home page

మద్రాసు హైకోర్టులో అధికారభాషగా తమిళం

ప్రధాని,సిజేఐలకు సిఎం

స్టాలిన్ లేఖ

 | 
Stalin

మోదీ పిలుపునకు అనుగుణంగా స్టాలిన్ స్పందన 

చెన్నై : మద్రాసు హైకోర్టు లో తమిళ భాషను అమలులోకి తేవాలని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్రానికి పంపిన లేఖలో కోరారు.

ఈమేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు లేఖలు రాశారు.

తమిళాన్ని మద్రాస్ హైకోర్టులో అధికార భాషగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్, బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ హైకోర్టులలో ఇంగ్లిష్‌తోపాటు హిందీకి అధికార భాష హోదాను కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇంగ్లిష్‌తోపాటు రాష్ట్రాల్లో అధికార భాషను సంబంధిత హైకోర్టు అధికార భాషగా ప్రకటించడానికి ఉన్న అడ్డంకులేమిటని ఆశ్చర్యం వ్యక్తమవుతోందని చెప్పారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు జరగాలని చెప్తూ, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో వైవిద్ధ్యం చాలా ముఖ్యమని తెలిపారు. కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నదాని ప్రకారం, ఉన్నత న్యాయ వ్యవస్థలో అన్ని వర్గాలవారి ప్రాతినిధ్యం తగ్గుతోందన్నారు. ఇది వైవిద్ధ్యం లోటుకు దారి తీస్తోందన్నారు. న్యాయ వ్యవస్థలో వైవిద్ధ్యం ప్రామాణిక, నాణ్యమైన న్యాయ నిర్ణయానికి ప్రాథమికమైనదని చెప్పారు.

వేర్వేరు నేపథ్యాలుగల న్యాయమూర్తులు

యావత్తు సమాజానికి ప్రాతినిధ్యం వహించే విస్తృత స్థాయి, వైవిద్ధ్యభరితమైన వర్గాలకు చెందిన న్యాయమూర్తులు ఉండాలన్నారు. ముఖ్యంగా చారిత్రక, సంప్రదాయ, భాషాపరమైన, సాంస్కృతికపరమైన అంశాల్లో ఈ వైవిద్ధ్యం అవసరమని చెప్పారు. వేర్వేరు నేపథ్యాలుగల న్యాయమూర్తులు తమ నేపథ్యాల ఆధారంగా చట్టాలను సహజంగా వివరించి, అమలు చేస్తారని, విస్తృత దృక్పథాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.

ప్రాంతీయ ధర్మాసనాలు

సుప్రీంకోర్టు ప్రాంతీయ ధర్మాసనాలను శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని కోరారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరికీ అత్యున్నత న్యాయస్థానం అందుబాటులో ఉండాలని భారత రాజ్యాంగంలోని అధికరణ 32 చెప్తోందన్నారు. ఆర్థిక పరిమితుల కారణంగా ఈ హక్కు క్రమంగా బలహీనపడుతోందని చెప్పారు. భౌగోళికంగా ఢిల్లీకి దూరంగా ఉన్న రాష్ట్రాలవారు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఇటువంటి రాష్ట్రాల్లోని చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును కోల్పోతున్నారన్నారు.

మోదీ పిలుపు

ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ , కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు  ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, న్యాయ ప్రక్రియ గురించి సామాన్య ప్రజలు అర్థం చేసుకోవడానికి వీలుగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో స్థానిక భాషను ఉపయోగించవలసిన అవసరం ఉందన్నారు. స్థానిక భాషలను కోర్టుల్లో ఉపయోగిస్తే న్యాయ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పెరుగుతుందని, న్యాయ వ్యవస్థతో తమకు అనుబంధం ఉందని భావిస్తారని చెప్పారు.