home page

ప్రాంతీయ భాషలూ విలువైనవి

బిజెపి సమావేశంలో ప్రధాని మోడీ

 | 
Modi
న్యూఢిల్లీ : భాషా వైవిద్ధ్యం భారత దేశానికి గర్వకారణమని, అయితే దీనిపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో బీజేపీ (BJP) ఆఫీస్ బేరర్ల జాతీయ స్థాయి సమావేశం ప్రారంభం సందర్భంగా వర్చువల్ విధానంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఈ సమావేశాలు రెండు రోజులపాటు జరుగుతాయి.

భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని మోదీ చెప్పారు. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి (Indian Culture) ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోందని, అవి పూజించదగినవని పరిగణిస్తుందని చెప్పారు. భారత దేశ మెరుగైన భవిష్యత్తుకు ఇది అనుసంధానమని తెలిపారు. అన్ని ప్రాంతీయ భాషలకు జాతీయ విద్యా విధానం (NEP) ప్రాధాన్యమిచ్చిందన్నారు. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు.

హిందీ (Hindi)ని భారత దేశ జాతీయ భాషగా పరిగణించాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రి, అధికార భాషా సంఘం పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అమిత్ షా (Amit Shah) గత నెలలో ఆ సంఘం సభ్యులతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ ఎజెండాలో దాదాపు 70 శాతం హిందీలోనే రాస్తున్నట్లు తెలిపారు. దేశ ఐకమత్యం కోసం హిందీని ముఖ్య భాగంగా చేయవలసిన సమయం ఆసన్న మైందని అమిత్ షా చెప్పినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఇతర భాషలను మాట్లాడే రాష్ట్రాల ప్రజలు పరస్పరం మాట్లాడుకోవలసిన అవసరం వచ్చినపుడు భారత దేశం (India)లోని భాషలో మాట్లాడుకోవాలని చెప్పినట్లు పేర్కొంది. హిందీని స్థానిక భాషలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయంగా అంగీకరించాలని తెలిపినట్లు పేర్కొంది.

దీంతో వివిధ రాజకీయ పార్టీలు ఘాటుగా స్పందించాయి. భారత దేశ బహుతావాదంపై దాడిగా అభివర్ణించాయి. బీజేపీ హిందీని ప్రజలపై రుద్దుతోందని ఆరోపించాయి.