home page

ఇవాళ్టి వార్త : బుల్డోజర్ రాజకీయలు

యూపీ టూ ఢిల్లీ నాన్ స్టాప్ 

 | 
Bulldozer
అనుమతులు లేవని, పాడుపడిన పాత నిర్మాణాలను కూల్చేసే బుల్డోజర్ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలుపెట్టింది. అక్రమ నిర్మాణాల అంతు తేల్చే బుల్డోజర్ ఇప్పుడు మతం రంగు పూసుకుంది. యూపీలో ప్రారంభం అయింది. మధ్యప్రదేశ్ మీదుగా ఢిల్లీ చేరింది. 

నేలను చదును చేసే ఓ యంత్రం ఇప్పుడు పేదోళ్ల గూడును, వారి కలలను నేలమట్టం చేస్తోంది. ఈ బుల్డోజర్‌ రాజకీయాలు యూపీ నుంచి మొదలై మధ్యప్రదేశ్‌కు, అక్కడి నుంచి గుజరాత్‌కు, ఇప్పుడు ఏకంగా ఢిల్లీకి చేరాయి. కనీ వినని విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. నడిరోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయి. అసలు దేశంలో ఏం జరుగుతోంది ? దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారు ? బుల్డోజర్లతో ఎవరిపై దండయాత్రలు చేస్తున్నారు ?

నిన్నటి వరకు యూపీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ లాంటి రాష్ట్రాలకే బుల్డోజర్ రాజకీయాలు పరిమితం అనుకున్నారు. కానీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ బుల్డోజర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. పట్టపగలు
నేతల అండదండలతో అధికారులు పేద ప్రజల ఇళ్లపై బుల్డోజర్లతో విధ్వంసం సృష్టిస్తుంటే ఆపేవాడే లేకపోయాడు. చివరకు కోర్టు జోక్యం చేసుకుంటే కానీ విధ్వంసం ఆగలేదు. కూల్చివేతలు ఆపాలని కోర్టు ఆదేశాలిచ్చినా.. దాదాపు రెండు గంటలపాటు విధ్వంసం ఆగలేదు.దీన్నిచూసి ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను ఎంతలా పరిహాసం చేశారన్నది అర్థం చేసుకోవచ్చు. కోర్టు స్పందించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంతోమంది కలలు బుల్డోజర్ కింద ఛిద్రమయ్యాయి. వారి జీవనాధారాలు కూడా శిథిలమైపోయాయి. హానుమాన్‌ జయంతి శోభాయాత్ర సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. అదే ప్రాంతంలో అక్రమ కట్టాలంటూ కూల్చివేత పనులు మొదలుపెట్టారు అధికారులు. భద్రత కోసం సుమారు 400 మందిని పోలీసు సిబ్బందిని వెంటపెట్టుకుని.. తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ నిర్మాణలంటూ కూల్చేసుకుంటూ పోయారు.

Also read : CM kejriwal : కర్ణాటకలోనూ పోటీ చేస్తాం.. విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం :కేజ్రీవాల్

నక్కి నక్కి కాదు తొక్కుకుంటూ పోవాలి అన్నట్లుగా.. కనిపిస్తోందీ వ్యవహారం. నేతల మెప్పు పొందడం కోసం అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అక్రమ కట్టడాలు ఓ ఎంపీ, ఓ మంత్రిది
అయితే ఇలానే కూల్చేస్తారా ! అధికారులకు అంత దమ్ముందా ? నిజంగా అవి అక్రమ కట్టడాలే అయితే ముందుగా ఏం చేయాలి… వారికి నోటీసులు ఇవ్వాలి. వారిచ్చే వివరణను పూర్తిగా వినాలి. న్యాయ పోరాటం చేసే అవకాశం కల్పించాలి. అంతేకానీ.. అవి అక్రమ కట్టడాలనీ చెప్పి ఇష్టానుసారంగా కూల్చుకుంటూ పోతే ఇది ప్రజాస్వామ్య దేశం ఎలా అవుతుంది. అడిగేవాడు లేడని ఇంతలా రెచ్చిపోతారా ?
న్యాయ స్థానాల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ మరో రెండు గంటలపాటు బుల్డోజర్లతో విధ్వంసం కొనసాగించారంటే… బలుపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మేమంతా చూసుకుంటాం మీరు కానివ్వండి అంటూ వారిని ఉసిగొల్పిన వారు ఏ స్థాయి వాళ్లో ఊహించుకోవచ్చు. మరీ ఇంత దారుణమేంటి ! అదీ దేశ రాజధానిలో..! పేద ప్రజలపై ఈ ప్రతాపలేంటి ? ఎవరి అండదండలు చూసుకుని ఇలా రెచ్చిపోతున్నారు. దేశ రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటే యూపీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ మహిళ రోదన చూడండి. బుల్డోజర్లతో తన ఇంటిని కూల్చేస్తుంటే ఈమె ఎంతగా విలవిల్లాడిపోతోందో..! చూస్తేనే గుండె తరుక్కుపోతోంది. మరి అక్కడి అధికారులకు మాత్రం మనసు కరగలేదేమో !
తన ఇంటిని కూల్చేయొద్దంటూ ఆమె అధికారులను బతిమాలింది. అయినప్పటికీ కనికరం చూపని అధికారులు.. చూస్తుండగానే ఆమె సామగ్రిని జేసీబీలతో ఎత్తి ట్రాక్టర్‌లోని మట్టిలో పడేశారు. అక్రమ కట్టడాలు అంటున్నారు సరే.. కనీసం ఆ ఇంట్లో వారి సామాన్లైనా వారికి ఇచ్చేయాలి కదా..! వాటిని కూడా బుల్డోజర్లతో ఎత్తి లారీల్లో పడేయడం కంటే దారుణం ఇంకేముంటుంది ! బుల్డోజర్ విధ్వంసంలో ఇలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు.

