home page

వెలుగు చూసిన కుంభకోణాలు

సీఎం బసవరాజ్ బొమ్మై  మౌనం

 | 
దివ్య

పరారీలో దివ్య: కర్నాటక పోలీసుల గాలింపు చర్యలు

ఎస్‌ఐ ఎంపిక పరీక్షల్లో రూ. 210 కోట్ల స్కామ్‌
ఆలయాలకు ఇచ్చే నిధుల్లో 30 శాతం కమిషన్‌
బెంగళూరు : 
కర్ణాటకలో బిజెపి పాలనలో వరసగా కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయి.

మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమిషన్‌ డిమాండ్‌ చేసారని ఆరోపిస్తూ ఒక సివిల్‌ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్చిపోక ముందే మరో రెండు కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. సబ్‌ ఇన్‌స్పెక్టర్ల ఎంపిక కోసం నిర్వహించిన పరీక్షల్లో రూ. 210 కోట్ల కుంభకోణం జరిగింది. బిజెపి మహిళా నాయకురాలు దివ్య హగర్గి ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు. ఈమె గుల్బర్గాలో ఒక హైస్కూల్‌ను నడుపుతున్నారు. ఎస్‌ఐ పరీక్షా కేంద్రం కూడా ఈ హైస్కూల్‌ ప్రాంగణంలోనే ఉంది. ఈ కేసులో సిఐడి ఇప్పటికే విచారణ ప్రారంభించింది. దివ్యతో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. దివ్య భర్త రాజేష్‌ను అరెస్టు చేశారు. దివ్య ఇంటిని హోం మంత్రి సందర్శించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. హోం మంత్రికి దివ్య కుటుంబం సంప్రదాయ బద్ధంగా హారతి ఇవ్వడంతో పాటు, ఖరీదైన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. మాజీ సిఎం యడియూరప్పతో దివ్య ఉన్న ఫోటో కూడా వైరల్‌గా మారింది. ఈ కుంభకోణంలో సమాధాన పత్రాలు మారుస్తామని, అవసరమైన మార్కులు వేస్తామని ఒక్కొక్క ఆశావహ అభ్యర్థి నుంచి రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ వసూలు చేశారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. బెంగళూరులోని దివ్య నివాసం నుంచి కొన్ని డాక్యుమెంట్లను సిఐడి స్వాధీనం చేసుకుంది.
బిజెపి పాలనలో మరొక కుంభకోణాన్ని బలేహోసూర్‌ స్వామి జై శ్రీ దింగా లంగేద్ర స్వామిజి వెలుగులోకి తెచ్చారు. స్వామిజీ ఆరోపణల ప్రకారం ఏ మఠాలకైనా, ఆలయాలకైనా ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో 30 శాతాన్ని బిజెపి నాయకులకు చెల్లించాలి. మఠాలు, ఆలయాల ఎంపికలోనూ వివక్ష ఉందని స్వామిజి ఆరోపించారు. ఈ ఆరోపణలు సాధారణ ప్రజలతో పాటు మత సంస్థలను కూడా దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కాగా, ఎప్పటి మాదిరిగానే ఈ కుంభకోణాలపై ముఖ్యమంత్రి బొమ్మై మౌనం వహిస్తున్నారు.