home page

ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ వివరణ ఇవ్వక తప్పదు: దువ్వూరి

మాజీ గవర్నర్ అభిప్రాయం

 | 
దువ్వూరి

ద్రవ్యోల్బణా లక్ష్యాల వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వివరణ ఇచ్చుకోవాల్సి రావచ్చేమోనని మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

గతకొద్ది నెలలుగా ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యాన్ని దాటి నమోదవుతున్న విషయం తెలిసిందే. ధరల కట్టడి తప్పనిసరి దృష్ట్యా ఒకవేళ వరుసగా మూడు త్రైమాసికాలు లక్షిత శ్రేణిని మించి ద్రవ్యోల్బణ సగటు నమోదైతే కేంద్రానికి ఆర్బీఐ తమ వైఫల్యంపై లేఖ రాయాల్సి ఉంటుందని దువ్వూరి తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ క్రమంలోనే బహుశా సెప్టెంబర్లోగా ఈ లేఖ రాయాల్సిన అవసరం ఆర్బీఐకి రావచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. ఇందులో ద్రవ్యోల్బణాన్ని ఎందుకు నియంత్రించలేకపోయామన్నది, అందుకు కారణాలు ఏమిటన్నది, ధరల ఉపశమనానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామన్నది వివరించాలన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి
నిజానికి ఈ లేఖ ద్వారా ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో తమకు ఎదురవుతున్న సవాళ్లను కేంద్రానికి ఆర్బీఐ తెలియపర్చే అవకాశం ఉంటుందని దువ్వూరి ఈ సందర్భంగా అన్నారు. కాబట్టి ఆర్బీఐ ఆ పనిచేస్తే బాగుంటుందని హితవు పలికారు. కాగా, ద్రవ్యోల్బణాన్ని 4 శాతం దిగువనే ఉంచాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్నది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ 6 శాతాన్ని మించరాదనీ నిర్దేశించుకున్నది. కానీ మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏకంగా 17 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 6.95 శాతంగా నమోదైంది. ఆర్బీఐ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటి ఇలా పెరగడం ఇది వరుసగా మూడోసారి. అందుకే ఇటీవల అత్యవసర ద్రవ్యసమీక్ష నిర్వహించి రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని 50 బేసిస్‌ పాయింట్లు చొప్పున ఆర్బీఐ పెంచేసింది.

ఆర్బీఐపై విమర్శలు వద్దు
ఇటీవలి అత్యవసర ద్రవ్యసమీక్షలో అనూహ్యంగా పెంచిన రెపో రేటుపైనా దువ్వూరి మాట్లాడారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే ఆర్బీఐ నిద్రపోతున్నదన్న విమర్శలు సరికాదన్నారు. కరోనా నేపథ్యంలో పడిపోతున్న దేశ వృద్ధిరేటును నిలబెట్టేందుకు కీలక వడ్డీరేట్లను రికార్డు స్థాయిలకు ఆర్బీఐ తగ్గించిందని, అన్ని పరిస్థితులను గమనించే ఇప్పుడు ద్రవ్యోల్బణం కట్టడి కోసం వడ్డీరేట్లను పెంచుతున్నదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్బీఐసహా అన్ని సెంట్రల్‌ బ్యాంక్‌లపై తీవ్ర ఒత్తిడి ఇప్పుడుందన్న విషయాన్ని మరువరాదన్నారు. కాగా, మార్కెట్‌లో స్తబ్ధత, ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ద్రవ్యోల్బణ-వృద్ధిరేట్లపై ప్రభావం వంటి అంశాలపైనా దువ్వూరి స్పందించారు.

సుంకాల భారం
ఏప్రిల్‌ నెలకుగాను రాబోయే ద్రవ్యోల్బణ గణాంకాలు 7 శాతంపైనే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం. అంతర్జాతీయ పరిస్థితులు, గ్లోబల్‌ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలు, సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులు దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తున్నాయని వారు చెప్తున్నారు. ఇక పెట్రో ధరలపై కేంద్ర ప్రభుత్వం బాదుతున్న సుంకాలు, సెస్సులతో ద్రవ్యోల్బణం మరింత ప్రమాదకర స్థాయికి చేరుతున్నదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయిప్పుడు. ఈ నేపథ్యంలోనే మున్ముందు వడ్డీరేట్లు మరింతపైకి పోవడం ఖాయమన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.