ఇక్కడ చి పిల్లాడ్ని చూశారా ! ఈ పిల్లాడి తండ్రికి ఇక్కడ చిన్న జ్యూస్ ష్యాప్ ఉండేది. దానిపై కూడా బుల్డోజర్ ప్రతాపం చూపించింది. షాపును నేలమట్టం చేసేసింది. తన దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పినా వినకుండా.. కనీసం వాటిని చూడకుండా ఆ షాపును కూల్చేశారు. పూర్తిగా కూలిపోయిన షాపు దగ్గర ఇలా చిల్లర ఏరుకుంటూ ఈ పిల్లాడు కనిపించాడు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమమని చెబుతున్న నిర్మాణాలపైనే కాదు వాటి పక్కనే ఉన్న వాటిని కూడా కూల్చి పడేశారు.జహంగీర్‌పురి బుల్డోజర్ సృష్టించిన విధ్వంసంలో చిరు వ్యాపారులు కూడా రోడ్డున పడ్డారు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది ఓ తోపుడు బండి.అది రోడ్డు పక్కనే ఉన్నా..దాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నారో చూడండి. అదేమైనా అక్రమ కట్టడమా ! పక్కకు తీసేయమంటే తీసేస్తారు కదా ! దాన్ని బుల్డోజర్‌తో తుక్కు తుక్కు చేసి ఓ కుటుంబానికి జీవనాధారం దూరం చేశారు. మరీ ఇంత రాక్షసానందం దేనికోసమో!

Also read : Congress party: పీకేకు కాంగ్రెస్‌లో ఏ పదవి ఇవ్వబోతున్నారు? సీనియర్ల కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది?
జహంగీర్‌పురిలో జరిగింది అక్రమ కట్టడాల కూల్చివేత కాదు ! 400 మంది పోలీసులతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం చేసిన దండయాత్ర ఇది. వీళ్లు కూల్చేసింది అక్రమ కట్టడాలు కాదు.. ఎంతోమంది పేద ప్రజల కలలు. వీళ్లు కూల్చేసింది ఇళ్లు కాదు.. ఎంతోమంది పేద ప్రజలకు కష్టార్జీతం. వీళ్లు ధ్వంసం చేసింది షాపులు కాదు.. ఎన్నో కుటుంబాల జీవనాధారం. మీ మత రాజకీయాలకు
మీ అధికార గర్వానికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారి కన్నీళ్లు మీకు కనిపించడం లేదా ? వారి కష్టాలను మీ మనసు కరిగించడం లేదా ? మత రాజకీయాలతో పబ్బం గడుపుకునే అవసరం మీకు
ఉందేమో కానీ.. పూట గడవడమే కష్టమైన పేద ప్రజలకు మెదళ్లకు అలాంటి ఆలోచనే రాదు. అలాంటప్పుడు మీ బుల్డోజర్ రాజకీయాలకు వారిని బలిచేయడం కరెక్ట్‌ కాదు ! అంతా అయ్యాక అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చామంటూ కలరింగ్ ఇచ్చుకుంటున్నారు అధికారులు.. అసలు అక్రమ కట్టడాలు వెలుస్తుంటే ఇంతకాలం ఎందుకు కళ్లు మూసుకున్నారు.. ఆ వైఫల్యం అధికారులది కాదా..? ఒకవేళ వాళ్లు చెబుతున్నట్లే సంఘవిద్రోహ శక్తులు జమవుతుంటే ముందే ఎందుకు గుర్తించలేదు..? ముందే ఎందుకు అరెస్ట్ చేయలేదు..? మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంత దారుణంగా బుల్‌డోజర్లతో తొక్కిస్తారా..? ఈ ప్రశ్నలకే ఇప్పుడు సమాధానం కావాలి. 

సోమవారం ఉదయం ఢిల్లీ లో బుల్డోజర్ రాజకీయాల సెగ పెరిగింది. పది రోజుల క్రితం సుప్రీంకోర్టు బులోడజర్ లతో కూల్చే ప్రయత్నాలను అడ్డు కుంది. ఇవాళ మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటీషనర్ కోరినా తిరస్కరించింది.