home page

ప్రతిఘటనోద్యమాలే మార్గం

జెఎన్ యు ప్రొఫెసర్ మజుందార్

 | 
Mazumdar

90 శాతం మంది ప్రజలకు ఆర్ధిక సమస్యలే ఎక్కువ

ప్రతిఘటనోద్యమాలే మార్గం
-దాచూరి రామిరెడ్డి నగర్‌ (విజయవాడ) : దేశం ఎదుర్కుంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని, ఎనిమిదేళ్ల కేంద్ర బిజెపి హయాంలో కార్పొరేట్‌ అనుకూల విధానాలను పరుగులు పెట్టిస్తుండటంతో సంక్షోభం ముదురుతోందని జెఎన్‌యు ప్రొఫెసర్‌ సురజిత్‌ మజుందార్‌ చెప్పారు.

సంక్షోభ ప్రభావంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుదించుకుపోతున్నాయన్నారు. దాంతో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని, కొనుగోలు శక్తి పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ ఎదుగూబదుగూ లేని స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. ఇటీవలి రైతు ఉద్యమం అందించిన స్ఫూర్తితో ప్రభుత్వ హానికర విధానాలకు సంఘటిత ప్రతిఘటనోద్యమాలను చేపట్టాలని, అదే ఏకైక మార్గమని చెప్పారు. ఎస్‌టిఎఫ్‌ఐ 8వ మహాసభల చివరి రోజు ఆదివారం 'ఆర్థిక సంక్షోభం- ప్రైవేటీకరణపై వ్యతిరేకత' అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో మజుందార్‌ కీలక ఉపన్యాసం చేశారు. సరళీకరణ విధానాలు మొదలయ్యాక ఈ 30 ఏళ్లలో క్రమంగా సంక్షోభం పెరుగుతూ, బిజెపి పాలనలో ఎక్కువైందన్నారు. ఎన్నికల ప్రక్రియ అనేది అసలు విషయమే కాదు. రాజకీయ లక్ష్యంలోనే మొత్తం విషయమంతా ఉంది. 90 శాతం మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలంలో సంఘటిత రంగం, ప్రభుత్వరంగం కుదించుకుపోయింది. ఉద్యోగాలు నష్టపోయారు. ప్రభుత్వ, కో-ఆపరేటివ్‌, ప్రైవేటు అన్నీ కలుపుకున్నా 35 శాతం మందికే సంఘటితరంగంలో ఉద్యోగాలున్నాయి. మొత్తం జనాభాతో పోల్చితే భారీ వ్యత్యాసం ఉంది. ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో క్యాజువల్‌ కార్మికుని రోజు సగటు వేతనం రూ.300. అత్యధికుల సగటు నెల వేతనం రూ.16-17 వేలే. మూడు దశాబ్దాలుగా ఫ్యాక్టరీల్లో వేతనాలు పెరగలేదు. కార్మిక చట్టాల స్థానంలో కోడ్స్‌ తేవడంతో ఆ అవకాశాలూ సన్నగిల్లుతున్నాయి. వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి లేకపోడం, అక్కడా సంక్షోభం కొనసాగుతుండటంతో ఆ రంగంలో ఆదాయాల పరిస్థితీ బాగాలేదు. వ్యవసాయేతర రంగమైన నిర్మాణ రంగం వైపు మళ్లుతుండగా ప్రజల్లో కొనుగోలు శక్తి లేక రియల్‌ ఎస్టేట్‌ సైతం సంక్షోభంలో పడింది.

  • పెద్ద కార్పొరేట్ల కంట్రోల్‌

పెద్ద కార్పొరేట్లు ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నాయని, వాటి అనుకూల విధానాలు రూపొందుతున్నాయని, ఈ క్రమంలో ఆశ్రితపక్షపాతం, అవినీతి పెరుగుతోందని మజుందార్‌ తెలిపారు. 300 కార్పొరేట్‌ కుటుంబాల సంపద 55 దేశం జనాభా సంపదతో సమానం. అదానీ, అంబానీల సంపద పెరుగుదలే ప్రామాణికం కాదు. చమురు ధరల వంటి పరోక్ష పన్నులు ప్రజలపై వేసి, కార్పొరేట్లకు రాయితీలిస్తోంది. ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు లీజుకిచ్చి, ఆ డబ్బుతో పెట్టుబడి పెడతామంటోంది. ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతోంది. సహకార రంగంపై మోడీ కన్ను పడింది. ఎన్‌ఇపిలోనూ అదే సూత్రం. ఆర్థిక సంక్షోభానికి కారణాలను, ఎవరు వాటిని సృష్టించారో ప్రజలందరూ ఆలోచించాలి. విద్యారంగ పరిక్షణకు టీచర్లు పోరాడాలి.. అని చెప్పారు.

  • ప్రమాదంలో మత సామరస్యం

దేశంలో మత సామరస్యం ప్రమాదంలో పడిందని, వామపక్షాలు, ప్రజాస్వామిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఒక్కటై మత సామరస్యాన్ని కాపాడుకోవాలని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ అన్నారు. 'జాతికి మత సామరస్యం అవసరం' అనే అంశంపై ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. మతోన్మాదం, మత అల్లర్లు కేంద్రంలోని బిజెపి రాజ్య ప్రాయోజిత ప్రాజెక్టు. అయోధ్య, గుజరాత్‌, ముజఫర్‌నగర్‌ ఈ ఉదంతాలన్నీ ఒక పథకం ప్రకారం చేసినవి. రాజ్యాంగ మనుగడకు ప్రమాదం ఏర్పడింది. సమానత్వం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం లేవు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీడియా సైతం కార్పొరేటీకరణ జరగడంతో ప్రజలు పట్టట్లేదు. బిజెపి సర్కారుకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ చర్యలతో ఎదుర్కోవాలి. కార్మికులకు, ఉద్యోగులకు అవసరమైన రాజకీయ విద్యనందించాలి. సోషల్‌ మీడియా సహా డిజిటల్‌ మాధ్యమాల్లో ప్రచారం చేయాలి. టీచర్లు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేయాలి.. అని సూచించారు. సెమినార్‌కు ఫెడరేషన్‌ నేత భద్రూద్దోజాఖాన్‌ అధ్యక్షత వహించారు.