home page

బిజెపి మాటలు- అంటుకున్న మతం మంటలు

గల్ఫ్ దేశాల్లో ఆందోళనలు 

 | 
Sharna

అంతర్జాతీయ వేదికలపై అవమానాలు

నిత్యం మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ నేతలు
నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ అనుచిత వ్యాఖ్యలు
భారత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇస్లాం దేశాలు
భారత రాయబార్లకు ఇరాన్‌, ఖతార్‌, కువైట్‌ సమన్లు
మన దేశ వస్తువులు, సినిమాల బహిష్కరణకు పిలుపు
భారత్‌ను ఏకాకిని చేసేలా అరబ్‌ దేశాల ప్రయత్నాలు
ప్రమాదంలో లక్షలమంది గల్ఫ్‌ కార్మికుల జీవితాలు
'బీజేపీవాళ్లు ఇట్లనే మతం గొడవలు లేపితే..మత చిచ్చు పెడితే విదేశాల్లో ఉన్న మనవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇతర దేశాల్లో మనవాళ్లు 12 కోట్ల మంది ఉన్నారు. అరబ్‌ దేశాల్లో కూడా ఎంతోమంది పనులు చేసుకొంటున్నారు. ఆ దేశాలు వాళ్లను పొమ్మంటే వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తదా? ఈ మతం గొడవలు చూసి అంతర్జాతీయ పెట్టుబడి ఒక్కటైనా వస్తదా? అంతర్జాతీయంగా దేశం పరువు నిలబడుతదా?'
– కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వేసిన ప్రశ్నలివి.
హైదరాబాద్‌, జూన్‌ 5 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌ ఊహించినట్టే జరుగుతున్నది. బీజేపీ నిర్వాకం వల్ల ప్రపంచం ముందు భారత్‌ తలవంచుకొనే దుస్థితి వచ్చింది. దేశం మతకోణంలో అంతర్జాతీయంగా భ్రష్టుపట్టి పోతున్నది. పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన భారతీయుల ఉపాధితోపాటు వాళ్ల జీవితాలే ప్రమాదంలో పడే పెను ముప్పు పొంచి ఉన్నది. రెండుమూడేండ్లుగా ఓట్లు, సీట్ల కోసం బీజేపీ పెడుతున్న మత చిచ్చు ఇప్పుడు అదుపు తప్పుతున్నది. బీజేపీలోని చిన్నా చితకా నేతల నుంచి పార్టీ రాష్ర్టాల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు కూడా తరుచూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాటలు తూలుతున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ 'మసీదులను తవ్వుదాం.. శవాలొస్తే మీకు, శివాలొస్తే మాకు' అని రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాజాగా మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతలు నుపూర్‌ శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ చేసిన కామెంట్ల వల్ల అరబ్‌, పర్షియన్‌ గల్ఫ్‌ దేశాలతో మన సంబంధాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. ఇరాన్‌, ఖతార్‌, కువైట్‌ ఏకంగా భారత రాయబార్లకు సమన్లు పంపి తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి.
బీజేపీ నేతల ప్రకటన భూమిపై ఉన్న ముస్లింలందరినీ అవమానించినట్టేనని ఇరాన్‌ విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది. బీజేపీ నేతల నిర్వాకంతో ఇస్లామిక్‌ దేశాలన్నీ భారత్‌కు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయి. భారత్‌కు చెందిన వస్తువులను, సినిమాలను బహిష్కరించాలని అరబ్‌ దేశాల్లోని సోషల్‌ మీడియాలో పెద్ద ఉద్యమమే మొదలైంది. సందు దొరికితే భారత్‌ను ఇరుకున పెట్టాలని చూసే పాకిస్థాన్‌కు ఇప్పుడు బీజేపీ పెద్ద ఆయుధమే ఇచ్చినట్టయ్యింది. నరేంద్రమోదీ పాలనలో భారత్‌లో మత హింస పెరిగిందని, దీనిని ప్రపంచమంతా ఖండించాలని పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం ఓ ప్రకటన చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్టు బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నూపుర్‌శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. తమ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'భారతదేశం అనాదిగా భిన్న సంస్కృతులకు నెలవు. బీజేపీ అన్ని మతాలనూ గౌరవిస్తుంది. మతాన్ని కించపరిచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదు. ఇతర మతాలను కించపరిచే భావజాలానికి బీజేపీ పూర్తి వ్యతిరేకం. మన దేశ రాజ్యాంగం మనకు ఇష్టమైన మతాన్ని ఆచరించే, గౌరవించే హక్కు ఇచ్చింది' అని బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ప్రకటన చేశారు.
ఒకరు రెచ్చగొడతారు.. మరొకరు ఖండిస్తారు
