమహల్‌ జిల్లాలో రూ.885 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.
నవంబర్‌ 3: ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించడానికి కొన్నిగంటల ముందు.. హోమ్‌గార్డ్స్‌ గౌరవవేతనాన్ని పెంచుతున్నట్టుప్రభుత్వం ప్రకటించింది.