జిఎస్టి కౌన్సిల్ కు రాష్ట్రాలు కట్టుబడి ఉండనవసరం లేదు
సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం హర్షం
పన్నులపై కేంద్ర, రాష్ట్రాలకు సమానాధికారం ఉంది
సుప్రీం వ్యాఖ్యలు మొత్తం జీఎస్టీ వ్యవస్థనే ప్రభావితం చేసేంత శక్తి కలిగిన తీవ్రమైనవని న్యాయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
పన్నులకు సంబంధించిజీఎస్టీ మండలి నిర్ణయాలను న్యాయసమీక్షలో భాగంగా న్యాయస్థానాలు తిరగదోడుతాయని కార్పొరేట్ సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పటిదాకా జీఎస్టీ మండలి నిర్ణయాలను రాష్ట్రాలు తూచ తప్పకుండా నోటిఫై చేస్తున్నాయని, సుప్రీంకోర్టు తీర్పుతో మండలి నిర్ణయాలకు భిన్నంగా కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు వెళ్లే అవకాశం ఏర్పడిందని ప్రముఖ వాణిజ్య పన్నుల నిపుణుడు రజత్ మోహన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఒకే దేశం ఒకే పన్ను స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉందని పవన్ అరోరా అనే పన్ను నిపుణుడు వ్యాఖ్యానించారు.
సమాఖ్యతత్వానికి, ప్రజాస్వామ్యానికి మండలి వేదిక
కేంద్రంతో ఏకీభవించకుంటే వాదన వినిపించొచ్చు
కేంద్ర, రాష్ట్ర చట్టాల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు
ఒకదాన్ని తోసిపుచ్చమని రాజ్యాంగం చెప్పలేదు
సర్వామోద పరిష్కారం జీఎస్టీ మండలి బాధ్యత
మండలి నిర్ణయాలను అవసరమైతే సమీక్షిస్తాం
పన్ను అధికారాలపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు
ఐజీఎస్టీ చట్టంలోని అక్రమ నిబంధనల కొట్టివేత
సుప్రీం వ్యాఖ్యలపై కేరళ, తమిళనాడు హర్షం
రాష్ట్రాల హక్కులకు బలం చేకూరిందని వ్యాఖ్య
తిరస్కరించే హక్కును రాష్ట్రాలెప్పుడూ వాడుకోలేదు
జీఎస్టీ వ్యవస్థకు తీర్పుతో ముప్పు లేదు: కేంద్రం
న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): వస్తు సేవా పన్నులకు సంబంధించి జీఎస్టీ మండలి అధికారాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దాని సిఫారసులు శిలాశాసనం కాదని తేల్చిచెప్పింది. వాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తేల్చి చెప్పింది. పన్నులు విధించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలు ఉన్నాయని, ఇందులో ఎవరూ ఎక్కువ, తక్కువ కాదని స్పష్టం చేసింది. జీఎస్టీ మండలిలో సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయానికి రావాలని చెప్పింది. జీఎస్టీ మండలి సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వాలు చేసే చట్టాలు, నిబంధనలను సమీక్షించే అధికారం రాజ్యాంగబద్ధంగా తమకు ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. జీఎస్టీ మండలి సిఫారసులను అడ్డం పెట్టుకొని, వాటిని అమలు చేస్తున్నామనే నెపంతో చట్ట విరుద్ధంగా సముద్రతల దిగుమతులపై ఐజీఎస్టీని వసూలు చేయడాన్ని సమర్థించుకోజూసిన కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగానే జీఎస్టీ మండలి స్వరూప స్వభావాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
జీఎస్టీ మండలి కేవలం పరోక్ష పన్నుల వ్యవస్థను పర్యవేక్షించే రాజ్యాంగబద్ధ సంస్థ మాత్రమే కాదని చెప్పింది. ప్రజాస్వామ్యం, సమాఖ్యతత్వాలను బలోపేతం చేసే వేదికగా ఉండాలని పేర్కొంది. కేంద్రం నిర్ణయంతో ఏకీభవించని పరిస్థితి వచ్చినపుడు రాష్ట్రాలు వివిధ రూపాల్లో ఇక్కడ తమ వాదన వినిపించవచ్చని చెప్పింది. సముద్ర మార్గంలో విదేశాల నుంచి వచ్చే వస్తువులపై కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం ఐజీఎస్టీ(రాష్ట్రాల మధ్య సరుకు రవాణాకు విధించే పన్ను) విధించడాన్ని తప్పుపడుతూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది రాజ్యాంగానికి, జీఎస్టీ చట్టానికి విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. ఇప్పటికే కేంద్రం సముద్ర రవాణాపై అక్రమంగా వసూలు చేసిన ఐజీఎస్టీని వెనక్కి ఇవ్వాలని, ఐజీఎస్టీ చెల్లించాలని నోటీసులు అందుకున్న దిగుమతిదారులు సదరు పన్నును చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
జీఎస్టీ మండలి సిఫార్సులకు అనుగుణంగా సీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్ట నిబంధనల్లో మార్పులు తెచ్చామని, జీఎస్టీలో ఏకాభిప్రాయ నిర్ణయానికి తాము కట్టుబడి ఉండాలని కేంద్రం పేర్కొనగా, పన్నుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ మండలి సిఫార్సులు చేస్తుందని మాత్రమే 279ఎ(4) ఆర్టికల్‌లో ఉందని, దానర్థం జీఎస్టీ మండలి చెప్పిందల్లా చట్టసభలు అంగీకరించాలని కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246ఎ ప్రకారం పన్నుల విషయంలో చట్టాలు చేయడానికి పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభకు సమాన అధికారాలు ఉన్నాయని పేర్కొంది. 279 నిబంధన ప్రకారం కేంద్రం, రాష్ట్రం ఒకరితో సంబంధం లేకుండా మరొకరు స్వతంత్రంగా చర్యలు తీసుకోలేరని గుర్తు చేసింది. మరికొన్ని అంశాలకు సంబంధించి కేంద్రానికి ఉన్న పైచేయి ఆధారంగా పన్నుల విషయంలోనూ కేంద్రానికే అనుకూలంగా ఉందనే భ్రమలు పెట్టుకోవద్దని చెప్పింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జరిపిన చర్చల నుంచి జీఎస్టీ మండలి సిఫార్సులు వెలువడతాయని, ఇందులో ఎవరికీ పైచేయి లేదని స్పష్టం చేసింది. భారత సమాఖ్య వ్యవస్థలో సహకారానికి, సహకార నిరాకరణకు మధ్య చర్చ జరుగుతుందని, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం సంప్రదింపుల్లో నిమగ్నమై ఉంటాయని చెప్పింది. కేంద్ర, రాష్ట్ర చట్టాల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు ఏం చేయాలో 2017 నాటి జీఎస్టీ చట్టంలో లేదని, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జీఎస్టీ మండలి సలహా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర చట్టాల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు ఏకపక్షంగా ఒకదాన్ని తిరస్కరించాలని రాజ్యాంగం ఎప్పుడూ చెప్పలేదని, పన్ను చట్టాలకు సంబంధించి కూడా అలాంటి వైరుధ్యం వచ్చినపుడు జీఎస్టీ మండలి సామరస్యపూర్వకంగా పనిచేసి, అందరికీ అనుకూలమైన పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పింది.