ఉదయ్ పూర్ హత్య కేసు ఎన్ఐఏకు అప్పగింత
టైలర్ ను హత్య చేసిన ఆగంతకులు ఇద్దరికీ పాక్ తో సంబంధాలు
ఈ కేసులో ఉగ్ర సంస్థల ప్రమేయం ఉందన్న కోణం బయటకు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కన్హయ్య హత్య తర్వాత ఉదయ్‌పూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధికారులతో శాంతి భద్రతల అంశంపై చర్చించారు. ఉదయ్‌పూర్‌లో నెల రోజులపాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మరో 24 గంటలపాటు రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కన్హయ్య హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో నిందితులైన మొహమ్మద్ గౌస్, మొహమ్మద్ రియాజ్‌లను రాజస్థాన్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కాగా, వీరికి పాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పాకిస్తాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేసే సున్నీ ఇస్లామిస్ట్ సంస్థ అయిన దావత్-ఇ-ఇస్లామి అనే సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇద్దరు నిందితుల్ని స్లీపర్ సెల్స్‌గా భావిస్తున్నారు. తాజా ఘటన దేశంలో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరుగుతుంది అనడానికి ఒక ఉదాహరణగా నిలిచింది. కాగా, హత్యకు గురైన కన్హయ్యకు సంబంధించిన అటాప్సీ ప్రాథమిక నివేదిక వెల్లడైంది. కన్హయ్య ఒంటిపై 26 కత్తి పోట్లు ఉన్నాయని, అధిక రక్తస్రావం కావడం వల్లే మరణించాడని ఈ నివేదిక చెబుతోంది. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకున్న వీడియోను స్థానిక కాంగ్రెస్ నేత సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది.