home page

రూపాయి నేలచూపులు, నిర్మలమ్మ బేలచూపులు

ఈపాపం మోడీ సర్కారుది కాదా?

 | 
Modi

రూపాయి నేల చూపులు, నిర్మలమ్మ  బేలచూపులు

ఆర్థిక కల్లోలం..

అథఃపాతాళానికి రూపాయి విలువ.. అంతు తెలియని లోతులో ఆర్థిక లోటు
హారతి కర్పూరంలా తరుగుతున్న డాలర్లు

నిధుల కోసం పాలపైనా పన్నులేస్తున్న కేంద్రం
ఇప్పటికే మోయలేని భారమైన ధరలు
మాంద్యం వైపు ఆర్థిక వ్యవస్థ పరుగులు
మోదీ అస్తవ్యస్త విధానాలతో అతలాకుతలం
ఆర్థికవేత్తలు హెచ్చరించినా ఒంటెత్తు పోకడ

దీనికి పేరు మోసిన ఆర్థికవేత్తలంతా చెప్తున్న మాట.. భారత్‌. ఆర్థిక సంక్షోభంలో విలవిలలాడి శ్రీలంక ఇప్పటికే అప్పుల ఎగవేతదారు (డిఫాల్టర్‌)గా మారింది. పాకిస్థాన్‌లో ప్రజలు కప్పు చాయ్‌ కూడా తాగలేని దుస్థితి నెలకొంది.. త్వరలో భారత్‌లోనూ అవే పరిస్థితులు రాబోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. వేగంగా తరిగిపోతున్న మన విదేశీ మారక నిల్వలు చూస్తుంటే ఈ మాట నమ్మక తప్పటంలేదు.

ధరలను, రూపాయిని కట్టడి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచే కరెంట్‌ ఖాతా కూడా దారి తప్పింది. గత తొమ్మిదేండ్లుగా 1 శాతం మిగులు లేదా 2 శాతం లోటు మధ్యనున్న కరెంట్‌ ఖాతా లోటు (వచ్చి, పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం) భారీగా పెరిగిపోయింది. ఒక వైపు విదేశీ పెట్టుబడిదారులు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి డాలర్లు తరలించుకుపోవడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెద్ద పరిశ్రమలను ఆకర్షించలేకపోవడంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ముఖం చాటేశాయి. దీంతో కరెంట్‌ ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 3 శాతానికి చేరుతుందని అంచనా. 2021-22లో ఇది 1.2 శాతం.

న్యూఢిల్లీ, జూలై 6: భారత్‌ను 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారుస్తానన్నారు.. దేశాన్ని విశ్వ గురువు స్థానంలో నిలబెడతానని రోజుకోసారి శపథం చేస్తున్నారు.. దేశానికి ఇక స్వర్ణయుగమే అన్నట్టుగా ఆర్భాటాలు చేస్తున్నారు.. కానీ దేశం ఇంకా మూడు ట్రిలియన్‌ డాలర్ల మార్కే దాటలేదు. పన్నుల భారం మోయలేక ప్రజల నడ్డి విరుగుతున్నది. విశ్వ గురువేమోగానీ, దేశంమీద పెట్టుబడిదారులకు విశ్వాసమే లేకుండా పోతున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు చెప్తున్న మాటలకు, చేస్తున్న పనులకు ఉన్న తేడా ఇది.

పతనంవైపు వేగంగా..
బీజేపీ ప్రభుత్వం కొద్ది సంవత్సరాలుగా ఎడాపెడా పన్నులేసి నెట్టుకొస్తున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఊపిరాడని స్థితికి చేరింది. అసమర్థ విధానాలతో దేశ ప్రాథమిక ఆర్థిక సూత్రాలు తారుమారవుతున్నాయి. ధరలు కొండెక్కాయి. టోకు ద్రవ్యోల్బణం మూడు దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. వృద్ధి సంగతి అటుంచితే, అన్ని లోట్లు పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు పూడ్చలేనంతగా పెరిగిపోయింది. కరెంట్‌ ఖాతా లోటు, వాణిజ్య లోటు వాటి లోతెంతో చూపిస్తున్నాయి. విదేశీ రుణం పెరిగిపోయింది. రూపాయి నిలువునా పతనమయ్యింది. ఏం చేయాలో పాలుపోక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దిక్కులు చూస్తున్నారు. హఠాత్తుగా చమురు, పెట్రో కంపెనీలపై రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని తెచ్చేందుకు పన్నులు వడ్డించారు. బంగారంపై సుంకాలు వేసి ధరలు పెంచేశారు. ఏమిటీ పన్నులని ప్రశ్నిస్తే 'ఇవి అసాధారణ సమయాలని, ఈ చర్యలు తప్పవని' అంటున్నారు. జీఎస్టీ మినహాయింపులో ఉన్న నిత్యావసరాలపై కూడా పన్ను వేశారు. ఆర్థిక మంత్రి చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికిది ఇప్పుడు అసాధరణ పరిస్థితే. ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిన పెట్టాలో దిక్కుతోచని స్థితి. వచ్చే కొద్ది నెలల్లో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మాంద్యంలో చిక్కుకొంటే, భారత ఆర్థిక వ్యవస్థ సైతం తీవ్ర సంక్షోభంలోకి జారుకొంటుందని విశ్లేషకులు అంటున్నారు. బ్యాంకింగ్‌, కరెన్సీ, రుణ సంక్షోభాలు ముంచెత్తుతాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ జేఎం ఫైనాన్షియల్‌ హెచ్చరిస్తున్నది. కేంద్ర తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వృద్ధి రేటు కుప్పకూలుతుందని రిజర్వ్‌బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ కూడా హెచ్చరించారు.

40 బిలియన్లు ఖర్చయినా ఫలితం శూన్యం
డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికార్డు కనిష్టస్థాయికి పడిపోయి 80 వైపు చూస్తున్నది. కరెన్సీ పతనంతో పెట్రోల్‌, డీజిల్‌, వంటనూనెలు, పప్పులు తదితరాల ధరలన్నీ ఆకాశాన్ని తాకాయి. రూపాయి పతనాన్ని నిలువరించేందుకు ఈ ఏడాది ఇప్పటివరకూ రిజర్వ్‌బ్యాంక్‌ 40 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసినా ఉపయోగం లేకుండాపోయింది. ఈ ఆరు నెలల్లో రూపాయి 6 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 40-50 బిలియన్‌ డాలర్లు కేవలం రూపాయిని ఆపడానికే ఖర్చు చేయాల్సి ఉంటుందని ఒక అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది.

డాలర్‌ నిల్వకు, రూపాయికి 'విదేశీ రుణం' ముప్పు
గత ఏడాది ఒకానొక సమయంలో 650 బిలియన్‌ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన మన విదేశీ మారక నిల్వలు ఇప్పుడు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. రూపాయి అదుపునకు ఆర్బీఐ యధేచ్చగా డాలర్లను వెదజల్లడం, విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లను తరలించుకుపోవడంతో ఇప్పుడు మన వద్ద ఫారెక్స్‌ నిల్వలు 590 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం, కార్పొరేట్లు కలిసి 267 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాన్ని చెల్లించాల్సి ఉన్నది. దేశం వద్ద ఉన్న ప్రస్తుత విదేశీ మారక నిల్వల్లో ఇది 45 శాతం. ఆర్బీఐ విడుదల చేసిన డాటా ప్రకారం 2022 మార్చినాటికి మొత్తంగా 620 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణం ఉన్నది. ముఖ్యంగా వచ్చే 3-6 నెలల్లో భారీగా విదేశీ రుణాలు చెల్లించాల్సి ఉన్నది. వీటి చెల్లింపుల సందర్భంగా రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని డీబీఎస్‌ బ్యాంక్‌ ఎండీ అశీష్‌ వైద్య చెప్పారు. ఈ రుణాల చెల్లింపునకు అటు కార్పొరేట్లు, ఇటు ప్రభుత్వం అధిక వడ్డీకి రుణాలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం అనిశ్చితిలో ఉన్న అంతర్జాతీయ మార్కెట్లో అప్పు పుడితే సరే..లేదంటే డాలర్‌ నిల్వలన్నీ హరించుకుపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 1991లో కూడా ఇదే జరిగింది. మన దేశం బంగారం తనఖా పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు శ్రీలంక, పాకిస్థాన్‌లో కూడా అదే జరుగుతున్నది. 2008 ఆర్థిక సంక్షోభం సందర్భంగా డాలర్లు లభించక, కేవలం రెండు వారాలకు సరిపడా ముడి చమురును దిగుమతి చేసుకొనే పరిస్థితి ఏర్పడిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే విదేశీ మారకం కరువై, మూడు దశాబ్దాల క్రితం ఇంగ్లాండ్‌లో ప్రభుత్వం బంగారం తనఖా పెట్టిన సంగతినీ ప్రస్తావిస్తున్నారు.

