home page

తాజ్ మహల్ గదుల్లో ఏముందంటే.....!

కోర్టు వివాదాల నేపథ్యంలో ఫోటోలు విడుదల

 | 
Taj mahal

వివాదం ముగిసినట్టేనా?        మళ్ళీ మొదటికి వస్తుందా?

ఆగ్రా లోని తాజ్ మహల్ లో మూసివున్న 22గదులలో ఏముందో తేల్చాలని దాఖలైన పిటిషన్ కొట్టివేసిన దరిమిలా  భారత పురావస్తు శాఖ కొన్ని ఫోటోలను విడుదల చేసింది.గత కొన్ని రోజులుగా తాజ్ మహల్ పై తలెత్తిన వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. 

తాజ్ మహల్ లోని మూసివుంచిన 22 గదుల్లో హిందూ శాసనాలు, దేవతా విగ్రహాలు ఉన్నాయంటూ కొందరు వ్యక్తులు వాదించారు. అయితే ఈ వాదనలపై స్పందించిన భారత పురావస్తుశాఖ అధికారులు.. ఆ గదుల్లో ఏమిలేదని మొదట నుంచి వివరణ ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై చెలరేగిన వివాదానికి తెరదించేందుకు పురావస్తుశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివాదానికి కారణమైన 22 గదుల చిత్రాలను పురావస్తుశాఖ వెబ్ సైట్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. తాజ్ మహల్ లోని మూసి ఉంచిన గదుల గురించి అసత్య ప్రచారాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పురావస్తుశాఖ తెలిపింది.

ఇప్పటి వరకు మూసి ఉంచిన గదుల్లో ఎటువంటి శాసనాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. గదులన్నీ ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. పురావస్తుశాఖ వెబ్ సైట్ లో ఉంచిన గదుల తాలూకు చిత్రాలన్నీ తాజా చిత్రలేనని ఆగ్రా పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు. గదుల్లో చిన్నపాటి మరమ్మతులు జరిగాయని, ఆ మరమ్మతులకుగానూ రూ.6 లక్షలు ఖర్చు అయినట్లు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ వివాదం ఎలా ఉన్నా, నడి వేసవిలోనూ తీవ్రమైన వేడిని సైతం లెక్కచేయకుండా వేలాది మంది పర్యాటకులు తాజ్ మహల్ వీక్షించేందుకు వస్తున్నట్లు పర్యాటకశాఖ తెలిపింది. శనివారం ఒక్కరోజే 20 వేల మందికి పైగా పర్యాటకులు తాజ్ సందర్శనకు వచ్చినట్లు పర్యాటకశాఖ గణాంకాలు చెబుతున్నాయి.