home page

భారత ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియామకం

నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం

 | 
ECI
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది.

ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్ చంద్ర పదవీకాలం మే 14తో ముగియనుంది. దీంతో మే 15న రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా భాద్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఆయన షేర్ చేశారు.

''రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లోని క్లాజ్ (2) ప్రకారం.. మే 15, 2022 నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్‌ను నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషిస్తున్నారు. రాజీవ్ కుమార్‌కు నా శుభాకాంక్షలు'' అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్ జార్ఖండ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. పబ్లిక్‌ పాలసీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాకుండా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ సస్టెయినబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీల్లో పట్టభద్రులు. ఆయన 2020 ఫిబ్రవరిలో ఐఏఎస్‌గా పదవి వీరమణ పొందారు. 2020 సెప్టెంబర్‌లో భారత ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు.. రాజీవ్ కుమార్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన 2020 ఫిబ్రవరిలో ఆ బాధ్యతలు చేపట్టారు.

కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆర్థిక రంగంలో విలీనాలు, కొనుగోళ్లను రూపొందించడంలో, అమలు చేయడంలో రాజీవ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. దాదాపు 18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)ని క్రమబద్ధీకరించడం కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది.

మరిన్ని తాజా వార్తలకు www.mirrortoday.in చూడండి