దిగుమతుల బిల్లు తడిసి మోపెడు
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో అనేక వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ముడి చమురు నిల్వలు, బొగ్గు నిల్వలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందుచూపులేకుండా వ్యవహరించడంతో దిగుమతుల బిల్లు భారీగా పెరిగింది. దీంతో ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వాణిజ్యలోటు ఎన్నడూ లేనంతగా 70.25 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరుడు ఇదేకాలంలో ఈ లోటు 31.42 బిలియన్‌ డాలర్లు మాత్రమే. వాణిజ్యలోటు భారీగా పెరిగినందున, ఏప్రిల్‌-జూన్‌లో కరెంట్‌ ఖాతా లోటు 13 బిలియన్‌ డాలర్ల నుంచి 30 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అథితి నాయర్‌ అంచనా వేశారు. ఇలా ఒకదాని వల్ల మరొకటి పెరిగిపోవడం, తద్వారా రూపాయి మరింత క్షీణించడం, ధరలు ఆకాశాన్నంటడం చకచకా జరిగిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మేలో టోకు ద్రవ్యోల్బణం మూడు దశాబ్దాల గరిష్ఠం 15.9 శాతానికి చేరగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం గత మూడు నెలలుగా 7-8 శాతానికి పెరిగిపోయింది.

ద్రవ్య లోటు దడ
ఆర్థిక నిర్వహణా సామర్థ్యాన్ని కొలిచేందుకు ప్రపంచ రేటింగ్‌ ఏజెన్సీలు ప్రామాణికంగా పరిగణించే ద్రవ్యలోటు విషయంలో కేంద్రం పూర్తిగా అదుపు కోల్పోయింది. దీనిని 6 శాతంలోపునకు రప్పిస్తామంటూ హోరెత్తించిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు ఎక్కడ పన్నులేయాలా అని చూస్తున్నది. 2022 ఏప్రిల్‌- మే నెలల్లో ఈ లోటు బడ్జెట్‌ అంచనాల్లో 12 శాతానికి చేరిపోయింది. నిరుడు ఇదేకాలంలో ఇది 8 శాతం. పెట్టుబడులు ఉపసంహరణ లక్ష్యంగా నిర్దేశించుకొన్న రూ.60 వేల కోట్ల సమీకరణ ఇప్పటి మార్కెట్‌ పరిస్థితుల్లో అసాధ్యంగా మారింది. దీంతో ద్రవ్యలోటు మరింత పెరగకుండా చూసేందుకు కేంద్రం కొత్త పన్నులు, సుంకాలు వేస్తున్నదని నిపుణులు అంటున్నారు.

మాట వినని సీతయ్య
నరేంద్రమోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటినుంచి దేశాన్ని ప్రభావితం చేసే అనేక నిర్ణయాలు ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకొంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక విధానాల్లో ఆయన వైఖరి 'ఎవరి మాటా వినడు సీతయ్య' అన్నట్టుగా మారిందని అంటున్నారు. అందువల్లనే ఇప్పటికే ముగ్గురు ఆర్థిక సలహాదారులు మారిపోయారు. ముగ్గురు ఆర్బీఐ గవర్నర్లు పదవులు వదిలేసి వెళ్లిపోయారు. తీరా ఇప్పుడు సంక్షోభం పూడ్చలేని స్థాయికి చేరటంతో పరిష్కార మార్గం చూపేవారి కోసం చూస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో రూపాయి విలువ ఎందుకు పడిపోతున్నదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అధికారుల వైపు బేలగా చూడటం బీజేపీ ప్రభుత్వ పరిస్థితికి అద్దం పడుతున్నది