దేశంలో బీజేపీ మత నమ్మకాలతో అత్యంత ప్రమాదకరమైన ఆట ఆడుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి చెందిన ఒక నేత ఇతర మతాలను కించపర్చేలా మాట్లాడటం, దానిపై నిరసనలు చెలరేగితే.. అదే పార్టీకి చెందిన మరో నేత తూతూ మంత్రంగా ఓ ఖండన ప్రకటన ఇవ్వటం పరిపాటిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శులు నుపూర్‌ శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ వ్యవహారాన్నే ఉదాహరణగా చెప్తున్నారు. నుపూర్‌ శర్మ ఇటీవల ఓ టీవీ చర్చలో మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీ మరో కార్యదర్శి నవీన్‌కుమార్‌ జిందాల్‌ సోషల్‌మీడియాలో అలాంటి పోస్టే ఒకటి పెట్టారు. వీరి చర్యలను మొదట బీజేపీ నేతలెవరూ ఖండించలేదు. మన దేశంతోపాటు అంతర్జాతీయంగా ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెరగటంతో నుపూర్‌ను బీజేపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. జిందాల్‌ను కూడా బహిష్కరించి ఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికలు ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఇలాంటి ప్రకటనలు విపరీతంగా వస్తుంటాయి. వాళ్ల విద్వేష ప్రకటనలపై నిరసన వస్తే తప్ప కొన్నిసార్లు బీజేపీ అధిష్ఠానం కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోదు.
ప్రజల దృష్టి మరల్చడానికే..
స్థూలంగా చూస్తే బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఆరెస్సెస్‌ చీఫ్‌ ఖండించినట్టు, బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ వ్యాఖ్యలను బీజేపీ ఖండించినట్టు అనిపిస్తుంది. అయితే ఇదంతా పైపై మెరుగే. సాధారణంగా బీజేపీలో ఇంత మార్పు రాదన్నదని నిపుణుల మాట. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడింది. యూపీలో గెలిచినా సీట్లు తగ్గాయి. కేరళలోని త్రిక్కకర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. ఒడిశాలోని బ్రజరాజ్‌ నగర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికే పరిమితం అయ్యింది. దీంతో ప్రజల్లో తమపై వ్యతిరేకత పెరుగుతున్నదని బీజేపీ గ్రహించింది. ప్రజల దృష్టిని మరల్చేందుకు మరో పాచిక విసిరిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కించపర్చడం నా ఉద్దేశం కాదు
 నా వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే వాటిని బేషరతుగా వెనక్కి తీసుకొంటున్నా. ఇతరుల మత విశ్వాసాలను కించపర్చడం నా ఉద్దేశం కాదు.
-నూపుర్‌ శర్మ, బహిష్కృత బీజేపీ నేత
విద్వేషమే ఎన్నికలాస్త్రం
ఎన్నికల్లో బీజేపీ విద్వేష వ్యాఖ్యలనే నమ్ముకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఎన్నికల సమయాల్లో రెచ్చగొట్టిన వివిధ విద్వేషపూరిత అంశాలను వారు ఉదహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇది అనుభవంలోకి వచ్చింది. గతంలో బెంగాల్‌లో, ఇటీవల యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చలవిడిగా విద్వేష వ్యాఖ్యలు చేశారు. 'జై శ్రీరాం' పదాన్ని తమకు అనుకూలంగా వాడుకొని విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ఒక దశలో జై శ్రీరాం అనకపోతే దేశం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేశారు. 'దేశంలో హిందూ ఆలయాలను కాపాడుకోవాలంటే ఎక్కువ మంది పిల్లలను కనండి', 'ఓ వర్గం వారు లేకుంటే గ్రామాలు ప్రశాంతంగా ఉంటా యి', 'హిందూత్వాన్ని కాపాడుకోవాలంటే ఆయుధాలు చేతపట్టాలి' అంటూ జూనా అఖాడా కీలక సభ్యుడు నరసింహానంద్‌ సరస్వతి గతేడాది డిసెంబర్‌లో, ఈ ఏడాది జనవరిలో అడ్డూఅదుపు లేకుండా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో యూపీ, మణిపూర్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాల ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రావడంతో ఆ వ్యాఖ్యలను ఎవరూ ఖండించలేదు.
ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి?
 రాష్ట్రంలోని మసీదుల పునాదులను తవ్వుదాం.. శవాలు బయటపడితే మీకు, శివాలు (శివలింగాలు) బయటపడితే మేం తీసుకుంటాం.
– తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (మే 26న)
 బీజేపీ అన్నిమతాలనూ గౌరవిస్తుంది. ఏ మతాన్నీ కించపర్చేలా వ్యవహరించదు.
-అరుణ్‌సింగ్‌, బీజేపీ జాతీయ కార్యదర్శి (జూన్‌ 5)
 
భవిష్యత్తులో త్రివర్ణ పతాకాన్ని కాషాయంగా మార్చుతాం.
– కర్ణాటక మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప (మే 30న)
 దేశంలోని ప్రతి మసీదునూ తవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఇలాంటి ఉద్యమాల్లో మేం పాల్గొనం.
– మోహన్‌ భాగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ (జూన్‌ 4)
 దేవుళ్లను మోసం చేసి ముస్లింలు హిందూ ఆలయాలను గుంజుకున్నరు.
రామ్‌సూరత్‌ రాయ్‌, బీహార్‌ మంత్రి (జూన్‌ 4)
మరి బండిపై చర్యలేవి?
బీజేపీ ఆడుతున్న ప్రమాదకరమైన మతచిచ్చు ఆటను మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా ఖండించారు. అన్ని మతాలను గౌరవిస్తామన్న బీజేపీ ప్రకటనలోని విశ్వసనీయతను ఆయన సూటిగా ప్రశ్నించారు. 'బీజేపీ నిజంగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందా? మరైతే మసీదులను తవ్వుతామని, ఉర్దూపై నిషేధం విధిస్తామని బహిరంగ ప్రకటన చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయలేదు? ఎందుకీ ప్రత్యేక విధానం జేపీ నడ్డాజీ? ఈ విషయంలో మీకు ఏదైనా క్లారిటీ ఉన్నదా?' అని ప్రశ్నిస్తూ ఆదివారం ట్వీట్‌ చేశారు.
ఇదీ మన పరిస్థితి
ప్రపంచంలోనే అతి పెద్దదైన, గొప్ప వైవిధ్యం ఉన్న భారతదేశంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి. ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేస్తున్నారు. కొంతమంది అధికారులు దాడులను అడ్డుకోవడానికి బదులుగా ప్రోత్సహిస్తున్నారు. మతపరమైన హింసకు సంబంధించి 2021 డాటాను విడుదల చేయడంలో కేంద్రం విఫలమైంది.
– అమెరికా విడుదల చేసే అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక
కాన్పూర్‌లో బుల్డోజర్లు
 
బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. దాదాపు 40 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణకు కారణమయ్యారంటూ పోలీసులు ఒక వర్గానికే చెందిన 18 మందిని అరెస్టు చేశారు. వారిపై అత్యంత తీవ్రమైన గ్యాంగ్‌స్టర్‌ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఘర్షణకు కారణమైన వారిని గుర్తించామని, త్వరలోనే వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని, ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేస్తామని కాన్పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ విజయ్‌సింగ్‌ మీనా ఆదివారం తెలిపారు. అయితే, ఇప్పటికే బుల్డోజర్లను సిద్ధంచేశారని, కాన్పూర్‌ సరిహద్దుల్లో అవి ఉన్నట్టు వార్తలు వచ్చాయి.