home page

సోరేన్ రాజీనామా చేయరట?

కొనసాగుతున్న సోరేన్ సంక్షోభం

 | 
Soren

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అనర్హత వేటుపై రెండురోజుల్లో క్లారిటీ వస్తుందని గవర్నర్‌ రమేశ్‌ బైస్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 5వ తేదీన జార్ఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరపాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.జార్ఖండ్‌ రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు జరుగుతున్నాయి. సీఎం హేమంత్ సోరెన్‌ రాజీనామా చేయడం లేదని యూపీఏ కూటమి ప్రకటించింది. అయినా

జార్ఖండ్‌లో పొలిటికల్‌ థ్రిల్లర్‌ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న వార్తల్లో నిజం లేదని యూపీఏ కూటమి నేతలు వెల్లడించారు. జార్ఖండ్‌ గవర్నర్‌ రమేశ్‌ బైస్‌తో కూటమి నేతలు భేటీ అయ్యారు. హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటుకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని గవర్నర్‌ను కూటమి నేతలు కోరారు. హేమంత్‌సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని మీకు ఈసీ నుంచి నివేదిక వచ్చిందా ? వస్తే ఎందుకు బహిర్గతం చేయడం లేదని గవర్నర్‌ రమేశ్‌ బైస్‌ను యూపీఏ కూటమి నేతలు ప్రశ్నించారు. సోరెన్‌పై అనర్హత వేటు పడుతుందని రాజ్‌భవన్‌ నుంచి లీకులు వస్తున్నాయని ఆరోపించారు. అయితే దీనిపై తన కార్యాలయం నుంచి ఎటువంటి లీక్‌లు వెళ్లడం లేదన్నారు గవర్నర్‌. హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటుకు సంబంధించి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చారు. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేసిందని , ఆ కుట్రలో రాజ్‌భవన్‌ భాగస్వామిగా మారిందని సీఎం హేమంత్ సోరెన్‌ ఆరోపించారు. జార్ఖండ్‌ కేబినెట్‌ కీలక భేటీ జరిగింది. సెప్టెంబర్‌ 5వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. నెలరోజుల పాటు హెలికాప్టర్‌ను లీజ్‌కు తీసుకోవాలని కూడా జార్ఖండ్‌ కేబినెట్‌ నిర్ణయించింది. ఒకవేళ తనపై అనర్హత వేటు పడితే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరబోతున్నారు హేమంత్‌ సోరెన్‌. రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు హేమంత్‌ సోరెన్‌. సీఎం పదవిని దుర్వినియోగం చేశారని , సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని ఈసీ నుంచి గవర్నర్‌కు సిఫారసు లేఖ అందిన తరువాత జార్ఖండ్‌ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గవర్నర్‌ ఇప్పటివరకు తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుందన్న భయంతో యూపీఏ కూటమి ఎమ్మెల్యేలను చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు. గవర్నర్‌ రమేశ్‌ బైస్‌ తీరుపై మండిపడుతున్నారు జేఎంఎం నేతలు. ఈసీ నివేదిక వచ్చిన తరువాత కూడా గవర్నర్‌ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.