home page

కమిషన్ ఇవ్వకపోతే నిధులు ఇవ్వని కర్నాటక సర్కారు

ఒక మఠాధిపతి ఆరోపణ: స్పందించిన సీఎం

 | 
మఠాధిపతి

ఆగిన సంక్షేమం 

  • ఇదీ బీజేపీ దైవ భక్తి
  • గ్రాంట్లలో 30 శాతం కమీషన్‌ డిమాండ్‌
  • ఇవ్వడం కుదరదంటే గ్రాంట్ల నిలిపివేత
  • కర్ణాటక బీజేపీ సర్కారుపై బలెహొసూర్‌
  • మఠాధిపతి దింగలేశ్వర్‌ సంచలన ఆరోపణలు
  • దర్యాప్తు చేపడుతాం:సీఎం బసవరాజ్‌ బొమ్మై

సంక్షేమ కార్యక్రమాల కోసం మఠాలకు విడుదలయ్యే గ్రాంట్లలో 30 శాతాన్ని కర్ణాటక బీజేపీ ప్రభుత్వమే కమీషన్‌గా తీసుకొంటున్నదని బలెహొసూర్‌ మఠాధిపతి, లింగాయత్‌ గురువు దింగలేశ్వర్‌ స్వామీజీ సంచలన ఆరోపణలు చేశారు.

దీనికి ఒప్పుకోకపోతే, ఆ గ్రాంట్లను పూర్తిగా నిలిపేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. బలెహొసూర్‌ మఠ సిద్ధాంతాలను కర్ణాటక, మహారాష్ట్రలోని కోటి మందికి పైగా లింగాయత్‌లు అనుసరిస్తారు. ఈ క్రమంలో స్వామీజీ తాజా ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

బెంగళూరు,: కర్ణాటకలో అధికార బీజేపీ నేతల కమీషన్‌ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లంచాలకు రుచిమరిగిన అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్లు, వ్యాపారులనే కాదు.. చివరకు ఆధ్యాత్మికతకు ఆలవాలమైన మఠాలను కూడా విడిచిపెట్టలేదు. మఠాలకు విడుదలయ్యే గ్రాంట్లలో 30 శాతాన్ని ప్రభుత్వమే కమీషన్‌గా తీసుకొంటున్నదని బలెహొసూర్‌ మఠాధిపతి, లింగాయత్‌ గురువు దింగలేశ్వర్‌ స్వామీజీ సంచలన ఆరోపణలు చేశారు. 'మఠం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఏవైనా గ్రాంట్లు మంజూరైతే, ఆ మొత్తాన్ని విడుదల చేసే కంటే ముందే అందులో 30 శాతాన్ని ప్రభుత్వం మినహాయించుకొంటుంది. దీనికి ఒప్పుకోబోమని ఎవరైనా చెబితే, ఆ గ్రాంట్లను పూర్తిగా నిలిపేస్తారు. ఈ వ్యవహారం అందరికీ తెలుసు' అని బాగల్‌కోట్‌లో జరిగిన ఓ సభలో పేర్కొన్నారు. స్వామీజీ ఆరోపణలపై సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పందించారు.

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. దింగలేశ్వర్‌ స్వామీజీ ఓ గొప్ప వ్యక్తి అని, ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్న బొమ్మై.. కమీషన్‌ అడిగిన వ్యక్తి గురించి వివరాలు చెప్తే కిందిస్థాయి నుంచి దర్యాప్తును చేపడుతామని హామీ ఇచ్చారు. కాగా ఉడిపికి చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకొన్నారు. పేమెంట్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి కర్ణాటక పంచాయతీరాజ్‌ మంత్రి ఈశ్వరప్ప 40% కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని అంతకు ముందు ఆయన ఆరోపించారు. దీంతో ఈశ్వరప్ప కారణంగానే సంతోష్‌ ఆత్మహత్య చేసుకొన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై ఈశ్వరప్పపై కేసు కూడా నమోదైంది. సర్వత్రా ఒత్తిళ్లు రావడంతో మంత్రి పదవికి ఆయన రాజీనామా కూడా చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్న కమీషన్‌ 45 శాతాన్ని మించిపోతున్నదని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న ఆరోపించడం ఇటీవల చర్చనీయాంశమైంది.

పవిత్రత ఎక్కడున్నది?
ధర్మాన్ని పరిరక్షిస్తున్నామంటూ ప్రచారం చేసుకొనే బీజేపీ.. మఠాలు, ఆలయాల నుంచి కమీషన్‌ను దండుకోవడం సిగ్గుచేటని మాజీ సీఎం సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. కర్ణాటక బీజేపీ సర్కారును 40 శాతం కమీషన్‌ ప్రభుత్వంగా అభివర్ణించారు. అవినీతి దందాలో స్వామీజీలను కూడా బీజేపీ ప్రభుత్వం విడిచిపెట్టట్లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దినేశ్‌ గుండూరావు మండిపడ్డారు. ఇలా అయితే పవిత్రత ఇంకా ఎక్కడ మిగిలి ఉంటుందని ప్రశ్నించారు. 'బీజేపీ రాష్ర్టాన్ని లూటీ చేస్తున్నది. ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తున్నది. మఠాలకు గ్రాంట్లను ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వం.. అందులో కూడా కమీషన్‌ను తీసుకొంటున్నది' అన్నారు. ప్రజలందరికీ తెలిసిన ప్రఖ్యాత స్వామీజీనే కమీషన్‌ తీసుకొంటున్నారని చెబుతున్నప్పుడు ఇంకా సాక్ష్యాలు ఎందుకోసమని? బొమ్మైని ప్రశ్నించారు.

ఎవరీ దింగలేశ్వర్‌ స్వామీజీ?

కర్ణాటకలో లింగాయత్‌ కమ్యూనిటీ ప్రధానమైనది. 6.6 కోట్ల జనాభాలో దాదాపు 16 శాతం మంది ఈ సామాజిక వర్గానికి చెందినవారే. అలాంటి కమ్యూనిటీకి ప్రతినిధిగా, లింగాయత్‌ మత గురువుగా దింగలేశ్వర్‌ స్వామీజీకి మంచి పేరుంది. బలెహొసూర్‌ మఠానికి రెండేండ్ల క్రితం మఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చాకనే.. బలెహొసూర్‌ మఠ సిద్ధాంతాలను అనుసరించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలోని కోటి మందికి పైగా లింగాయత్‌లు దింగలేశ్వర్‌ స్వామీజీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నట్టు చెబుతారు.